* విమానం కూలి 26 మంది భారత సైనికులు మృతి.. క్లారిటీ
స్వాతంత్ర్య దినోత్సవాన నైజీరియాలో భారత వైమానిక దళానికి చెందిన MI-171 హెలికాప్టర్ కూలిపోయిందని, ఈ ఘటనలో 26 మంది సైనికులు చనిపోగా 8 మందికి గాయాలయ్యాయని ఓ వార్త చక్కర్లు కొడుతోంది. సైనికుల మృతి వార్త విన్న ప్రజలు ఆందోళన చెందడంతో.. కేంద్ర ప్రభుత్వ PIBFactCheck స్పందించింది. ఇది తప్పుడు వార్త అని, ఆ విమానం ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు సంబంధించినది కాదని స్పష్టం చేసింది
* తిరుపతి జిల్లాలో దారుణం
తిరుపతిలో దారుణ ఘటన వెలుగు చూసింది. కుటుంబకలహాల నేపథ్యంలో రెండో భార్యను దారుణంగా హత్య చేశాడో భర్త. ఆ తరువాత నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. కుటుంబకలహాల నేపథ్యంలో ఆమెమీద దాడి చేసి భర్త.. తీవ్రంగా కొట్టాడు. దీంతో ఆమె మృతి చెందింది. దీనిమీద పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
* సినిమా థియేటర్‌లో ఒక్కసారిగా కలకలం
పాకిస్తాన్ జిందాబాద్ అని నినాదాలు చేశారని ఇద్దరిని జనాలు కుమ్మేశారు. పిచ్చకొట్టుడు కొట్టారు. కుమ్మి కుమ్మి పడేశారు. ఆ ఇద్దరికీ దేహశుద్ధి చేశారు. ఓ సినిమా థియేటర్ లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటన ఎక్కడ? ఎప్పుడు? జరిగిందో క్లారిటీ లేదు. కానీ, సినిమా థియేటర్ లో జరిగినట్లుగా స్పష్టంగా తెలుస్తుంది.బాలీవుడ్ స్టార్ హీరో సన్నీడియోల్, అమీషా పటేల్ ప్రధాన పాత్రల్లో నటించిన గదర్-2 సినిమా ఇటీవల విడుదలైంది. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. 1971 భారత్-పాకిస్తాన్ యుద్ధ సమయంలో బోర్డర్ లోని పరిస్థితుల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. 2011లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ గదర్ కు ఈ సినిమా సీక్వెల్. ఆగస్టు 11న రిలీజ్ అయ్యింది.గదర్-2 సినిమా ప్రదర్శితం అవుతున్న ఓ థియేటర్ లోనే ఈ ఘటన జరిగింది. సినిమా చూస్తున్న సమయంలో సడెన్ గా ఇద్దరు వ్యక్తులు పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. అంతే, చుట్టుపక్కల ఉన్న వారికి మండిపోయింది. వారిలో కోపం కట్టలు తెంచుకుంది. భారత్ లో ఉంటూ పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తారా? అంటూ వారిని చితక్కొట్టారు. మీరు దేశద్రోహులు అంటూ.. చుట్టూ చేరిన జనం వారిద్దరికీ దేహశుద్ధి చేశారు. కుమ్ముడు కుమ్మారు. అంతా కలిసి ఆ ఇద్దరిని పిచ్చకొట్టుడు కొట్టారు. వారికి సినిమా హాల్ లోనే సినిమా చూపించారు. మరోసారి పిచ్చికూతలు కూస్తే బాక్స్ బద్దలవుతుందని హెచ్చరించి వదిలేశారు.ఆ వ్యక్తులను కొడుతున్న సమయంలో గదర్ సినిమాలోనూ ఫైటింగ్ సీన్ రావడం వీడియోలో కనిపిస్తుంది. గట్టిగా అరుస్తూ హీరో ఓ వ్యక్తికి వార్నింగ్ ఇస్తుంటాడు.
* తాగిన మైకంలో ప్రాణ స్నేహితుడి హత్య!
