* టీఎస్ ఐసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు
టీఎస్ ఐసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు జరిగాయి. ఈ నెల 14 నుంచి జరగాల్సిన ఐసెట్ కౌన్సెలింగ్‌ను వాయిదా వేశారు. సెప్టెంబర్ 6 నుంచి కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.8 నుంచి 12వ తేదీ వరకు అభ్యర్థుల ధ్రువపత్రాలను పరిశీలించనున్నారు. 8 నుంచి 13 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవడానికి సమయం ఇచ్చారు. సెప్టెంబర్ 17వ తేదీన ఎంబీఏ, ఎంసీఏ తొలి విడుత సీట్లను కేటాయించనున్నారు. సెప్టెంబర్ 22 నుంచి ఐసెట్ తుది విడుత కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.
* చేనేత కార్మికులకు కేటీఆర్ గుడ్ న్యూస్
చేనేత కార్మికులకు మంత్రి కేటీఆర్ గుడ్ న్యూస్ అందించారు. రుణమాఫీపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని చేనేత ప్రకటించారు. ఈ విషయమై ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చించి రుణమాఫీ అమలుకు కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. శనివారం భువనగిరి జిల్లా పోచంపల్లిలో జరిగిన చేనేత సమావేశంలో మంత్రి పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక కేటీఆర్ మాట్లాడుతూ.. దుబ్బాకలోని ఓ నేత ఇంట్లో కేసీఆర్ ఉన్నారని, చేనేత కార్మికుల స్థితిగతులు ఆయనకు తెలుసన్నారు. కనుముక్కులో మూతపడిన హ్యాండ్లూమ్ పార్కును రూ.12 కోట్లతో తెరుస్తున్నారని అన్నారు.చేనేత భీమా 57 ఏళ్ల నుంచి 75 ఏళ్లకు పెంచారు. చేనేతకు చేయూత అనే కార్యక్రమంతో నేరుగా చేనేత కార్మికుల ఖాతాలో డబ్బులు జమ చేస్తున్నామన్నారు. మగ్గాలను ఆధునీకరించేందుకు రూ.40 కోట్ల నిధులు ఇస్తున్నారు. చేనేత హెల్త్ కార్డు ద్వారా ఉచితంగా వైద్యం అందిస్తున్నామని తెలిపారు. చేనేత కార్మికుడు మరణిస్తే అంత్యక్రియలకు రూ.5 వేల నుంచి రూ. 25 వేలకు పెంచారు. చేనేత వస్ర్తాలపై 5% జీఎస్టీ విధించి 75 ఏళ్లలో ఏ ప్రధానమంత్రి చేయని తప్పిదాన్ని నరేంద్ర మోడీ చేశారు. తెలంగాణలో మళ్లీ బీఆర్‌ఎస్ ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కోకాపేటలో 2 ఎకరాల స్థలంలో చేనేత భవనాలు ఏర్పాటు చేస్తున్న విషయాన్ని మంత్రి కేటీఆర్ ప్రస్తావించారు.చేనేత కార్మికులకు పెద్దఎత్తున ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున చేనేత యూనిట్‌ను ఏర్పాటు చేసిన సాయిభారత్ బృందాన్ని మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. హస్తకళల అభివృద్ధికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుందన్నారు. ఒకవైపు ప్రధాని నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం చేనేత కార్మికులకు అన్నీ అమ్మేస్తూ ఇబ్బందులకు గురిచేస్తుంటే తెలంగాణ ప్రభుత్వం మాత్రం దివాళా తీసిన పోచంపల్లి చేనేత పార్కును కొనుగోలు చేసిందన్నారు. పోచంపల్లి చేనేత పార్కును పునరుద్ధరించి ఇక్కడి నేత కార్మికులకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించాలనే ఏకైక లక్ష్యంతో ప్రభుత్వం కృషి చేస్తోందని వెల్లడించారు. తమిళనాడులోని తిరుపూర్ టెక్స్‌టైల్ క్లస్టర్ మాదిరిగా పోచంపల్లి చేనేత కార్మికులు కూడా పోచంపల్లి చేనేత కార్మికుల అభివృద్ధికి సహకరించాలని సూచించారు.
