తిరుమల శ్రీవారి దర్శనార్థం.. నడక మార్గంలో వెళ్తున్న భక్తులను చిరుతల సంచారం భయభ్రాంతులకు గురి చేస్తోంది. జూన్ 11 న కౌశిక్ అనే బాలుడు చిరుత దాడిలో గాయపడి కోలుకోగా.. ఆగస్టు 11న లక్షిత అనే చిన్నారి చిరుత దాడిలో మరణించింది. అయితే తిరుమల నడకదారిలో రెండు రోజుల క్రితం చిన్నారి లక్షితను చంపిన చిరుత ఎట్టకేలకు చిక్కింది.ఆ చిరుతను పట్టుకోవడానికి అటవీశాఖ అధికారులు పలుచోట్ల బోనులను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే చివరకు నిన్న అర్ధరాత్రి ఒక బోనులో చిరుతను అధికారులు గుర్తించారు. రెండు రోజులుగా ఐదు ప్రాంతాలలో చిరుత సంచారానికి గుర్తించి బోనులు ఏర్పాటు చేయగా… ఎట్టకేలకు చిన్నారిపై దాడి చేసిన ప్రాంతానికి సమీపంలోనే ఆ చిరుత చిక్కింది. దీంతో అధికారులందరూ ఊపిరి పీల్చుకున్నారు.