Business

ఓలా నుంచి  కొత్త స్కూటర్లు-TNI నేటి వాణిజ్య వార్తలు

ఓలా నుంచి  కొత్త స్కూటర్లు-TNI నేటి వాణిజ్య వార్తలు

300 కొత్త SBI శాఖలు

ఈ ఏడాది కొత్తగా 300 బ్రాంచ్లను ప్రారంభించనున్నట్లు SBI వెల్లడించింది. డిజిటల్గా ఎదుగుతూనే.. ఫిజికల్ బ్రాంచ్లపైనా దృష్టి పెట్టినట్లు ఛైర్మన్ దినేశ్ ఖరా తెలిపారు. కస్టమర్ల అవసరాలను తాము అర్థం చేసుకుంటున్నామని, అందుకు అనుగుణంగా సేవలు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కాగా, ప్రస్తుతం దేశంలో 22,405, విదేశాల్లో 235 SBI బ్రాంచ్లు పనిచేస్తున్నాయి.

ఓలా నుంచి  కొత్త స్కూటర్లు

ప్రముఖ విద్యుత్‌ వాహనాల తయారీదారు ఓలా ఎలక్ట్రిక్‌ (Ola electric) భారత మార్కెట్లోకి కొత్త విద్యుత్‌ స్కూటర్లను తీసుకొచ్చింది. ఆగస్టు 15న సందర్భంగా ‘కస్టమర్‌ డే’ పేరిట నిర్వహించిన ఈవెంట్‌లో వీటిని లాంచ్‌ చేసింది. ఓలా ఎస్‌ 1 ఎక్స్‌ (ola S1X) పేరిట మూడు వేరియంట్లను తీసుకొచ్చింది. ఎస్‌1 ఎక్స్‌ (ola S1X) (2kWh), ఎస్‌1 ఎక్స్‌ (ola S1X) (3kWh), ఎస్‌ 1 ఎక్స్‌+ (ola S1 X+) పేరిట వీటిని లాంచ్‌ చేసింది. ఈ మూడు మోడళ్లనూ లక్ష రూపాయల్లోగా తీసుకురావడం గమనార్హం. దీంతో తన ప్రొడక్ట్‌ పోర్ట్‌ఫోలియోలో ఉన్న ఎస్‌ 1 ప్రో (ola S1 Pro) సెకండ్‌ జనరేషన్‌ను కూడా ఆవిష్కరించింది. స్కూటర్లతో పాటు మూవ్‌ ఓఎస్‌ 4ను ఆవిష్కరించింది. సెప్టెంబర్‌ 15 నుంచి బీటా వెర్షన్‌ అందుబాటులో ఉంటుందని ఓలా సీఈఓ భవీశ్‌ అగర్వాల్‌ తెలిపారు.ఓలా ఎక్స్‌1 శ్రేణి స్కూటర్లు రెండు రకాల బ్యాటరీ వేరియంట్లతో వస్తున్నాయి. ఓలా ఎక్స్‌ 1+ స్కూటర్‌ ధర రూ.1.09 లక్షలు కాగా.. ప్రారంభ ఆఫర్‌ కింద రూ.99,999కే విక్రయిస్తున్నట్లు ఓలా తెలిపింది. ఆగస్టు 21 వరకు ఈ ధర అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. ఇక ఓలా ఎస్‌ 1ఎక్స్‌ (3kWh) స్కూటర్‌ రూ.99,999గా నిర్ణయించారు. దీన్ని సైతం ఆగస్టు 21 వరకు రూ.10 వేలు తక్కువకే విక్రయించనున్నారు. ఎస్‌ 1 ఎక్స్‌ (2 కిలోవాట్‌ బ్యాటరీ) మోడల్‌ను రూ.89,999 కాగా.. ఆగస్టు 21 వరకు రూ.79,999కే విక్రయించనున్నట్లు భవీశ్‌ తెలిపారు. అలాగే ఎస్‌1 ప్రో సెకండ్‌ జనరేషన్‌ మోడల్‌ ధర రూ.1.47 లక్షలు కాగా.. ఎస్‌ 1 ఎయిర్‌ రూ.1.19 లక్షలుగా కంపెనీ పేర్కొంది.