* వాలంటీర్లపై పవన్ కళ్యాణ్ మరోసారి విమర్శలు
వాలంటీర్లపై మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. విశాఖపట్నంలో ఇటీవల వాలంటీర్ చేతిలో హత్యకు గురైన వరలక్ష్మీ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. గొంతులు కోసే దండుపాళ్యం బ్యాచ్ కి.. వాలంటీర్లకు తేడా లేకుండా పోయిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇళ్లలోకి చొరబడి గొంతులు కోస్తున్నారని విమర్శించారు.వాలంటీర్ ఉద్యోగానికి పోలీసు వెరిఫికేషన్ చేయాలన్నారు. కొంతమంది వాలంటీర్ల నుంచి పిల్లలు, పెద్దవారిని జాగ్రత్తగా కాపాడుకోవాలని సూచించారు. చాలా చోట్ల వాలంటీర్లు ఆకృత్యాలకు పాల్పడుతున్నా సరైన చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. తమపై ఆంక్షలు విధిస్తున్న ప్రభుత్వం తప్పు చేసిన వారిని మాత్రం వదిలేస్తుందని అన్నారు.
* తిరుమలలో ఆరేళ్ల చిన్నారిని బలితీసుకున్న చిరుత
తిరుమలలో విషాద ఘటన చోటు చేసుకుంది. అలిపిరి నడకమార్గంలో చిన్నారిపై చిరుత దాడి చేసి చంపేసింది. వివరాల్లోకి వెళితే.. అలిపిరి నడక మార్గంలో తిరుమలకు వెళ్తుండగా.. శుక్రవారం రాత్రి ఆరేళ్ల చిన్నారి తప్పిపోయింది. ఈ క్రమంలో పాప తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. గాలింపు చర్యలు చేపట్టారు.అయితే శనివారం ఉదయం నరసింహ స్వామి ఆలయం వద్ద చిన్నారి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. చిన్నారి ఒంటిపై తీవ్ర గాయాలు కూడా ఉన్నాయి. కాగా నెల కిత్రం ఐదేళ్ల చిన్నారిపై పులి దాడి చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అదే ప్రాంతంలోనే రక్షితపై చిరుత దాడి చేయడం గమనార్హం. ఈ ఘటన తిరుమలలో కలకలం రేపుతోంది.
* రాష్ట్ర కార్యవర్గ నేతలతో పురందేశ్వరి వర్చువల్ సమావేశం
రాష్ట్ర కార్యవర్గ నేతలతో భాజపా ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి వర్చువల్ సమావేశం నిర్వహించారు. సర్పంచుల సమస్యలపై పోరాటం బాగా చేశారంటూ నేతలకు ఆమె అభినందనలు తెలిపారు. జనసేన, భాజపా పొత్తు సంకేతాలు బలంగా వినిపించాలని కోరారు. ఇంటింటికీ త్రివర్ణ పతాకంలో అందరినీ భాగస్వాములను చేయాలని కోరారు. ఈ నెల 14న విభాజిత్..విభీషణ్ కార్యక్రమం చేపట్టాలని నేతలకు సూచించారు.
* తిరుమల కాలిబాటలపై టీటీడీ ఈవో కిలక నిర్ణయం
తిరుమల, తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి (TTD EO) సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీవారి దర్శనానికి కాలిబాటన వచ్చే మార్గాన్ని మూసివేయాలని ఆలోచిస్తున్నట్లు పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి అలిపిరి (Alipiri ) బాటన చిన్నారిని చంపివేసిన చిరుత( Leopard ) ఘటనపై శనివారం తిరుమల జేఈవో కార్యాలయంలో అటవీ శాఖ, పోలీసులతో ఆయన సమావేశమయ్యారు.