Business

రైలు ప్రయాణికులకు శుభవార్త-TNI నేటి వాణిజ్య వార్తలు

రైలు ప్రయాణికులకు శుభవార్త-TNI నేటి వాణిజ్య వార్తలు

*  చాట్‌జీపీటీ 2024 చివరి నాటికి దివాలా తీసే అవకాశం

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా టెక్ కంపెనీలు ఏఐ సాంకేతికతపై దృష్టి పెడుతున్నాయి. భవిష్యత్తు మొత్తం కూడా కృత్రిమ మేధస్సు ఆధారంగా నడిచే అవకాశాలు ఉన్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే తాజాగా ఏఐ ఆధారంగా పనిచేసే OpenAI చాట్‌జీపీటీ యాప్ గురించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం ఈ యాప్ పట్ల ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపించడం లేదని ఒక నివేదిక పేర్కొంది. అనలిటిక్స్ ఇండియా మ్యాగజైన్ నివేదిక ప్రకారం చాట్‌జీపీటీ ప్రారంభమైన మొదట్లో భారీగా ఆదరణ లభించగా, ఇటీవల కాలంలో భారీ క్షీణతను ఎదుర్కొంటుంది. ఈ నివేదిక ప్రకారం, చాట్‌జీపీటీని నవంబర్ 2022లో ప్రారంభించినప్పుడు అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న యాప్‌గా అవతరించింది. కానీ ప్రస్తుతం భారీగా క్షీణిస్తుంది. మే నెలతో పోలిస్తే జూన్, జులై నెలల్లో చాట్‌జీపీటీ వెబ్‌సైట్ యూజర్ క్షీణతను చూసిందని నివేదిక పేర్కొంది. జులై నెలలో 9.6 శాతం క్షీణత కనిపించగా, జూన్‌లో 9.7 శాతం క్షీణత నమోదైంది. జూన్‌లోని 1.7 బిలియన్ వినియోగదారులతో పోలిస్తే జులైలో 1.5 బిలియన్ వినియోగదారులతో క్షీణతను ఎదుర్కొంది. ఇండియా మ్యాగజైన్ నివేదిక ప్రకారం 2024 చివరి నాటికి కంపెనీ దివాలా తీయవచ్చని పేర్కొంది.

* రైలు ప్రయాణికులకు శుభవార్త

ప్రయాణికుల ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ దేశంలోని రైల్వే స్టేషన్లలో తక్కువ ధరకు మందులను అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రధాన మంత్రి భారతీయ జన్ ఔషధి కేంద్రాల పేరుతో మెడికల్‌ స్టాల్స్‌ ప్రారంభించనుంది. ఇక్కడ ప్రయాణికులకు అవసరమైన వివిధ రకాల మందులు తక్కువ ధరకు విక్రయిస్తారు. ఈ అవుట్‌లెట్‌లు రైల్వేస్టేషన్లలోని రద్దీ ప్రదేశాలలో, కాన్కోర్స్‌లలో ఏర్పటు చేస్తారు. దీని వల్ల వచ్చీపోయే ప్రయాణికులందరికీ ప్రయోజనం కలుగుతుందని రైల్వే శాఖ భావిస్తోంది.పైలట్ ప్రాజెక్ట్ కింద మొదట ఎంపిక చేసిన 50 రైల్వే స్టేషన్లలో ప్రధాన మంత్రి భారతీయ జన్ ఔషధి కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. ఈ జాబితాలో ఆనంద్ విహార్, దర్భంగా, శ్రీనగర్, మైసూర్, లక్నో తదితర ప్రధాన స్టేషన్లతోపాటు తెలుగు రాష్ట్రాల్లోని తిరుపతి, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లు కూడా ఉన్నాయి.రైల్వే డివిజన్ల ద్వారా గుర్తించిన ప్రదేశాలలో ఈ మందుల కేంద్రాలను లైసెన్సుల ద్వారా ఏర్పాటు చేసి నిర్వహిస్తారు. సంబంధిత రైల్వే డివిజన్‌ల ఆధ్వర్యంలో ఈ-వేలం ద్వారా ఈ స్టాల్స్ ను కేటాయిస్తారు. వీటిని ఎన్‌ఐడీ అహ్మదాబాద్ డిజైన్ చేస్తుంది.