వారిద్దరూ ప్రాణ స్నేహాతులు.. ప్రతి రోజు కలుసుకుంటారు. ఈ ఇద్దరి ఇళ్ళు కూడా పక్క పక్కనే ఉంటాయి. ప్రతి రోజు కలిసి మెలిసి తిరుగుతారు. ఐతే ఈ ఇద్దరికి తాగుడు అలవాటు ఉంది. తగిన మత్తులో స్నేహితులిద్దరూ గొడవ పడ్డారు. చిన్నపాటి గొడగా ప్రారంభమై ఆ తర్వాత అది హద్దులు దాటింది. దీంతో తాగిన మైకంలో ఒకరు మరొకరిని హత్య చేశారు. దీంతో మృతి చెందిన స్నేహితుడి పిల్లలు అనాథలుగా మిగిలారు. తప్పు తెలుసుకున్న నిందితుడు నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి నేరం అంగీకరించి లొంగిపోయాడు. కరీంనగర్‌లో చోటుచేసుకున్న ఈ విషాద ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..కరీంనగర్ జిల్లా రేకుర్తిలో దారుణహత్య జరిగింది. ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య మాటామాటా పెరిగి హత్యకు దారి తీసిన ఘటన విషాదం రేపింది. రేకుర్తికి చెందిన మావురం నాగరాజు, అతని ఇంటికెదురుగా ఉంటున్న ఆటో డ్రైవర్ అజయ్ ఇద్దరూ స్నేహితులు. నాగరాజు ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఈరోజు ఉదయం మందు పార్టీ చేసుకుంటున్న తరుణంలో ఫ్రెండ్స్ ఇద్దరి మధ్యా ఏదో మాటా మాటా పెరగడంతో అజయ్ బీరు సీసా పగులగొట్టి నాగరాజును పొడిచాడు. అప్పటికే రెండుమూడు పోట్లు పడ్డ నాగరాజు అరవడంతో చుట్టుపక్కల వారు వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో నాగరాజును ప్రభుత్వ ఆసుపత్రికి వెంటనే తరలించినా లాభం లేకపోయింది. నాగరాజు మృతితో ఆ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది.
* అత్తాపూర్ లో శవమైన కనిపించిన ఓ వ్యక్తి
రంగారెడ్డి జిల్లాలోని అత్తాపూర్ పోలీస్ స్టేషన్ ముందు గులామ్ హుస్సేన్ కుటుంబ సభ్యుల ధర్నాకు దిగారు. గత 17 రోజుల క్రితం అత్తాపూర్ గోల్డన్ ప్యాలెస్ హోటల్ దగ్గర శవమై తేలిన గులామ్ హుస్సేన్ ను ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు అని వారు ఆరోపించారు. విచక్షణారహితంగా కొట్టి చంపి శవాన్ని గోల్డన్ ప్యాలెస్ హోటల్ వెనుక పడేసారంటూ హుస్సేన్ ఫ్యామిలీ మెంబర్స్ ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. దానికి సంబంధించిన ఆధారాలు మా దగ్గర ఉన్నాయి.. పోలీసులు ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు అని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు.ఇప్పటి వరకు ఎందుకు దర్యాప్తు చేయలేదంటూ పోలీసులను నిలదీస్తూ పోలీస్ స్టేషన్ ముందు గులామ్ హుస్సేన్ కుటుంబ సభ్యులు బైటాయించారు. అత్తాపూర్ కల్లు కంపౌడ్ యాజమాన్యంపై పలు అనుమానాలను వ్యక్తం చేశారు. వాళ్లే గులామ్ హుస్సేన్ ను చంపి శవాన్ని గోల్డెన్ ప్యాలెస్ హోటల్ సమీపంలో పడేసారంటూ ఆరోపించారు. సీసీ టీవి కెమారాలో ఈ దృశ్యాలు రికార్డు అయినట్లు వారు పేర్కొన్నారు.