ఈ సందర్భంగా భక్తుల భద్రతకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. చిరుత దాడిలో చనిపోయిన చిన్నారి లక్షిత (Lakshita) ఘటన బాధకరమని ఆయన అన్నారు. శుక్రవారం సాయంత్రం 6.30 గంటలకు పాప మిస్ అయ్యిందని, పాప ఆచూకీ కోసం70 మంది దాకా సిబ్బంది రాత్రి అటవీ ప్రాంతంలో గాలించారని తెలిపారు. సీసీ కెమెరాల ద్వారా చూస్తే కాలినడక నుంచి పాప అటవీ ప్రాంతంలో వెళ్లిందా అనే కోణంలో విచారణ జరుగుతుందని పేర్కొన్నారు.తిరుపతి నుంచి తిరుమల ఉన్న రెండు కాలిబాటలను సాయంత్రం 6 గంటలకు మూసేయాలని ఆలోచిస్తున్నామని వెల్లడించారు. ఈ విషయంపై టీటీడీ చైర్మన్, అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని , ప్రతి పది మీటర్లకు సెక్యూరిటీ గార్డును నియమిస్తామని వివరించారు. కాలిబాటలో బోన్లు ఏర్పాట్లు చేస్తామన్నారు. చిరుతను బంధించేందుకు ఇప్పటికే రెండు బోన్లు ఏర్పాటు చేశామని ఆయన అన్నారు. కాలిబాటలో వచ్చే భక్తులు చిన్న పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
* పార్లమెంట్‌లో బీజేపీ డాన్‌లాగా ప్రవర్తిస్తోంది:బినోయ్
పార్లమెంట్‌లో బీజేపీ డాన్‌లాగా ప్రవర్తిస్తోందంటూ మండిపడ్డారు సీపీఐ జాతీయ కార్యదర్శి బినోయ్ విశ్వం.. విజయవాడలో జరిగిన మీడియా సమావేశంలో విశాఖ నుండి తిరుపతి వరకు సీపీఐ చేపట్టనున్న బస్సు యాత్ర పోస్టర్ రిలీజ్ చేశారు.. సీపీఐ నేతలు ఆగష్టు 17 నుంచి సెప్టెంబర్ 8వ తేదీ వరకు బస్సు యాత్ర నిర్వహించబోతున్నారు.. అయితే, పోస్టర్ రిలీజ్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలోని కార్మికులకు రక్షణ కల్పించడం ప్రభుత్వాల ప్రధాన బాధ్యత.. ఉద్యోగులు, కార్మికులు మరణించినప్పుడు చిన్నపాటి సహాయం చేయడం కాదు.. ప్రభుత్వాలు మరణించిన ఉద్యోగులు, కార్మికుల కుటుంబాలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.ఇక, బీజేపీ ప్రభుత్వం వల్ల పార్లమెంట్ సెషన్స్ పూర్తిగా విలువ లేకుండా పోయాయని మండిపడ్డారు బినోయ్ విశ్వం… పార్లమెంట్ లో బీజేపీ డాన్ లాగా ప్రవర్తిస్తోందని ఫైర్ అయ్యారు. బీజేపీ పార్లమెంట్ ను ఒక నాన్సెన్స్ గా మార్చేసిందని దుయ్యబట్టారు. మణిపూర్ అంశంపై చర్చించాలని పట్టుబట్టాం.. కానీ, బీజేపీ ప్రభుత్వం చర్చకు తేలేదు.. బీజేపీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం అందరితో కలిసి పెట్టాం.. అవిశ్వాస తీర్మానం కారణంగా మోడీ పార్లమెంట్‌కు వచ్చారని తెలిపారు. మణిపూర్ అంశంలో కేంద్రం.. రేపిస్టుల తరఫున నిలబడుతోందని ఆరోపించారు. ప్రధాని, కేంద్ర ప్రభుత్వం మార్చాల్సిందే అని పిలుపునిచ్చారు. మరోవైపు, కేరళ మినహా మిగతా రాష్ట్రాలలో లెఫ్ట్ పార్టీలు బలహీనంగా ఉన్నాయనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక, పార్లమెంట్‌లో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ స్పీచ్ హాస్యాస్పదంగా ఉందని మండిపడ్డారు.. రాహుల్ గాంధీ ఫ్లైయింగ్ కిస్ ఇచ్చాడు.. అది ఒక ఫ్లైయింగ్ కిస్ మాత్రమే.. కానీ, దానిని రాద్ధాంతం చేయడం ఏంటి? అంటూ ఎద్దేవా చేశారు సీపీఐ జాతీయ కార్యదర్శి బినోయ్ విశ్వం.