జియో డబుల్‌ ధమాకా

రిలయన్స్‌ జియో (Reliance Jio) అందుబాటులో ధరలో ఓ 5జీ స్మార్ట్‌ఫోన్‌ (5g smartphone) తీసుకొస్తోందంటూ ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి స్పెసిఫికేషన్స్‌ ఇవేనంటూ కొన్ని లీకులూ చక్కర్లు కొట్టాయి. అయితే, జియో.. ఒకటి కాదు రెండు 5జీ స్మార్ట్‌ఫోన్లు తీసుకొస్తోందంటూ మరో ప్రచారం తాజాగా మొదలైంది. ఆగస్టు 28న జరిగే రిలయన్స్‌ ఏజీఎంలో వీటిని లాంచ్‌ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.జియో 5జీ స్మార్ట్‌ఫోన్లకు సంబంధించి ముకుల్‌ శర్మ అనే టిప్‌స్టర్‌ కొన్ని వివరాలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశాడు. జియోకు చెందిన రెండు స్మార్ట్‌ఫోన్లు ఇటీవలే బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ (BIS) నుంచి సర్టిఫికేషన్‌ పొందాయని పేర్కొన్నాడు. ఆగస్టు 11న వీటికి ఆమోదం లభించిందని తెలిపాడు. JBV161W1, JBV162W1 పేర్లతో ఈ రెండు మోడళ్లు రిజిస్టర్‌ అయినట్లు తెలిపాడు. అంతకుమించి స్మార్ట్‌ఫోన్లకు సంబంధించి ఇతర వివరాలేవీ వెల్లడించలేదు. ఈ ఫోన్లలో స్నాప్‌డ్రాగన్‌ 480 ప్రాసెసర్‌ను వినియోగిస్తున్నారని, 4జీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజీ, 13 ఎంపీ కెమెరా, 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ వంటివి వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు 5జీ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి ఎప్పటి నుంచో లీకులు వస్తున్నప్పటికీ.. రిలయన్స్‌ జియో మాత్రం అధికారికంగా ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఇంతకీ ఏయే ఫీచర్లతో తెస్తారు? ఎంత ధరలో తెస్తారు? వంటి పూర్తి వివరాలు తెలియాలంటే ఈ నెల 28న జరిగే ఏజీఎం వరకు వెయిట్‌ చేయాల్సిందే!

తొలిరోజు కోట్లు వసూలు చేసిన భోళా శంకర్

మెగాస్టార్ చిరంజీవి, తమన్నా, కీర్తి సురేశ్ నటించిన భోళా శంకర్ నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఏకే ఎంటర్టయిన్ మెంట్స్ బ్యానర్ పై మెహర్ రమేశ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం తొలి రోజు మిశ్రమ స్పందన అందుకుంది. ఇక, ఓపెనింగ్ డే వసూళ్లపై చిత్ర నిర్మాణ సంస్థ సోషల్ మీడియాలో స్పందించింది. భోళా శంకర్ చిత్రం బాక్సాఫీసు వద్ద అదిరిపోయే ఆరంభాన్ని అందుకుందని ఏకే ఎంటర్టయిన్ మెంట్స్ వెల్లడించింది. భోళా శంకర్ ప్రపంచవ్యాప్తంగా తొలి రోజున రూ.33 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు తెలిపింది.కాగా, ఇవాళ రెండో శనివారం, రేపు ఆదివారం వరుస సెలవులు కావడంతో, మెగా మూవీకి వసూళ్లు మరింత పెరిగే అవకాశాలున్నట్టు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

