Movies

దేశభక్తిని రగిలించిన చిత్రాలు

దేశభక్తిని రగిలించిన చిత్రాలు

ఆగస్టు 15.. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశభక్తిని రగిలించే కొన్ని సినిమా సన్నివేశాలు మీకోసం..సినిమా అంటే కేవలం వినోదం మాత్రమే కాదు అప్పుడప్పుడు చరిత్రనూ చెబుతుంది. స్వాతంత్ర్య సమరయోధుల గాథల్ని వివరిస్తుంది. దేశభక్తిని రగిలిస్తుంది. భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 76 ఏళ్లు పూర్తవుతోన్న సందర్భంగా కొన్ని సినిమాల్లోని దేశభక్తి సన్నివేశాలు చూద్దాం (Independence Day)..

సీతారామరాజు వ్యక్తికాదు సమూహ శక్తి..ఆంగ్లేయులపై మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు చేసిన పోరాటాల ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘అల్లూరి సీతారామరాజు’ (Alluri Seetarama Raju). కృష్ణ (Krishna) హీరోగా దర్శకుడు వి. రామచంద్ర రావు రూపొందించిన ఈ సినిమాలోని ప్రతి సన్నివేశం భావోద్వేగంతో కూడుకున్నదే. ప్రాణాలకు తెగించి అల్లూరి చేసిన సాహసం కళ్లకు కట్టినట్లు చూపిస్తుందీ చిత్రం. ‘ఒక్క సీతారామరాజు చనిపోతే లక్షలాది సీతారామరాజులు ఉద్భవిస్తారు. ఒక్కొక్కడు ఒక్కో విప్లవ వీరుడై విజృభించి బ్రిటీషు సామ్రాజ్యపు పునాదులు పెళ్లగిస్తాడు. సీతారామరాజు ఒక వ్యక్తి కాదు సమూహ శక్తి, సంగ్రామ భేరి, స్వాతంత్ర్య నినాదం’ అంటూ అల్లూరిగా కృష్ణ చెప్పిన డైలాగ్‌ విన్నా, సన్నివేశం చూసినా రోమాలు నిక్కబొడుచుకుంటాయి (77th independence day of india).

రేనాటి వీరుడు.. స్వాతంత్ర్య సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితాధారంగా దర్శకుడు సురేందర్‌ రెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ (Sye Raa Narasimha Reddy). బ్రిటీష్‌ వాళ్ల ఆగడాలు ఎలా ఉండేవి? పాలెగాళ్ల బృందంతో నరసింహారెడ్డి వారిని ఎలా ఎదుర్కొన్నాడనేది ఈ సినిమాలో చూడొచ్చు. బ్రిటిషర్లు తనను ఉరి తీయబోతున్నారని తెలిసినా.. ఏమాత్రం భయపడకుండా.. ‘తల ఎత్తండి. కళ్లు తుడుచుకుని, రొమ్ము విరుచుకుని సగర్వంగా చూడండి. మీ ముందున్నది స్వేచ్ఛ. ప్రపంచానికి ముక్తి నేర్పింది మనం. ఇక విముక్తి నేర్పుదాం. బతుకు నేర్పింది మనం. ఇక స్వేచ్ఛ నేర్పుదాం. భరతమాతను బానిసను చేసి, వ్యాపారం చేస్తున్న ఈ తెల్లదొరల తలలు తెంచుతూ తరిమికొడదాం. ఈ గడ్డమీద పుట్టిన ప్రతి ప్రాణానికి లక్ష్యం ఒక్కటే.. స్వాతంత్ర్యం’ అంటూ నరసింహారెడ్డిగా హీరో చిరంజీవి (Chiranjeevi) నాటి పరిస్థితులను ఈతరానికి తెలియజేశారు (indian independence day).

నన్ను చంపితే.. జాతి ద్రోహివి అవుతావ్‌…వెంకటేశ్‌ హీరోగా దర్శకుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన హిస్టారికల్‌ యాక్షన్‌ డ్రామా ఫిల్మ్‌ ‘సుభాష్‌ చంద్రబోస్‌’ (Subash Chandra Bose). ‘చంపరా.. దేశం కోసం ప్రాణాలిచ్చిన అల్లూరి, భగత్‌సింగ్‌లను తెల్లదొరలు చంపారు. నన్ను చంపితే సాటి భారతీయుణ్ని చంపిన మొదటి జాతి ద్రోహివి నువ్వే అవుతావ్‌. చంపరా.. చంపు!’ అంటూ సుభాష్‌ చంద్రబోస్‌గా వెంకటేశ్‌ (Daggubati Venkatesh) ఒదిగిపోయారు.

