టీ పాట్ గురించి తెలిసే ఉంటుంది. ఇది అందరికీ అందుబాటు ధరలోనే దొరుకుతుంది. రూ.100 నుంచి రూ.1000 వరకు ఉంటుంది. కొంచెం ప్రత్యేకమైనవైతే రూ.3,000 వరకు ఉంటాయి. అంతకు మించి అయితే ఉండవు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే టీపాట్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనది. దీని ధర రూ. కోట్లల్లో ఉంటుంది. అంత ఖరీదైన టీపాట్, దాని ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం పదండి.బ్రిటన్‌కు చెందిన ఎన్ సేథియా ఫౌండేషన్, లండన్‌లోని న్యూబీటీస్ సంయుక్తంగా తయారు చేయించిన ఈ టీపాట్‌ను.. ఇటాలియన్ ఆభరణాల వ్యాపారి ఫుల్వియో స్కావియా అత్యద్భుతంగా రూపొందించారు. దీన్ని 18 క్యారట్ల బంగారంతో తయారు చేశారు. చుట్టూ వజ్రాలను అమర్చారు. వాటి మధ్యలో 6.67 క్యారట్ల రూబీలను అమర్చారు. ఈ మొత్తం టీపాట్ తయారీలో 1658 వజ్రాలు, 386 ప్రామాణికమైన థాయ్, బర్మీస్ కెంపులు ఉపయోగించారు. ఇంత ప్రత్యేకంగా రూపొందించిన ఈ టీపాట్‌ను ‘ది ఇగోయిస్ట్’ అని కూడా పిలుస్తారు. 2016లోనే దీని విలువ 3 మిలియన్ డాలర్లుగా ఉంది. అంటే మన భారత కరెన్సీ ప్రకారం.. రూ.24 కోట్లన్నమాట. దీన్ని ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన టీపాట్‌గా గిన్నిస్ బుక్ తాజాగా గుర్తించింది. ఈ టీపాట్ ఫొటోలను, వివరాలను ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. అద్భుతమైన, అత్యంత ఖరీదైన ఈ టీపాట్‌ను మీరూ చూసేయండి మరి.