అమెరికా 2020 అధ్యక్ష ఎన్నికల సందర్భంగా జార్జియా ఫలితాలను తారుమారు చేయడానికి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నించినట్లు.. ఆయనపై అభియోగాలు నమోదయ్యాయి. 2024 అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న వేళ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం రేసులో ముందున్న ట్రంప్‌పై కొత్త అభియోగాలు నమోదు కావడం పరిస్థితి తీవ్రతను చాటుతోంది. ఫుల్టన్ కౌంటీ గ్రాండ్ జ్యూరీ జారీ చేసిన డాక్యుమెంట్‌లో ట్రంప్‌తో పాటు 18 మందిపై అభియోగాలు మోపారు. తాజా కేసుతో ఈ ఏడాది ట్రంప్‌పై నాలుగోసారి నేరాభియోగాలు నమోదయ్యాయి. అభియోగాలు నమోదైన వారిలో ట్రంప్ మాజీ లాయర్ రూడీ గులియానీ, మాజీ శ్వేతసౌధం చీఫ్ మార్క్ మెడోస్, వైట్ హౌస్ లాయర్ జాన్ ఈస్ట్‌మన్, మాజీ జస్టిస్ డిపార్ట్‌మెంట్ జెఫ్రీ క్లార్క్ తదితరులు ఉన్నారు.
Donald Trump Georgia : ఎన్నికల్లో జోక్యంపై ఫుల్టన్ కౌంటీ డిస్ట్రిక్ అటార్నీ 2021 ఫిబ్రవరిలో దర్యాప్తు ప్రారంభించారు. తప్పుడు వాంగ్మూలాలు, పత్రాలు సృష్టించడం, ఫోర్జరీ, తప్పుడు సమాచారంతో పత్రాలు పూర్తిచేయడం, సాక్షులను ప్రభావితం చేయడం, దొంగతనం, చట్ట ఉల్లంఘన వంటి నేరాలను మోపారు. ఈ మొత్తం ఆరోపణల్లో ది రాకెటీర్ ఇన్‌ఫ్లూయెన్స్, కరప్ట్ ఆర్గనైజేషన్స్ యాక్ట్ ఉల్లంఘన అభియోగాలు అత్యంత తీవ్రమైనవి.
అత్యంత తీవ్రమైన రికో చట్ట ఉల్లంఘన కేసు నమోదు..ఈ మొత్తం ఆరోపణల్లో “ది రాకెటీర్ ఇన్‌ఫ్లూయెన్స్ అండ్ కరప్ట్ ఆర్గనైజేషన్స్ యాక్ట్” (రికో) ఉల్లంఘన అభియోగాలు అత్యంత తీవ్రమైనవిగా చెప్పవచ్చు. ట్రంప్ బృందంపై కూడా ఈ ఆరోపణలు నమోదయ్యాయి. రికో చట్టాన్ని క్రిమినల్ సిండికేట్లను రూపుమాపేందుకు తీసుకొచ్చారు. వేర్వేరు అంశాలను కలిపి కుట్రలను వెలికితీసే వెసులుబాటు ప్రాసిక్యూటర్లకు ఈ చట్టం ద్వారా లభిస్తుంది. మరోవైపు ఈ ఆరోపణలపై ట్రంప్ బృందం స్పందించింది. ఆవేశపూరిత పక్షపాతిగా ప్రాసిక్యూటర్‌ను అభివర్ణించింది. ఈ ఆరోపణలు చేసిన వారే 2024 ఎన్నికల్లో జోక్యం చేసుకోవాలనుకుంటున్నారని అభిప్రాయపడింది. వారు ట్రంప్ ప్రచార ఆధిపత్యాన్ని దెబ్బతీయాలని యత్నిస్తోందని పేర్కొంది.