Politics

కాంగ్రెస్ లో తన పార్టీ విలీనంపై మౌనం: షర్మిల

కాంగ్రెస్ లో తన పార్టీ విలీనంపై మౌనం: షర్మిల

వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ఢిల్లీ పర్యటన ముగిసింది. అయితే కాంగ్రెస్‌లో చేరికపై మీడియా అడిగిన ప్రశ్నలకు ఆమె ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. చూద్దాం అంటూ షర్మిల అక్కడి నుంచి వెళ్లిపోయారు. పార్టీలోకి ఆహ్వానించినందుకు కోమటిరెడ్డికి ధన్యవాదాలు చెప్పారు షర్మిల. ఢిల్లీ పర్యటన బాగానే సాగింది.. అన్ని వివరాలు తర్వాత చెబుతానని ఆమె పేర్కొన్నారు.

అంతకుముందు కాంగ్రెస్‌లో వైఎస్ఆర్‌టీపీ విలీనం, షర్మిల చేరిక తదితర అంశాలపై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. షర్మిలకు కాంగ్రెస్‌ లోకి ఎప్పుడైనా ఆహ్వానం వుంటుందన్నారు. షర్మిలను కాంగ్రెస్‌లోకి ఆహ్వానిస్తున్నానని కోమటిరెడ్డి చెప్పారు. తెలంగాణ వ్యాప్తంగా షర్మిల పాదయాత్ర చేసిందని ఆయన ప్రశంసించారు. షర్మిల కాంగ్రెస్ లోకి వస్తే లాభమే జరుగుతుందని వెంకట్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. షర్మిల వల్ల 4 ఓట్లు వచ్చినా.. 400ఓట్లు వచ్చినా లాభమేనని ఆయన వ్యాఖ్యానించారు. అందరినీ కలుపుకుని పోవాల్సిన బాధ్యత పార్టీదేనని వెంకట్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పేరుతో కేసీఆర్ మహారాష్ట్రకు వెళ్లారని ఎద్దేవా చేశారు. వైఎస్సార్ కూతురిగా షర్మిలకు కాంగ్రెస్ లో ఎప్పుడైనా ఆహ్వానం వుంటుందని కోమటిరెడ్డి అన్నారు. షర్మిల చేరికపై పార్టీ హైకమాండ్ అడిగినప్పుడు ఇదే చెబుతానని వెంకట్ రెడ్డి తెలిపారు . ఒకరికొకరు కలిసి బలపడాలని కాంగ్రెస్ భావిస్తోందని కోమటిరెడ్డి పేర్కొన్నారు.