Food

భారీగా పెరిగిన అరటి పళ్లు రేటు

భారీగా పెరిగిన అరటి పళ్లు రేటు

ఇటీవలి కాలంలో టమోటా (tomato) కేజీ రూ.200లకు పైగా ధర పలికి సామాన్యులను హడలెత్తించింది. మార్కెట్లోకి సరఫరా పెరగడంతో క్రమంగా వాటి ధరలు దిగివస్తున్నాయి. అయితే తాజాగా బెంగళూరులో (Bengaluru) కేజీ అరటి పండ్ల (banana) ధర రూ.వందకు చేరింది. దాంతో కొనుగోలుదారులు గగ్గోలు పెడుతున్నారు. రైతుల నుంచి తగినంత సరఫరా లేకపోవడంతో అరటి పండ్లకు డిమాండ్‌ ఏర్పడిందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. బెంగళూరులో విక్రయించే అరటి పండ్లలో మెజారిటీ వాటా తమిళనాడు రాష్ట్రం నుంచే వస్తాయి. ఎలక్కిబలే, పచ్‌బలే రకాలను బెంగళూరు వాసులు ఎక్కువగా ఇష్టపడి కొంటారు. తమిళనాడు నుంచి ఈ రకం పండ్ల సరఫరా తగ్గిపోయింది. సుమారు నెల రోజుల క్రితం బిన్నీపేట్ మార్కెట్‌కు 1500 క్వింటాళ్ల ఎలక్కిబలే సరకు వస్తే.. ప్రస్తుతం అది 1000 క్వింటాళ్లకు పడిపోయినట్లు అధికారులు తెలిపారు. బెంగళూరుకు వచ్చే సరకు తుమకూరు, రామనగర, చిక్‌బళ్లాపూర్, అనేకల్, బెంగళూరు రూరల్‌కు పంపిణీ అవుతుందని పేర్కొన్నారు.తమిళనాడులోని హోసూరు, కృష్ణగిరి నుంచి ఎక్కువగా కర్ణాటకకు అరటి రవాణా అవుతుందని మార్కెట్ అధికారులు తెలిపారు. సరఫరా తగ్గిపోవడంతో హోల్‌సేల్‌లో ఎలక్కిబలే రకం కేజీ రూ.78, పచ్‌బలే రకం రూ.18-20 పలుకుతోందని చెప్పారు. అన్ని ఖర్చులూ కలుపుకొని వ్యాపారులు వాటిని కేజీ రూ.100, రూ.40 చొప్పున విక్రయిస్తున్నారని తెలిసింది. మరి కొన్ని రోజుల్లో ఓనం, వినాయక చవితి, విజయ దశమి పండగలు రానున్న నేపథ్యంలో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని ఓ మండి వ్యాపారి అభిప్రాయపడ్డారు.