Devotional

టీటీడీ ఉద్యోగులకు తీపికబురు

టీటీడీ ఉద్యోగులకు తీపికబురు

టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. టీటీడీ ఉద్యోగులందరికీ ఇంటి స్థలాలు ఇప్పించే బాధ్యత తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు. వడమాలపేట వద్ద ఉద్యోగుల ఇంటి స్థలాల కోసం మంజూరు చేసినటువంటి 310 ఎకరాల భూమిని ఈవో ఏవీ ధర్మారెడ్డి, జేఈవోలు సదా భార్గవి, ఉద్యోగ సంఘాల నాయకులతో కలిసి ఆయన మంగళవారం పరిశీలించారు. ఆ తర్వాత భూమన మీడియాతో మాట్లాడారు. సెప్టెంబర్ 18వ తేదిన ముఖ్యమంత్రి జగన్ చేతుల మీదుగా ఇళ్ల స్థలాల పంపిణీ ప్రారంభిస్తామని పేర్కొన్నారు. అవసరమైత్ మరో 100 ఎకరాలైనా కూడా అధికార ప్రభుత్వం నుంచి సేకరించి అందరికీ ఇంటి స్థలాలు ఇప్పించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆయన చేసిన ఈ ప్రకటన వల్ల టీటీడీ ఉద్యోగులు ఒక్కసారిగా హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.

దివగంత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో తన కృషితో ఉద్యోగులకు ఇంటిస్థలాలు ఇచ్చే ప్రక్రియ ప్రారంభించారని తెలిపారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల వల్ల పదేళ్ల పాటు ఈ సమస్యలను ఎవరు పట్టించుకోలేదని చెప్పారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉండటం వల్లే మళ్లీ ఉద్యోగులందరికీ ఇంటి స్థలాలు వస్తున్నాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. మరోవైపు ఈవో ధర్మారెడ్డి మాట్లాడుతూ 35×55 అడుగుల ఇంటి స్థలాలు అందజేస్తామని పేర్కొన్నారు. దాదాపు 7 వేల మంది ఉద్యోగులకు ఇక్కడ ఇంటిస్థలాలు వస్తాయని.. దీనివల్ల పెద్ద టౌన్‌షిప్ తయారవుతుందని తెలిపారు. చెన్నై హైవే పక్కనే ఈ స్థలం ఉండటం వల్ల మంచి ధర పలుకుతోందని చెప్పారు. టీటీడీ ఛైర్మన్ ఆదేశాల మేరకు సెప్టెంబర్ 18లోపు ఈ స్థలాన్ని ప్లాట్లుగా విభజిస్తామని.. కచ్చా రోడ్లు వేసి తుడా అనుమతి తీసుకొనే ప్రయత్నం చేస్తామని పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా భారత స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా టీటీడీ ఛైర్మన్ విధుల్లో ఉత్తమ సేవలు అందించిన వివిధ విభాగాలకు చెందిన 30 అధికారులు, 219 మంది ఉద్యోగులకు, ఎస్వీబీసీలో ఏడుగురు ఉద్యోగులకు శ్రీ‌వారి వెండి డాలర్‌, ప్రశంసాపత్రం అందజేశారు. అలాగే ఉద్యోగుల పిల్లలకు సంబంధించి ఇంటర్‌లో ప్రతిభ కనబర్చిన 26 మంది విద్యార్థులకు రూ.2,116 చొప్పున 10వ తరగతిలో ప్రతిభ కనబర్చిన 32 మంది విద్యా్ర్థులకు రూ.1,116 చొప్పున బహుమతులు అందజేశారు. మరో విషయం ఏంటంటే టీటీడీ నిఘా మరియు భద్రత విభాగం ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి జాగిలాల ప్రదర్శన ఆకర్షణగా నిలిచింది. అలాగే తాతయ్య గుంట గంగమ్మ ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను సైతం ఛైర్మన్ పరిశీలించారు. పనుల వేగం పెంచాలని అధికారులకు ఆదేశించారు.