*  కంపెనీ చైర్మన్ కంటే ఎక్కువ జీతం తీసుకుంటున్న ఉద్యోగులు

భారతీ ఎయిర్‌టెల్ దేశంలోని అతిపెద్ద వ్యాపార సమూహాలలో ఒకటి. ఎయిర్‌టెల్ దశాబ్దాలుగా దేశంలోనే అతిపెద్ద టెలికాం సంస్థ. ప్రస్తుతం కంపెనీ వ్యాపారం భారత్‌తో పాటు అనేక ఇతర దేశాలలో నడుస్తోంది. సాంప్రదాయ టెలికాం సేవలతో పాటు భారతీ ఎయిర్‌టెల్ ప్రస్తుతం శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను అందిస్తోంది. ఇంత పెద్ద కంపెనీలో టాప్ ఎగ్జిక్యూటివ్‌లు కోట్లలో జీతం పొందడం సహజం. కానీ భారతీ ఎయిర్‌టెల్‌లో ఛైర్మన్ కంటే ఎక్కువ జీతం పొందే వ్యక్తులు ఉన్నారు.. ఏంటి ఆశ్చర్యపోతున్నారా నిజం. చైర్మన్ కంటే కొన్ని కోట్ల రూపాయల జీతం వారికే ఎక్కువ.సంస్థకు చెందిన టాప్ ఎగ్జిక్యూటివ్‌ల జీతం గురించి కంపెనీ వార్షిక నివేదికలో సమాచారం ఇచ్చింది. నివేదిక ప్రకారం.. 2022-23 ఆర్థిక సంవత్సరంలో భారతీ ఎయిర్‌టెల్ ఛైర్మన్ సునీల్ మిట్టల్ మొత్తం వార్షిక వేతనం రూ. 16.77 కోట్లు. కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ గోపాల్ విట్టల్ జీతం అతని కంటే ఎక్కువ. గత ఆర్థిక సంవత్సరంలో విట్టల్ మొత్తం వేతనం రూ.16.84 కోట్లుగా ఉంది.ఇందుకు కారణం కూడా నివేదికలో వెల్లడైంది. నిజానికి చైర్మన్ మిట్టల్ జీతం, అలవెన్సులలో మార్పు లేదు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో అతను పొందుతున్న జీతం, అలవెన్సుల మొత్తం.. ప్రస్తుతం 2022-23 ఆర్థిక సంవత్సరంలో తాను పొందుతున్న మొత్తంలో పెద్ద స్థాయిలో తేడా లేదు. గత ఆర్థిక సంవత్సరంలో మిట్టల్ వార్షిక వేతనం, అలవెన్సులు రూ.10.06 కోట్లుగా ఉన్నాయి. మరోవైపు, విట్టల్ విషయానికి వస్తే వార్షిక పెరుగుదల 10.4 శాతం, గత ఆర్థిక సంవత్సరంలో ఈ సంఖ్య రూ.10.09 కోట్లకు చేరుకుంది.అంతకుముందు 2021-22 ఆర్థిక సంవత్సరంలో మిట్టల్ మొత్తం వార్షిక వేతనం ఎండీ విట్టల్ కంటే ఎక్కువగా ఉంది. అయితే ఇద్దరి మొత్తం వేతనంలో పెద్దగా తేడా లేదు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో మిట్టల్ మొత్తం రెమ్యునరేషన్ రూ. 15.39 కోట్లు కాగా కంపెనీ నుంచి విట్టల్ మొత్తం రూ.15.25 కోట్లు అందుకున్నారు. ఆ తర్వాత గత ఆర్థిక సంవత్సరంలో విట్టల్ వార్షిక జీతం, అలవెన్సులు పెరిగిన వెంటనే అతని మొత్తం వేతనం చైర్మన్ మిట్టల్ కంటే మించిపోయింది.

*  డ్రైవర్ క్రియేటివిటీకి ఫిదా అవుతున్న ప్యాసింజర్లు

ఆధునిక కాలంలో ఓలా, ఉబర్ ఎక్కువగా వినియోగంలో ఉన్నాయన్న సంగతి అందరికి తెలిసిందే.. కావున ఎక్కడికి వెళ్లాలన్నా నిమిషంలో క్యాబ్ బుక్ చేసుకుంటున్నారు.. గమ్యాన్ని చేరుతున్నారు. అయితే ప్రయాణంలో బోర్ ఫీల్ కాకుండా ప్యాసింజర్లు మొబైల్ వినియోగించడం వంటివి చేస్తారు. కానీ ఇటీవల ఒక ఉబర్ డ్రైవర్ టెక్నాలజీ ఉపయోగించి ప్రయాణికులకు బోర్ ఫీల్ కాకుండా చేస్తున్నారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.ఎక్స్ (ట్విటర్) వేదికగా విడుదలైన వీడియోలో ఉబర్ డ్రైవర్ ప్రయాణికుల కోసం వెనుక ఉన్న వారికోసం ముందు సీటు వెనుక భాగంలో గేమ్ ఆడుకోవడానికి అనుకూలంగా ఒక స్క్రీన్ అమర్చాడు. దీంతో ఆ ట్యాక్సీ ఎక్కిన ప్యాసింజర్లకు విసుగు రాకుండా ఉంటుంది. ఈ ఐడియా చాలామందిని ఫిదా చేస్తోంది.జర్నీలో వీడియో గేమ్ ఆడుకుంటూ సమయం తెలియాకుండానే ప్రయాణాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీన్ని ఇప్పటి వరకు 1.7 మిలియన్ల మంది వీక్షించారు, కొంతమంది నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్లు కూడా చేస్తున్నారు. మొత్తానికి ప్రయాణికులను ఎంటర్‌టైన్ చేయడానికి ఉబర్ డ్రైవర్ కొత్తగా ఆలోచించి అందరిని ఆకట్టుకుంటున్నాడు.

