రోజంతా యూట్యూబ్ (Youtube) చూడకుండా ఉండని వారుండరంటే అతిశయోక్తి కాదు. ట్రైలరనో, టీజరనో.. ఎంటర్‌టైన్‌మెంట్ వీడియోలకోసమో, ఇన్‌ఫ్లూయెన్సర్ల షార్ట్స్ కోసమో.. రివ్యూలకనో, ప్రముఖుల వ్యూస్‌కనో.. మనం నిత్యం యూట్యూబ్‌పై ఆధారపడుతుంటాం. ఒక్కోసారి కొన్ని అంశాలను మనం యూట్యూబ్‌లో సెర్చ్ చేస్తుంటాం. ఇక అప్పటి నుంచి దానికి సంబంధించిన వీడియోలే మన యూట్యూబ్ ఫీడ్‌లో (Youtube feed) దర్శనమిస్తుంటాయి. మరి యూట్యూబ్ చూపించే ఈ ఫీడ్‌ను మనం నియంత్రించే అవకాశం ఉందా? (How to control YouTube feed)యూట్యూబ్ ఫీడ్ అనేది సాధారణంగా వ్యక్తుల ఆసక్తుల ఆధారంగా కనిపిస్తాయి. కొందరికి సినిమాలంటే ఇష్టం. మరికొందరికి స్పోర్ట్స్ అంటే ఆసక్తి. ఇలా వారి వారి ఇష్టాలను బట్టే ఫీడ్ కనిపిస్తుంది. యూజర్ సెర్చ్ హిస్టరీ, వాచ్ హిస్టరీ ఇందులో కీలకం. అయితే, మన స్మార్ట్‌ఫోన్‌లోని యూట్యూబ్‌ను ఒకరే వాడితే పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ ఒకటే ఫోన్‌ను ఇంట్లో వేర్వేరు వ్యక్తులు వాడినప్పుడు ఫీడ్ మొత్తం గందరగోళంగా మారిపోతుంది. ఇంట్లో చిన్న పిల్లలు మారాం చేస్తున్నారు కదా అని ఏ కార్టూన్లో పెడితే అప్పటి నుంచి అలాంటి వీడియోలే కనిపిస్తుంటాయి. అలాగే ఏదైనా ఆరోగ్య సమస్యకు చిట్కా కోసం చూస్తే ఇక ఫీడ్ నిండా అలాంటి వీడియోలే కనిపిస్తాయి. అలాంటి వాటికి చెక్ పెట్టేందుకు యూట్యూబ్ కొన్ని ఆప్షన్లు ఇస్తోంది.
యూట్యూబ్ ఓపెన్ చేసి.. ఫీడ్‌లో మీరు వద్దనుకుంటున్న వీడియో పక్కన ఉండే త్రీ డాట్స్ మెనూపై క్లిక్ చేయండి. అక్కడ రెండు ఆప్షన్లు కనిపిస్తాయి. అందులో ‘Don’t recommend channel’ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే.. ఇకపై ఆ ఛానల్‌కు సంబంధించిన కంటెంట్ మీ ఫీడ్‌లో కనిపించదు. ఒకవేళ పొరపాటున ఏదైనా ఛానల్‌కు పొరపాటున ఈ ఆప్షన్ వినియోగించినా ‘Undo’ ఆప్షన్ వినియోగించొచ్చు. అలా కాకుండా ‘Not Intrested’ అనే ఆప్షన్ వినియోగిస్తే ఇకపై ఆ తరహా వీడియోలను యూట్యూబ్ రికమెండ్ చేయకుండా ఉంటుంది.
యూట్యూబ్ ఫీడ్ అనేది మన సెర్చ్ హిస్టరీ, వాచ్ హిస్టరీపై ఆధారపడి ఉంటుందనేది గుర్తుంచుకోవాలి. కాబట్టి ఈ వాచ్ హిస్టరీని, సెర్చ్ హిస్టరీని మేనేజ్ చేయగలిగితే యూట్యూబ్ ఫీడ్‌ను మనం నియంత్రించొచ్చు.
డిలీట్ వాచ్ హిస్టరీ: మనం ఏదైనా వీడియో చూశాక ఆ తరహా వీడియోలే మనకు ఫీడ్‌లో కనిపించడం గమనించొచ్చు. అప్పుడు వాచ్ హిస్టరీ నుంచి సంబంధిత వీడియోను డిలీట్ చేస్తే ఇకపై ఆ తరహా వీడియోలను యూట్యూబ్ చూపించదు.
సెర్చ్ హిస్టరీ: మనం ఏదైనా ఒక అంశానికి సంబంధించి యూట్యూబ్‌లో సెర్చ్ చేసి ఉంటే.. ఆ తరహా వీడియోలు ఫీడ్‌లో కనిపించే అవకాశాలు ఎక్కువ. కాబట్టి సెర్చ్ హిస్టరీలో ఆ టాపిక్‌ను తొలగించడం ద్వారా ఫీడ్‌ను నియంత్రించొచ్చు.
హిస్టరీ పాజ్ చేయండి: ఒకవేళ సంబంధిత వీడియోను సెర్చ్ చేసే ముందే మీరు ఆ తరహా వీడియోలు భవిష్యత్‌లో కనిపించకుండా హిస్టరీని పాజ్ చేయొచ్చు. కాబట్టి మీరు ఆ అంశాన్ని వెతకడం పూర్తయ్యేవరకు హిస్టరీని పాజ్‌లో ఉంచొచ్చు. మీకు నచ్చినప్పుడు పాజ్‌ను తొలగించొచ్చు.
క్లియర్ హిస్టరీ: మీరు చూస్తున్న ఫీడ్‌లో మీ ఆసక్తులకు అనుగుణంగా వీడియోలు ఏమాత్రం కనిపించడం లేదనిపిస్తే.. ఇప్పటి వరకు ఉన్న వాచ్ హిస్టరీ, సెర్చ్ హిస్టరీ మొత్తాన్ని తొలగించొచ్చు. ఇందుకోసం యూట్యూబ్‌లో హిస్టరీలో ఉండే ‘క్లియర్ హిస్టరీ’ ఆప్షన్‌ను వినియోగించాల్సి ఉంటుంది. అప్పటికే ఫీడ్‌లో ఉన్న కొన్ని వీడియోలు మాత్రం భవిష్యత్‌లో చూడాలనుకుంటే.. ‘వాచ్ లేటర్’ అనే ఆప్షన్‌ను వినియోగించుకోవచ్చు.