* అమ్మఒడి సొమ్ము కాజేసిన వాలంటీరు
అమ్మఒడి సొమ్ము తన బ్యాంక్ అకౌంట్ లో ఎందుకు జమకావడం లేదో ఆ తల్లికి అర్థం కాలేదు. వాలంటర్ దగ్గర ఈ విషయాన్ని ఆమె ప్రస్తవించింది. అయితే ఆమెకు రెండేళ్ల నుంచి వేరే బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు పడుతున్నాయని అతడు గుర్తించాడు. ఆ తల్లి వేలిముద్రలు తీసుకొని ఆమెకు తెలియకుండా డబ్బులు కాజేశాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది.తనకు జరిగిన అన్యాయంపై బాధితురాలు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ను ఆశ్రయించగా.. ఆలస్యంగా ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఆమె వెల్లడించిన వివరాల ప్రకారం.. కుప్పం మండలం చందం గ్రామంలో రామకృష్ణ-ప్రమీల దంపతులు నివసిస్తున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు. ఇందులో కూతురు భానుశ్రీ ఇంటర్ చదువుతోంది. ఓ కుమారుడు మహేంద్ర తొమ్మిదో తరగతి, మరో కుమారుడు రాహుల్ ఆరో తరగతి చదువుతున్నాడు.అయితే ఏపీ ప్రభుత్వం వీరికి అందరిలాగే అమ్మ ఒడి సొమ్ము అందజేస్తోంది. మొదటి రెండు సంవత్సరాల పాటు వీరికి సప్తగిరి గ్రామీణ బ్యాంకులో డబ్బులు పడ్డాయి. అయితే గతేడాది, ఈ ఏడాదికి సంబంధించిన డబ్బులు అందులో పడలేదు. ఈ రెండు సంవత్సరాలకు సంబంధించిన అమ్మఒడి సాయం వీరికి ఇండియన్ బ్యాంకులో ఉన్న మరో అకౌంట్ లో జమ అయ్యింది. ఈ విషయం ఆ కుటుంబానికి తెలియలేదు.ఆ కుటుంబ సభ్యులు ఎప్పటిలాగే గ్రామీణ బ్యాంక్ అకౌంట్ చెక్ చేసుకొని డబ్బులు పడటం లేదని ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో వారు ఇటీవల ఈ సమస్యను స్థానిక వాలంటీర్ సురేశ్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయనకు సమస్య అర్థం అయ్యింది. అమ్మఒడి సాయం వారి ఇండియన్ బ్యాంక్ అకౌంట్ లో జమ అవుతోందని గుర్తించాడు. డబ్బులు కచ్చితంగా వస్తాయని చెబుతూ ప్రమీలను వేలిముద్ర వేయాలని సూచించాడు. దీంతో ఆమె సురేశ్ చెప్పినట్టు చేసింది. తరువాత ఆమె అకౌంట్ లో ఏడాది రూ.10 వేల చొప్పున జమ అయిన.. రెండు సంవత్సరాలకు సంబంధించిన డబ్బులను మళ్లించుకున్నాడు. ఈ విషయం బాధిత కుటుంబం గుర్తించింది. ఈ విషయాన్ని చెప్పేందుకు బాధితురాలు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ దగ్గరికి వెళ్లారు.
* దిల్లీలో పట్టపగలే దుండగులు అత్యంత దారుణం
దేశ రాజధాని నగరం దిల్లీలో పట్టపగలే దుండగులు రెచ్చిపోయారు. ఆటోలో వెళుతున్న ఓ మహిళా టీచర్ నుంచి ఐఫోన్ ఎత్తుకెళ్లే ప్రయత్నంలో ఆమె పట్ల అత్యంత దారుణంగా ప్రవర్తించారు. యొవికా చౌధురి అనే మహిళ దక్షిణ దిల్లీలోని సాకేత్‌లో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. ఆగస్టు 11న ఆమె పాఠశాల నుంచి ఆటోలో ఇంటికి వెళుతుండగా.. రెండు ద్విచక్ర వాహనాలపై వచ్చిన ముగ్గురు దుండగులు ఆమె నుంచి ఐఫోన్ లాక్కెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ పెనుగులాటలో టీచర్ ఆటో నుంచి కిందపడిపోయారు. అయినా కనికరించని దుండగులు ఆమెను రోడ్డుపై అలాగే ఈడ్చుకెళ్లారు. పోరాడే ఓపిక లేక ఆమె చివరకు తన ఫోన్‌ను వదిలేయడంతో వారు అక్కడి నుంచి పరారయ్యారు. స్థానికులు ఉపాధ్యాయురాలిని ఆసుపత్రిలో చేర్పించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తుచేస్తున్నారు.