విశ్వకర్మ పేరుతో కొత్త పథకం: మోదీ

విశ్వకర్మల కోసం 15,000 కోట్లతో ప్రత్యేక పథకం అమలు చేయబోతున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన చేశారు. కాసేపటి క్రితమే.. ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన అనంతరం దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తోన్నారు ప్రధాని మోదీ.స్వాతంత్య్రం కోసం ప్రాణత్యాగాలను చేసిన మహనీయులను స్మరించుకున్న ప్రధాని మోదీ…ఈ సారి ప్రకృతి వైపరీత్యాలు దేశాన్ని అల్లకల్లోలానికి గురి చేశాయన్నారు. పలు ప్రాంతాల్లో ఊహకందని విధంగా సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయని వివరించారు. కష్టకాలంలో బాధితులకు దేశ ప్రజలు అండగా ఉన్నారని తెలిపారు ప్రధాని మోదీ. వచ్చే నెలలో విశ్వకర్మల కోసం 13 వేల నుంచి 15,000 కోట్లతో ప్రత్యేక పథకం అమలు చేయబోతున్నట్లు వెల్లడించారు.

ఆర్థిక వృద్ధిలో 5 దేశాల్ని దాటేసిన భారత్’

ప్రపంచంలోనే భారత్ 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉందని PM మోదీ వెల్లడించారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను కేంద్రం విడుదల చేసింది. 2014 ఆర్థిక వ్యవస్థలో 10వ స్థానంలో ఉన్న భారత్ 2023నాటికి 5వ స్థానానికి చేరినట్లు వివరించింది. రష్యా, ఇటలీ, బ్రెజిల్, ఫ్రాన్స్, UKను దాటుకుని భారత్ ఈ ఘనతను సాధించినట్లు పేర్కొంది. కాగా వచ్చే ఐదేళ్లలో భారత్ 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని మోదీ తెలిపారు.

నేటి బంగారం ధరలు 

మహిళలకు బిగ్ అలర్ట్. నేడు దేశంలో బంగారం ధరలు స్థిరంగా నమోదు అయ్యాయి. గత రెండు రోజుల నుంచి స్వల్పంగా పెరుగుతూ వస్తున్న గోల్డ్ రేట్స్ ఈరోజు స్థిరంగా ఉన్నాయి. ఈరోజు హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధరల వివరాల్లోకి వెళ్లితే..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.59,620 ఉండగా, అదే సమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,650 గా ఉంది.

ఎయిర్​టెల్ బంపర్​ ఆఫర్​

వాస్తవానికి భారతీ ఎయిర్​టెల్​.. యూజర్​ ఫ్రెండ్లీ టారిఫ్​లు అందించి తమ వినియోగదారుల సంఖ్యను పెంచుకునే దిశగా అడుగులు వేస్తోంది. అలాగే ఒక్కో వినియోగదారుపై సగటు ఆదాయం (ARPU) కూడా పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం భారత మార్కెట్​లోని టెలికాం కంపెనీల్లో రూ.200 ఏఆర్​పీయూతో భారతీ ఎయిర్​టెల్​ అగ్రస్థానంలో ఉంది. దీనిని మరింత పెంచుకునే దిశగా అడుగులు వేస్తూ.. తాజాగా రూ.99 డేటా ప్లాన్​ను తన ప్రీపెయిడ్​ యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది.వినియోగదారుల విభిన్న అభిరుచులు, ప్రాధాన్యతలకు అనుగుణంగా.. ఎయిర్​టెల్ అనేక​ అన్​లిమిటెడ్​ డేటా ప్లాన్​ లను తీసుకొచ్చింది. కానీ హై-స్పీడ్ డేటా అయిపోయిన తరువాత.. ఇంటర్నెట్​ స్పీడ్ ఆటోమేటిక్​గా తగ్గిపోతుంది. ఇలాంటి సమయంలోనే అన్​లిమిటెడ్​ హై-స్పీడ్ డేటా ప్యాక్​లు అక్కరకు వస్తాయి. యూజర్లు కూడా సరిగ్గా ఇలాంటి డేటా ప్లాన్​ల కోసం ఎదురుచూస్తూ ఉంటారు. అందుకే భారతీ ఎయిర్​టెల్​ ఒక వ్యూహం ప్రకారం రూ.99 డేటా ప్లాన్​ను తీసుకొచ్చింది.ఎయిర్​టెల్​ రూ.99 డేటా ప్యాక్​తో అపరిమిత డేటా వాడుకోవచ్చు. కానీ దీని వ్యాలిడిటీ ఒక్క రోజు మాత్రమే. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఫెయిర్​ యుసేజ్ పాలసీ (ఎఫ్​యూపీ) నిబంధనల ప్రకారం, ఈ అన్​లిమిటెడ్ ప్రీపెయిడ్​​ ప్యాక్​ గరిష్ఠ డేటా పరిమితి 30జీబీ. ఒక వేళ యూజర్​ 30 జీబీ మొత్తాన్ని వినియోగించుకుంటే.. తరువాత 64Kbps వేగంతో ఇంటర్నెట్​ను వినియోగించుకోవచ్చు.

