హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో మాదిరి ఓ కారు రయ్ మంటూ వచ్చి ఆగి.. రోబో మాదిరిగా మారిపోతే అక్కడున్న వారు భయపడి పారిపోతారేమో..? టర్కీకి చెందిన లెట్ విజన్ అనే కంపెనీ 2016లో ఇలాంటి ప్రయోగమే చేసింది. బీఎండబ్ల్యూ కారును రోబో మాదిరిగా మార్చేసింది. కాకపోతే నాటి స్టోరీని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా తాజాగా ట్విట్టర్ లో పంచుకున్నారు. ‘‘ఇది నిజ జీవితాన్ని మార్చేసే ఆవిష్కరణ (ట్రాన్స్ ఫార్మర్). దీన్ని టర్కిష్ ఆర్ అండ్ డీ కంపెనీ అభివృద్ధి చేసి ప్రదర్శించింది. మన ఆర్ అండ్ డీ లోనూ ఇలాంటి ఫన్ తప్పకుండా ఉండాలి’’అంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. 2016 నాటి టర్కిష్ కంపెనీ కారు రోబో వీడియోని ఆయన షేర్ చేశారు. అంతేకాదు మహీంద్రా అండ్ మహీంద్రా ఆటోమోటివ్ టెక్నాలజీ ప్రెసిడెంట్ వేలు మహీంద్రాకు ట్యాగ్ చేశారు. అంటే ఈ విధమైన ఆవిష్కరణలపైనా దృష్టి పెట్టాలని ఆయన పరోక్షంగా సూచించినట్టయింది.