DailyDose

శ్రీశైలంలో చిరుత కలకలం

శ్రీశైలంలో చిరుత కలకలం

తిరుమల నడక దారిలో చిరుత సంచారం ఎంతటి కలకలం రేపిందో చెప్పాల్సిన పనిలేదు. ఆరేళ్ల చిన్నారిని దాడి చేసి చంపేసిన ఘటన రెండు రాష్ట్రాలను ఉలిక్కిపడేలా చేసింది. అభంశుభం తెలియని చిన్నారి చిరుత దాడిలో బలికావడం అందరినీ ఆందోళన గురి చేసింది. చిరుత అటాక్‌తో టీటీడీ అధికారులు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. నడక దారిలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలను ఏర్పాటు చేశారు. చిన్నారులకు ట్యాగ్ మొదలు, ఒకేసారి ఎక్కువ సంఖ్యలో పంపించడం, మధ్యాహ్నం సమయంలో చిన్నారులను నడక మార్గంలో అనుమతించకపోవడం వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇక తిరుమలలో ఏమంటూ చిరుత కలకలం రేపిందో తిరుత జనావసాల్లోకి వస్తున్న సంఘటన తరచూ కనిపిస్తున్నాయి.

తాజాగా మరో పుణ్య క్షేత్రమైన శ్రీశైలంలో చిరుత కలకలం రేపింది. శ్రైశైలం ఔటర్‌ రింగ్ రోడ్డులో చిరుత కనిపించింది. ఆలయానికి కూతవేటు దూరంలో ఉన్న శివాజీ స్ఫూర్తి కేంద్ర గురుకులం సమీపంలో రోడ్డు పక్కన ఉన్న ఓ గోడపై చిరుతను సోమవారం రాత్రి సమయంలో స్థానికులు గుర్తించారు. రోడ్డు ఉన్న గేదెపై అటాక్‌ చేయడానికి చిరుత అక్కడ మాటు వేసినట్లు ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డు నుంచి అటుగా వెళ్తున్న కొందరు భక్తులకు చిరుత తారసపడింది. దీంతో వాహనంలో నుంచి ఫోన్‌లో వీడియో తీశారు. ఇదిలా ఉంటే శ్రీశైలం సమీపంలోని శిఖరేశ్వరం ఆలయం సమీపంలో ఎలుగుబంటి కలకలం రేపిన విషయం తెలిసిందే.

చిరుతను గమనించిన భక్తులు వెంటనే ఆలయ నిర్వాహకులకు సమాచారం అందించారు. దీంతో ఆలయ నిర్వాహకులు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు చిరుత సంచరించిన స్థలానికి చేరుకున్నారు. చిరుత సంచారానికి సంబంధించి వివరాలు సేకరించారు. పులి కనిపించిన క్రమంలో జాగ్రత్తగా ఉండాలని స్థానికులను సూచించారు. రాత్రుళ్లు ఒంటరిగా బయటకు వెళ్లొద్దని, వెంటనే కర్రలాంటిది ఏదైనా ఉండేలా చూసుకోవాలని తెలిపారు. ఇక చిరుత అడుగు జాడల ఆధారంగా ఎటు వెళ్లిందన్న దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. మొత్తం మీద మొన్న తిరుమలలో నేడు శ్రీశైలంలో చిరుత సంచారం ప్రజల్లో భయాందోళనకు గురి చేస్తోంది.