Movies

విజయ్ సినిమాలో ధోనీ నా?

విజయ్ సినిమాలో ధోనీ నా?

కోలీవుడ్‌లో దళపతి విజయ్‌ సినిమా వస్తుందంటే సంబరాలు మొదలవుతాయి. ఈ స్టార్ హీరో తన సినిమాకు సంబంధించిన కొత్త ప్రకటన చేసిన దగ్గరి నుంచే అప్‌డేట్స్‌ కోసం అభిమానులంతా ఎదురుచూస్తుంటారు. తాజాగా  విజయ్‌ అప్‌కమింగ్‌ మూవీకి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ వార్త విన్న సినీప్రియులతో పాటు క్రీడాభిమానులు కూడా తెగ ఖుష్ అవుతున్నారు.టీమిండియా మాజీ కెప్టెన్‌ ధోనీ (MS Dhoni) సినిమాల్లోకి రానున్నారనే వార్త ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. విజయ్‌ (Vijay) హీరోగా వెంకట్‌ ప్రభు (Venkat Prabhu) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాలో (Thalapathy 68) ధోనీ ఓ కీలకపాత్రలో కనిపించనున్నాడట. ఈ మేరకు తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ప్రతినాయకుడి ఛాయలున్న పాత్రలో ఈ క్రికెటర్‌ కనిపించనున్నాడని టాక్‌. విజయ్‌, ధోనీలు కలిసున్న ఫొటో ఒకటి నెట్టింట సందడి చేస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రాలేదు కానీ, వార్తను మాత్రం అభిమానులు షేర్ చేస్తున్నారు.

ప్రస్తుతం విజయ్‌ ‘లియో’ (Leo) షూటింగ్‌ పూర్తిచేసుకుని దాని విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. గ్యాంగ్‌స్టర్‌ డ్రామా కథాంశంతో రూపొందిన ఈ సినిమాలో త్రిష (Trisha) కథానాయిక. బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌, గౌతమ్‌ మేనన్‌, మిస్కిన్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అక్టోబరు 19న సినిమా విడుదల కానుంది. అలాగే ధోనీ కూడా ఓ సొంత నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి సినీ రంగంలోకి అడుగుపెట్టారు. తన బ్యానర్‌పై (ధోని ఎంట‌ర్‌టైన్‌మెంట్స్) ఇప్పటికే ఓ సినిమాను తీసి ప్రేక్షకులను అలరించారు. అయితే ఆ సినిమాలోనే ధోనీ కనిపించనున్నాడని వార్తలు వచ్చాయి. తీరా విడుదలయ్యాక అవ్వన్నీ రూమర్సేనని తెలిసింది. ఇక విజయ్‌ సినిమాలోనైనా ధోనీ (MS Dhoni) కనిపిస్తాడో లేదో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.