శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్తున్న విద్యార్థులతో గత కొన్ని రోజులుగా విమానాశ్రయంలో రద్దీ పెరుగుతోంది. రోజూ 50వేల మంది డొమెస్టిక్, 10వేల మంది అంతర్జాతీయ ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. వీరిలో ఉన్నత విద్యకోసం రోజూ విదేశాలకు వెళ్తున్న విద్యార్థుల సంఖ్య దాదాపు 5వేల వరకు ఉంది. ముఖ్యంగా అమెరికా, కెనడాకు అధిక సంఖ్యలో విద్యార్థులు వెళ్తున్నారు.
ఆగస్టు, సెప్టెంబర్‌లో అమెరికా, కెనడాలో విద్యాసంవత్సరం ప్రారంభమవుతుంది. దీంతో గత రెండు వారాలుగా శంషాబాద్ ఎయిర్ పోర్టుకు రోజూ లక్ష నుంచి లక్షన్నర మంది వస్తున్నారు. రోజుకు 70వేలకు పైగా కార్లు వస్తున్నాయి. విమానాశ్రయానికి వచ్చే వాహనాలతో ట్రాఫిక్, పార్కింగ్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో విదేశాలకు వెళ్లే విద్యార్థులకు వీడ్కోలు కోసం నలుగురికి మంచి రావొద్దని విమానాశ్రయం అధికారులు సూచిస్తున్నారు. మరో వైపు పంద్రాగస్టు సందర్భంగా ఈనెల 20వరకు విమానాశ్రయంలో హై అలర్ట్ ప్రకటించారు. ఆంక్షల వేళ ప్రయాణికులు అర్థం చేసుకోవాలని సిబ్బంది కోరుతున్నారు.