మనిషే లేనప్పుడు.. మతం ఏం చేస్తుంది?..దేశభక్తి ప్రధానంగా దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కించిన చిత్రం ‘ఖడ్గం’ (Khadgam). మత ఘర్షణకు సంబంధించిన ఓ సన్నివేశంలో నటుడు ప్రకాశ్‌ చెప్పే సంభాషణలు ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తాయి. ‘..ఇలా చంపుకుంటూ వెళ్తే ఎవరూ మిగలరు. మొత్తం శ్మశానం అయిపోద్ది. మనిషే లేనప్పుడు సమాధుల మీద మతం ఏం చేస్తుందిరా..?’ అని ఆయన ప్రశ్నించిన తీరు ఉద్వేగానికి గురిచేస్తుంది. కెప్టెన్‌ (బ్రహ్మాజీ) అనే పాత్రధారిని పాకిస్థానీయులు హత్య చేయగా.. వారిని నా ముందుకువచ్చి యుద్ధం చేయమని చెప్పండంటూ ఆర్మీ అధికారి (శివాజీరాజా) పౌరుషంగా చెప్పే సంభాషణకు వందేమాతరం నేపథ్య సంగీతం తోడై దేశభక్తి పెంపొందిస్తుంది (independence day of india). ‘రోజా’, ‘మహాత్మ’, ‘ది లెజెండ్‌ భగత్‌సింగ్‌’, ‘మేజర్‌’, ‘ఉరి’ , ‘మణికర్ణిక’ తదితర చిత్రాలు దేశభక్తిని చాటేవే.

1936లోనే మొదలైంది..తెలుగులో రూపొందిన తొలి సాంఘిక చిత్రం ‘ప్రేమవిజయం’.1936లో ప్రేక్షకుల ముందుకొచ్చింది. తొలిసారి ఒక సాంఘిక కథతో వచ్చిన ఈ సినిమాలోనే స్వాతంత్య్ర కాంక్ష కనిపిస్తుంది. ఆ తర్వాత వచ్చిన ‘మాల పిల్ల’, ‘మళ్ళీ పెళ్ళి’, ‘రైతు బిడ్డ’, ‘వందేమాతరం’, ‘సుమంగళి’, ‘దేవత’ తదితర చిత్రాల్లో దేశభక్తి ప్రధానంగా సాగే సన్నివేశాలు కనిపిస్తాయి. ‘బొబ్బిలియుద్ధం’, ‘తాండ్ర పాపారాయుడు’, ‘సర్దార్‌ పాపారాయుడు’, ‘మేమూ మనుషులమే’, ‘నాడు నేడు’ తదితర చిత్రాలు స్వతంత్ర పోరాటం నేపథ్యంగా రూపొందినవే.

బ్రిటిష్‌ ప్రభుత్వ నిషేధం:గూడవల్లి రామబ్రహ్మం రూపొందించిన ‘రైతుబిడ్డ’ అప్పటి జమిందారీ వ్యవస్థని విమర్శిస్తూ రూపొందింది. ఆ సినిమా ప్రదర్శనని కొన్నిచోట్ల నిషేధించింది బ్రిటిష్‌ ప్రభుత్వం. ఆ ప్రభుత్వానికి సానుభూతి పరులైన కొద్దిమంది జమిందార్ల కోరికతోనే ఆ ప్రయత్నం చేసింది. ‘వందేమాతరం’ సినిమాకీ అదే పరిస్థితి ఎదురైంది. బ్రిటిష్‌ పాలనలో భారతీయులు ఎదుర్కొంటున్న నిరుద్యోగం, సంఘంలోని వరకట్నం దురాచారాలపై ఎక్కుపెట్టి తీసిన చిత్రమది.

మేజర్ (2022) : అడవి శేషు ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా 2008 ముంబై దాడులలో మరణించిన భారతీయ సైనికుడు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ గురించి తీసిన సినిమా. ముంబై దాడుల సమయంలో అతను చేసిన త్యాగాల గురించి చూపిస్తుంది. ఈ సినిమాకు కనెక్ట్ కానీ భారతీయుడు లేడనే చెప్పాలి.

ది లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్ (2002) : భారతదేశ స్వాతంత్య్రం కోసం పోరాటం చేసి అతి చిన్న వయస్సులోనే ప్రాణాలను కోల్పోయిన వీరుడు భగత్ సింగ్ గురించి తీసిన సినిమా. అజయ్ దేవగన్ నటించిన ఈ సినిమా భగత్ సింగ్ యొక్క త్యాగాలను చూపిస్తుంది.

గదర్ – ఏక్ ప్రేమ్ కథ (2001) : 1947లో భారత దేశ విభజన జరిగిన సమయంలో ప్రేమించుకున్న ఒక హిందూ- ముస్లిం యువతి యువకుల గురించి తీసిన సినిమా.

భారతీయుడు (1995) : భారతదేశంలో బాగు కోసం, లంచాలు లేని స్వచ్ఛమైన సమాజం కోసం పోరాడిన ఒక స్వాతంత్ర సమరయోధుడు కథ ఈ సినిమా. దేశం కోసం సొంత కొడుకునే చంపిన నిజమైన దేశభక్తుడి కథ. ఇందులో కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించి మెప్పించారు .

ఇలా చెప్పుకుంటే ఎన్నో గొప్ప సినిమాలు దేశభక్తి ప్రధానంగా తెరకెక్కాయి. దేశభక్తి పెంపొందిచటంలో సినీ పరిశ్రమ తన వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది