దేశంలో పెరుగుతున్న ఉల్లిపాయల ధరలను నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇదివరకే సేకరించిన బఫర్ స్టాక్‌ను మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు తాజాగా ప్రకటించింది. ఈ ఆర్థిక సంవత్సరానికిగానూ 3 లక్షల మెట్రిక్ టన్నుల ఉల్లిపాయలను కేంద్రం బఫర్ స్టాక్‌గా గోదాముల్లో భద్రపరిచింది. ఏటా మార్కెట్లోకి సరఫరా తగ్గి, ధరలు పెరిగిన సందర్భాల్లో కేంద్రం ఆ బఫర్ స్టాక్‌ను విడుదల చేస్తుంటుంది. దాంతో నిత్యావసరాల్లో ఒకటైన ఉల్లిపాయ ధరలు అమాంతం పెరగకుండా నియంత్రిస్తుంది. ‘దేశంలోని పలు రాష్ట్రాల్లోని ముఖ్యమైన మార్కెట్లకు ఉల్లి నిల్వలను పంపించాలని నిర్ణయించాం. ఈ ఏడాదిలోనే అత్యధిక ధరలు నమోదైన, దేశంలోని సగటు ఉల్లి రేటు కంటే ఎక్కువగా ఉన్న, గత నెలతో పోలిస్తే ధరలు పెరిగిన ప్రాంతాలకు వాటిని సరఫరా చేస్తాం. ఈ-వేలం, ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో రిటైల్ విక్రయ మార్గాల ద్వారా ఉల్లిని సరఫరా చేస్తామని’ ఆహార మంత్రిత్వశాఖ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రాలు ప్రజా పంపిణీ కోసం కోరితే తగ్గింపు ధరతో వాటిని సరఫరా చేస్తామని అందులో వెల్లడించింది.