WorldWonders

సూర్యుని మచ్చల పై ఆసక్తికర ప్రకటన చేసిన నాసా

సూర్యుని మచ్చల పై ఆసక్తికర ప్రకటన చేసిన నాసా

సాధారణంగా సూర్యుడి కాంతిమండలంలో సన్‌స్పాట్స్‌ (నల్లని మచ్చలు) ఉంటాయి. అయితే, ఆ కాంతిమండలంలోని పదార్థాల కదలికవల్ల కొన్నిసార్లు ఆ మచ్చలు మాయమైపోతాయి. దానివల్ల ఒక ఏడాదిలో ఎక్కువగా మచ్చలతో కనిపించే సూర్యుడు.. కొన్ని రోజులు మాత్రం ఎలాంటి మచ్చ లేకుండా దర్శనమిస్తాడు. ఈ మచ్చలను మనం నేరుగా చూడలేం. శాస్త్రవేత్తలు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సేకరించిన చిత్రాల ద్వారా మాత్రమే వాటిని చూడగలం.

ఈ క్రమంలో అమెరికాకు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా సూర్యుడికి సంబంధించి సన్‌స్పాట్స్‌తో కూడిన తాజా చిత్రాన్ని విడుదల చేసింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు సూర్యుడికి మచ్చలు (సన్‌స్పాట్స్‌) లేని రోజే లేదని తెలిపింది. అమెరికా స్పేస్‌ వెదర్‌ ప్రెడిక్షన్‌ సెంటర్‌ ‘స్పేస్‌ వెదర్‌’ వెల్లడించిన ప్రకారం.. 2023 ఏడాదిలో ఇప్పటివరకు సూర్యుడికి మచ్చలేని రోజే లేదు.2022లో కూడా కేవలం ఒక్క రోజు మాత్రమే సూర్యుడు మచ్చ లేకుండా ఉన్నాడని స్పేస్‌ వెదర్‌ తెలిపింది. అయితే, 2021లో మాత్రం ఏడాది మొత్తంలో 64 రోజులు సూర్యుడు మచ్చలు (సన్‌స్పాట్స్‌) లేకుండా ఉన్నాడని వెల్లడించింది. కాగా తాజాగా సూర్యుడిపై కనిపించిన సన్‌స్పాట్స్‌లో ఒక సన్‌స్పాట్‌ బీటీ-డెల్టా ఆయస్కాంత క్షేత్రాన్ని కలిగి ఉన్నదని, ఈ క్షేత్రం బలమైన సౌర జ్వాలల కోసం శక్తిని దాచి ఉంచుతుందని స్పేస్‌ వెదర్‌ పేర్కొంది.