ఫైనల్ వరకు ఎదురు లేకుండా అజేయంగా నిలిచిన భారత జట్టుకు తుది పోరులో మలేసియాపై గెలుపు నల్లేరుపై నడకే అనుకున్నారంతా! అంచనాలకు తగినట్లుగా తొలి గోల్‌తో ఆధిపత్యం కూడా దక్కింది. కానీ ఆపై మూడుసార్లు ఆసియా చాంపియన్‌కు అసలు పోటీ అర్థమైంది. ఆట అర్ధ భాగం (రెండు క్వార్టర్లు) ముగిసేసరికి భారత్ 1–3తో ఓటమి కోరల్లో చిక్కుకుంది. ఇక మిగిలింది అర గంట. గెలవాలంటే మిగిలిన 30 నిమిషాల్లో 3 గోల్స్ కావాలి. సర్వశక్తులు ఒడ్డాల్సిన స్థితి. ప్రత్యర్థి జోరు మీదుంది. భారత్ ఆటగాళ్లపైనే ఒత్తిడి. ఈ దశలో మూడో క్వార్టర్ ముగిసే నిమిషం భారత్‌కు వరంగా మారింది. మ్యాచ్‌ను మన పరం చేసింది.
45వ నిమిషంలో భారత ఆటగాళ్లు చేసి రెండు గోల్స్‌తో స్కోరు 3–3తో సమమైంది. మిగిలింది ఆఖరి క్వార్టర్ ఒక గోల్ చేస్తే భారత్ టైటిల్ దక్కుతుంది. ఆకాశ్‌దీప్ సింగ్ (56వ ని.లో) అదే మ్యాజిక్ చేశాడు. ప్రత్యర్థి డిఫెండర్లను బోల్తా కొట్టించి గోల్‌పోస్ట్‌లోకి దూసుకెళ్లాడు. అనుకున్న ఫలితాన్ని అజేయమైన భారత్ సాధించింది. 9వ నిమిషంలో భారత్‌కు లభించిన పెనాల్టీ కార్నర్‌ను జుగ్‌రాజ్ గోల్‌గా మలిచాడు.
కానీ మలేసియా శిబిరం నుంచి నిమిషాల వ్యవధిలో అబు కమల్ (14వ ని.లో), రహీమ్ రజీ (18వ ని.లో), అమినుద్దీన్ (28వ ని.లో) చెరో గోల్ చేశారు. జట్టు ఆత్మరక్షణలో పడిన ఈ దశలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (45వ ని.), గుర్జాంత్ (45వ ని.) గోల్ చేసి అడుగంటిన ఆశలకు జీవం పోశారు. మిగిలిన ఆఖరి గోల్‌ను ఆకాశ్‌దీప్ (56వ ని.) సాధించడంతో భారత్ జయకేతనం ఎగరేసింది.