కాబోయే భార్యకు అమెజాన్ అధినేత ఖరీదైన కానుక

అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ తన కాబోయే భార్య లారెన్ శాంచెజ్ కు ఖరీదైన కానుకలను ఇచ్చి సంతోష పెట్టే కార్యక్రమంలో ఉన్నట్టు కనిపిస్తున్నారు. ప్రపంచ కుబేరుల్లో మూడో స్థానంలో ఉన్న బెజోస్ 68 మిలియన్ డాలర్లతో (సుమారు రూ.560 కోట్లు) ఫ్లోరిడాలోనే ప్రతిష్టాత్మకమైన ‘ఇండియన్ క్రీక్’లో ఇల్లు కొనుగోలు చేశారు. మూడు పడక గదుల ఇల్లును సమకూర్చారు. ఇండియన్ క్రీక్ అనేది కృత్రిమంగా ఏర్పాటు చేసిన దీవి. ఇది ప్రియురాలికి బెజోస్ ఇచ్చిన రెండో కానుక. నెల క్రితమే 2.5 మిలియన్ డాలర్లతో (రూ.20 కోట్లు) డైమండ్ రింగ్ ను బహూకరించడం తెలిసిందే. బ్లూంబర్గ్ సంస్థ అంచనా ప్రకారం బెజోస్ నెట్ వర్త్ 163 బిలియన్ డాలర్లుగా ఉంది. ప్రియురాలి కోసం కొనుగోలు చేసిన ఇల్లు 2.8 ఎకరాల భూభాగంలో, 9,259 చదరపు అడుగుల నిర్మాణ విస్తీర్ణంతో ఉంది. దీన్ని 1965లో నిర్మించారు. క్రీక్ ఐల్యాండ్ అని పిలిచే ఇది చిన్న దీవి. ఇక్కడి జనాభా కేవలం 81 మంది అని 2021 జనాభా లెక్కల ఆధారంగా తెలుస్తోంది. మున్సిపాలిటీ, మేయర్, పోలీసు ఇలా వేర్వేరు విభాగాలు సైతం ఉన్నాయి.

మరోసారి తగ్గిన బంగారం ధర

పసిడి ధరలు నేడు మరింత దిగొచ్చాయి. గత రెండు, మూడు రోజుల నుంచి తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు, నిన్న భారీగా తగ్గగా నేడు స్వల్పంగా తగ్గాయి. ఇక ఈరోజు హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధరల వివరాల్లోకి వెళ్లితే.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నిన్న 54,700 ఉండగా, నేడు 150 తగ్గడంతో గోల్డ్ ధర రూ.54,550గా ఉంది. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నిన్న 59,670 ఉండగా, నేడు 160 తగ్గడంతో గోల్డ్ ధర రూ.59,510గా ఉంది.

టాటా ఎలక్ట్రిక్ కార్లపై భారీ ఆఫర్‌లు 

మార్కెట్ లీడర్ టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ కార్లు వినియోగదారులను ఆకర్షించడానికి ఆకర్షణీయమైన తగ్గింపు ఆఫర్‌లు అందుబాటులో ఉన్నాయి. దాదాపు ప్రతి నెలా వివిధ కార్ల తయారీదారుల నుండి కార్లపై ప్రయోజనాలు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ  నేపథ్యంలో భారతీయ ఆటో దిగ్గజం టాటా మోటార్స్  టిగోర్‌ ఈవీ, టాటా నెక్సాన్‌ ఈవీలపై  80వేల దాకా తగ్గింపు లభిస్తోంది. దేశంలో అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ కార్లలో ఒకటి టిగోర్‌ ఈవీ. టాటా మోటార్స్ దీని మీద రూ. 80,000 వరకు ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో నగదు తగ్గింపు,ఎక్సేంజ్‌ బోనస్, కార్పొరేట్ తగ్గింపు, అదనపు వారంటీ లేదా ఉపకరణాలు ఉండవచ్చు. దీని ధర రూ. 12.49-13.75 లక్షల (ఎక్స్-షోరూమ్‌) వరకు  ఉంది.దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఎలక్ట్రిక్ కారు నెక్సాన్‌ ఈవీ. టాటా మోటార్స్ దీనిని వివిధ బ్యాటరీ పరిమాణాలతో ప్రైమ్ , మ్యాక్స్‌ అనే రెండు వేరియంట్‌లలో  లభిస్తోంది. మాక్స్‌ , ప్రైమ్ వేరియంట్‌లపై రూ. 61,000 56,000 తగ్గించింది.  వీటి ధర రూ. 14.49-17.19 లక్షల (ఎక్స్-షోరూమ్‌) వరకు  ఉన్నాయి.