నేడు గ్యాస్ సిలిండర్ ధరలు

నిత్యవసర వస్తువుల్లో ఒకటైన గ్యాస్ సిలిండర్ ధరలను ప్రతి నెల ఒకటో తేదీన సవరిస్తుంటారు. ఈ ధరలు అంతర్జాతీయ ముడి చమురు రేట్లపై ఆధారపడి ఉంటాయి. ఇటీవల కమర్షియల్ గ్యాస్ రేట్లను తగ్గించిన ఆయిల్ కంపెనీలు.. గృహవినియోగ గ్యాస్ సిలిండర్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు. దీంతో LPG గ్యాస్ సిలిండర్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.హైదరాబాద్:రూ. 1,155,వరంగల్:రూ. 1,174,విశాఖపట్నం:రూ. 1,112, విజయవాడ: రూ. 1,118,గుంటూరు:రూ. 1,114.

ఎగుమతులు 16%, దిగుమతులు 17% డౌన్

గతేడాదితో పోలిస్తే జూలై నెలలో భారత ఎగుమతులు విలువ 16శాతం క్షీణించి 32.25 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. పెట్రోలియం, రత్నాలు, ఆభరణాలు, ఇతర కీలక రంగాల ఎగుమతులు భారీగా పడిపోయాయి. మరోవైపు దిగుమతులు విలువ సైతం 17శాతం క్షీణించి 52.92 బిలియన్ డాలర్లకు పడిపోయింది. దీంతో వాణిజ్య లోటు 20.67 బిలియన్ డాలర్లుగా నమోదయింది. కాగా ఏప్రిల్- జూలై మధ్య కాలంలో బంగారం ఎగుమతులు మాత్రం పెరిగాయి.

