చంద్రయాన్-3ని విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో ఇప్పుడు సూర్యుడి గుట్టు విప్పడంపై దృష్టిసారించింది. ఈ దిశగా ‘ఆదిత్య-ఎల్1’ని నింగిలోకి పంపేందుకు చురుగ్గా ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఈ ఉపగ్రహాన్ని శ్రీహరికోటలోని అంతరిక్ష కేంద్రానికి తీసుకొచ్చారు. సెప్టెంబరు మొదటివారంలో పీఎస్ఎల్వీ-సి57 రాకెట్ ద్వారా దీన్ని ప్రయోగిస్తారు. భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని లాగ్రాంజ్ పాయింట్ 1 (ఎల్ 1) చుట్టూ ఉన్న కక్ష్యలో దీన్ని ప్రవేశపెట్టనున్నారు. అక్కడి నుంచి గ్రహణాలతో సంబంధం లేకుండా సూర్యుడిని నిరంతరం అధ్యయనం చేసేందుకు వీలు కలుగుతుంది. దీనివల్ల సౌర చర్యలు, అంతరిక్ష వాతావరణంపై వాటి ప్రభావాన్ని ఎప్పటికప్పుడు విశ్లేషించొచ్చు. సూర్యుడిలోని పొరలైన ఫొటోస్పియర్, క్రోమోస్పియర్, వెలుపల ఉండే కరోనాను అధ్యయనం చేయడానికి ఆదిత్యలో ఏడు సైన్స్ పరికరాలు ఉన్నాయి. ఎల్-1 ప్రదేశానికి ఉన్న సానుకూలతల దృష్ట్యా నాలుగు పరికరాలు నేరుగా సూర్యుడిని పరిశీలిస్తాయి. మిగతా మూడు సాధనాలు.. సమీపంలోని సౌర రేణువులు, అయస్కాంత క్షేత్రాల గురించి శోధిస్తాయి.