* టిడిపి నేత బోండా ఉమా మరో సవాల్
ఎన్నికల సమయం దగ్గరపడటంతో వైసీపీ, టిడిపి నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయిలో కొనసాగుతున్నాయి. ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. సవాళ్ళు విసురుకుంటున్నారు. రాజకీయంగా ఎవరూ తగ్గడం లేదు. ఇదే సమయంలో తాజాగా మంత్రి బొత్స సత్యనారాయణ ఒక సవాల్ చేస్తే..దానికి ప్రతిగా టిడిపి నేత బోండా ఉమా మరో సవాల్ చేశారు.అసలు జగన్‌ని విమర్శిస్తే మట్టికొట్టుకు పోతారని ఫైర్ అయిన బొత్స..వచ్చే ఉగాది నాటికి టిడిపి-జనసేనలు ఉండవని, ఒకవేళ ఉంటే తాను గుండు కొట్టించుకుంటానని బొత్స ఛాలెంజ్ చేశారు. ఇక బొత్స సవాల్ పై టిడిపి నేత బోండా ఉమా తీవ్రంగా స్పందించారు. ఆ రెండు పార్టీలు ఉండవ అంటూ బొత్స చేసిన వ్యాఖ్యల వెనుక అర్థమేంటీ..? హత్యలకు ప్లాన్ చేశారా..? అంటూ బోండా ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయం అని కావాలంటే రాసి పెట్టుకోంవాలని, వైసీపీ సింగిల్ డిజిట్‌కు పరిమితం అవుతుందని అన్నారు. ఎన్నికల్లో చీపురుపల్లినుంచి బొత్స సత్యనారాయణను ఓడిస్తాం అని చెప్పుకొచ్చారు.బొత్స సత్యనారాయణ కుటుంబ సహా 50మంది ఎమ్మెల్యేలు టిడిపికి టచ్ లో ఉన్నారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 175 సీట్లకు 175 సీట్లు గెలిస్తే మాపార్టీని మూసేస్తామని బోండా ప్రతి సవాల్ చేశారు. నారా లోకేశ్ చేస్తున్న పాదయాత్ర చూసి వైసీపీకి ముచ్చెమటలు పడుతున్నాయని అందుకే అవాంతరాలు కల్పిస్తోందని ఫైర్ అయ్యారు.మొత్తానికి ఇలా రెండు పార్టీల నేతలు సవాల్, ప్రతి సవాల్ చేసుకుంటున్నారు. అయితే బొత్స అన్నట్లు..ఉగాది నాటికి టిడిపి-జనసేనలు లేకుండా పోవడం అనేది జరగని పని..అలాగే వైసీపీ నుంచి 50 మంది ఎమ్మెల్యేలు టిడిపిలో టచ్ లో ఉన్నారనే దానిలో నిజం పెద్దగా ఉండదు.
* తెలంగాణ సర్కార్ బీజేపీ ఫైర్
తెలంగాణలో బీజేపీ స్పీడ్ పెంచింది.. కేసీఆర్ సర్కార్‌ను టార్గెట్ చేస్తూ ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే ఇందిరాపార్క్ వద్ద బీజేపీ మహాధర్నా తలపెట్టింది. రాష్ట్రంలో పేదలకు డబుల్ బ్రెడ్‌రూమ్ ఇళ్లు ఇవ్వకపోవడంపై బీజేపీ నిరసనకు దిగింది. ఈ మహాధర్నా బీజేపీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్బంగా తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కుల్వకుంట్ల కుటుంబం చేతిలో తెలంగాణ బంధీ అయ్యింది. ఎన్నో కలలు కని తెచ్చుకున్న తెలంగాణ దోపిడీకి గురవుతోంది. సీఎం కేసీఆర్ తెలంగాణను అప్పుల ఊబిలోకి దించారు. ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టి వేధిస్తున్నారు. మోసం చేయడం, గొంతు కోయడం కేసీఆర్‌కు వెన్నతో పెట్టిన విద్య. పేదలకు ఇళ్లు ఇవ్వాలన్న చిత్తశుద్ధి కేసీఆర్‌కు లేదు. దోపిడీ డబ్బుతో కేసీఆరే ఫార్మ్ హౌస్‌లు కట్టుకుంటున్నారు. తెలంగాణ డబుల్ ఇంజిన్ సర్కార్ రావాల్సిందే. తెలంగాణలో నిజాం నవాబుల పాలన, అబద్దాల పాలన కొనసాగుతోంది. రుణమాఫీ విషయంలో రైతులను కేసీఆర్ మోసం చేశారు. ఆర్టీసీ కార్మికుల విషయంలో ప్రభుత్వం అన్యాయం చేసింది. నిరుద్యోగ భృతి ఇవ్వకుండా మోసం చేశారని అన్నారు. హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు పంచే దమ్ము కేసీఆర్‌కు లేదు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 5లక్షల మంది ఇళ్లు లేని పేదలున్నారు. ఏపీలో 20లక్షల ఇల్లు కట్టించి ఇచ్చారు. తెలంగాణలో మాత్రం లక్ష ఇళ్లు కూడా కట్టలేదు. 