మోడి ప్రసంగంలో 6జీ ప్రస్తావన

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ప్రధాని మోదీ  ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా 6జీ సాంకేతికత గురించి తన ప్రసంగంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ అభివృద్ధి చెందుతోందని, అంతర్జాతీయంగా ఎక్కడా లేని విధంగా తక్కువ ధరకే మొబైల్‌ డేటా ప్లాన్లను అందిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం దేశంలో 5జీ సాంకేతికత (5G Technology) అందుబాటులో ఉందని.. త్వరలోనే 6జీ సాంకేతికతను (6G Technology) ప్రజలకు పరిచయం చేసేందుకు భారత్‌ వడివడిగా అడుగులు వేస్తోందన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా 6జీ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దీంతో 6జీ గురించి మరోసారి చర్చ మొదలైంది. ఇంతకీ 6జీ నెట్‌వర్క్‌ (6G Network) అంటే ఏంటి? 5జీ కంటే ఇది ఎంత మెరుగ్గా ఉంటుందో చూద్దాం. 5జీ నెట్‌వర్క్‌కు అడ్వాన్స్‌డ్‌ వెర్షనే 6జీ. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 5జీ సేవలు 700 జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి. త్వరలో దేశవ్యాప్తంగా మారుమూల ప్రాంతాలకు సైతం 5జీ సేవలు విస్తరించనున్నట్లు టెలికాం నెట్‌వర్క్‌ సంస్థలు చెబుతున్నాయి. ఇక 6జీ నెట్‌వర్క్‌ 5జీ కంటే వెయ్యి రెట్ల వేగంతో పనిచేస్తుంది. టెలికాం విభాగం (DoT) విడుదల చేసిన 6జీ డాక్యుమెంట్‌ ప్రకారం.. 5జీ నెట్‌వర్క్‌ సెకనుకు 10 గిగాబైట్స్‌ వేగంతో పనిచేస్తే.. 6జీ సెకనుకు ఒక టెరాబైట్‌ వేగంతో పనిచేస్తుంది. ఫ్రీక్వెన్సీ బ్యాండ్‌ల పరంగా 5జీ ఆపరేటర్లు 24 గిగాహెడ్జ్‌ నుంచి 66 గిగాహెడ్జ్‌ స్పెక్ట్రమ్‌ వేవ్‌లను ఉపయోగిస్తుంటారు. దీనివల్ల డేటా బదిలీ వేగంగా జరుగుతుంది. 6జీలో మాత్రం స్పెక్ట్రమ్‌ వేవ్‌లు 30 గిగా హెడ్జ్‌ల నుంచి 300 గిగాహెడ్జ్‌లను దాటి టెరాహెడ్జ్‌ల వరకు ఉపయోగించవచ్చు. ప్రస్తుతం సెల్ఫ్‌ డ్రైవింగ్‌ కార్లు, స్మార్ట్‌ సిటీలు, రిమోట్ హెల్త్‌కేర్‌ వంటి సేవల్లో 5జీ నెట్‌వర్క్‌ కీలకం కానుంది. 6జీ ద్వారా ఈ సేవలు మరింత ఆధునిక సాంకేతికతతో వినియోగదారులకు అందుబాటులోకి వస్తాయని సాంకేతిక రంగ నిపుణులు చెబుతున్నారు. ఉదాహరణకు 6జీ నెట్‌వర్క్‌ ద్వారా హెచ్‌డీ క్వాలిటీ కలిగిన 100 సినిమాలను ఒక నిమిషంలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా కారులో లేదా విమానంలో ప్రయాణిస్తూ.. ఫోన్‌ ద్వారా వేర్వేరు సాంకేతికతలను ఉపయోగించుకునే వెసులుబాటు ఉంటుంది. దీని వల్ల ఎంత దూరంలో ఉన్న డివైజ్‌లనైనా ఫోన్‌తో కంట్రోల్‌ చేయడంతోపాటు.. ఒకేసారి అధిక సంఖ్యలో వేర్వేరు గ్యాడ్జెట్‌లతో అనుసంధానం కావచ్చు. 6జీ నెట్‌వర్క్‌ వాస్తవిక ప్రపంచానికి, డిజిటల్‌ వరల్డ్‌కు మధ్య ఉన్న దూరాన్ని చెరిపేస్తుందని టెక్‌ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు 6జీ సేవలను ప్రపంచ దేశాలతోపాటు మన దేశంలోనూ ఏక కాలంలో ప్రారంభించేలా కేంద్రం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. శాంసంగ్‌, ఎల్‌జీ, హువావే లాంటి సంస్థలు ఇప్పటికే 6జీ మీద ప్రయోగాలు చేస్తున్నాయి. టెక్‌ నిపుణుల అంచనా ప్రకారం 2028 – 2030 మధ్యలో 6జీ నెట్‌వర్క్‌ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. తొలుత జపాన్‌లో, ఆ తర్వాత దక్షిణ కొరియా, చైనా, ఫిన్‌లాండ్‌లో వస్తుందని సమాచారం.