5వేలలకు పైగా ఎకరాల అసైన్డ్‌మెంట్ భూములు పేదల నుంచి కేసీఆర్ లాక్కున్నారు. గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయాలని డిమాండ్ చేశారు.ఇక, నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ మాట్లాడుతూ.. కల్వకుంట కుటుంబమంతా దొంగలే. అసలైన ఉద్యమకారుడు ఈటల రాజేందర్. తెలంగాణలో కేసీఆర్ పాలనలో సమస్యలు పెరిగాయి. ఉస్మానియా ఆసుపత్రిలో ఎలుకలు, కుక్కలు ఉంటున్నాయి. ఇంటికో ఉద్యోగం, అమరవీరుల కుటుంబానికి 10లక్షల ఆర్థిక సహాయం అన్నారు. ఏ ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చినా కోర్టుకి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. వైన్స్ టెండర్స్ మాత్రం పక్కాగా జరుగుతాయి. ఇళ్లు కట్టాలంటే హౌసింగ్ శాఖ ఉండాలి. అది లేనే లేదు. కుల ధ్రువీకరణ పత్రానికే 30రోజుల సమయం కావాలి. అలాంటిది మూడు రోజుల్లో గృహలక్ష్మికి ఎలా దరఖాస్తు చేస్తారు? అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు డబుల్ డిజిట్‌గా కూడా రాదు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
* రోడ్డు దాటుతున్న పులిని ఢీకొట్టిన వాహనం
అటవీ ప్రాంతాలు, వన్యప్రాణుల అభయారణ్యాల గుండా వెళ్లేటప్పుడు జాగ్రత్త వహించాలని ఎప్పటికప్పుడు అటవీ శాఖ అధికారులు హెచ్చరిస్తూనే ఉంటారు. ఇక్కడి నుంచి వెళ్లే వాహనాలు కూడా తక్కువ వేగంతో నడపాలని సూచిస్తారు.. అటవీ మార్గంలోని రహదారుల గుండా వెళ్లే జంతువులు ఎలాంటి ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు వాహనదారులు పరిమిత వేగంతో ప్రయాణించాలని చెబుతుంటారు. కానీ, మితిమీరిన వేగంతో వెళ్తూ కొందరు వాహనదారులు మూగజీవాలను ప్రమాదాల్లో పడేస్తుంటారు. తాజాగా కూడా అలాంటి వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఇది చూసి మీరు ఆశ్చర్యపోతారు. ఈ వీడియోలో కారు ఢీకొని గాయపడిన పులి కనిపిస్తుంది.IFS పర్వీన్ కస్వాన్ ఈ వీడియోను ట్వీట్ చేసి, అడవి జంతువులకే అడవి ప్రదేశాల మార్గాలపై మొదటగా హక్కు ఉందని రాశారు. ఇంకా, వాహనదారులకు విజ్ఞప్తి చేస్తూ.. ఈ ప్రదేశాలలో ఎల్లప్పుడూ సురక్షితంగా, తక్కువ వేగంతో డ్రైవ్ చేయండి’ అని రాశారు. IFS అధికారి పర్వీన్ కస్వాన్ ప్రకారం, నాగ్జిరాలో ఒక పులిని ఏదో వాహనం ఢీకొట్టింది. దీంతో ఆ పులి తీవ్రంగా గాయపడింది. కదలలేని స్థితిలో ఆ పులి రోడ్డుపై పడివుంది. నడవలేని ధీన స్థితిలో ఉన్న ఆ పులి కాళ్లను ఈడ్చుకెంటూ చెట్ల పొదల్లోకి వెళ్లింది. ఈ ఘటన మహారాష్ట్ర లో జరిగింది. మహారాష్ట్రలోని గోండియా జిల్లా నవేగావ్ – నాగ్జీరా కారిడార్ పరిధిలోని అటవీ ప్రాంతంలో గురువారం రాత్రి 10 గంటల సమయంలో ఘటన చోటు చేసుకుందని తెలిసింది. పాపం పులి రెండు సార్లు లేచి వెళ్లటానికి ప్రయత్నిస్తుంది. కానీ లేవలేదు. వీడియోలో, ఒక కారు వెనుక లైట్లు వెలుగుతున్నాయి. ఆ వెలుతురులోనే ఆ పులి ఈడ్చుకుంటూ చెట్ల పొదల్లోకి వెళ్లిపోయింది. గాయపడిన పులిని వైల్డ్ లైఫ్ రెస్క్యూ సెంటర్‌కు తరలిస్తుండగా మరణించినట్టుగా అధికారులు వెల్లడించారు.