* ఒంటరిగా ఉంటున్న దళిత వివాహితపై గ్యాంగ్ రేప్
ఒంటరిగా ఉంటున్న దళిత మహిళపై పలువురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఏపీలోని అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. తనపై వైసీపీ నాయకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ దుశ్చర్యను వీడియో కూడా తీసి, పదే పదే లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని ఆమె ఆరోపించింది. బాధితురాలి ఫిర్యాదు, ‘ఈనాడు’ కథనం ప్రకారం.. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలంలోని ఓ గ్రామంలో ఓ దళిత మహిళ నివసిస్తోంది. ఆమెకు ఏడేళ్ల కిందట ఓ వ్యక్తితో వివాహం జరిగింది. అయితే అతడికి మానసిక ఆరోగ్యం సరిగా లేదని తెలియడంతో తన తల్లిగారింటికి వచ్చింది. ఆమె తల్లిదండ్రులు చనిపోయారు. దీంతో ఆమె ఆ ఇంట్లోనే ఒంటరిగా నివసిస్తోంది. కూలీ పనులు చేస్తూ జీవిస్తోంది. అయితే ఆ గ్రామంలో నివసించే ఐదుగురు వైసీపీ నాయకుల కన్ను ఆ ఒంటరి మహిళపై పడింది. ఏడాది కిందట ఒక రోజు వారు ఐదుగురు కలిసి ఆమెను గ్యాంగ్ రేప్ చేశారు. ఈ దుశ్చర్యను వారు తమ సెల్ ఫోన్ లలో వీడియో కూడా తీశారు. తరువాత ఆ వీడియోలను చూపిస్తూ, బ్లాక్ మెయిల్ చేస్తూ ఆమెపై పలు మార్లు లైంగిక దోపిడికి ఒడిగడుతున్నారు. కొంత కాలం తరువాత ఆ వీడియోలు దుండగులు ఆ గ్రామంలో నివసించే హరి అనే వ్యక్తికి షేర్ చేశారు. ఆ వీడియోను ఆధారంగా చేసుకొని అతడు కూడా ఆమెపై తన కామవాంఛ తీర్చుకోవాలని భావించాడు. లైంగిక వేధింపులకు గురి చేయసాగాడు.
* హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్ రైలులో దోపిడీ
నిర్జన ప్రదేశంలో రైలుని ఆపిన దోపిడీ దొంగలు.. ప్రయాణికుల దగ్గర నుంచి అందినకాడికి నగలను దోచుకున్నారు. అక్కడితో ఆగకుండా సిగ్నల్ ట్యాంపరింగ్ చేసి వెనక వచ్చే మరో రైలులో దోపిడీకి యత్నించారు. ఆ రైలులో ఉన్న పోలీసులు అప్రమత్తం కావడంతో పారిపోయారు. ప్రయాణికులను హడలెత్తించిన ఈ ఘటనలు శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని తెట్టు రైల్వే స్టేషన్ సమీపంలో చోటు చేసుకున్నాయి. రైల్వే పోలీసుల కథనం మేరకు.. సికింద్రాబాద్ నుంచి బయలుదేరిన హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్ ఆదివారం అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో తెట్టు రైల్వేస్టేషన్ సమీపంలో ప్రయాణిస్తోంది. ఈ సమయంలో రైలులోనే ఉన్న ఆరుగురు గుర్తుతెలియని వ్యక్తులు చైన్ లాగడంతో బండి నిలిచిపోయింది. వెంటనే వారు రైలు దిగి కిటికీల పక్కన నిద్రపోతున్న అయిదుగురి నుంచి బంగారు గొలుసులు లాక్కున్నారు. అంతటితో ఆగకుండా సిగ్నల్ ట్యాంపరింగ్ చేసి వెనుకే వస్తున్న చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌ను ఆపారు. ఆ రైలులోని పోలీసులు అప్రమత్తమై లైట్లు వేయడంతో పరారయ్యారు. తన 20 గ్రాముల చైన్‌ను చోరీ చేశారని బాధితుల్లో ఒకరైన నరేంద్రరెడ్డి అనే ప్రయాణికుడు కావలిలో ఫిర్యాదు చేశారు. మొత్తం 30 సవర్ల వరకు నగలు చోరీ అయినట్లు పోలీసులు అంచనాకొచ్చారు.
* నాలుగు కార్లను ఢీకొన్న ట్రక్కు
రోడ్డు ప్రమాదానికి సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లనో, మరో కారణంచేతనో ప్రమాదాలు జరుగుతుంటాయి. కొన్నిసార్లు ప్రాణనష్టం కూడా జరుగుతుంటుంది. తాజాగా ఓ యాక్సిడెంట్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతూ నెటిజన్లను ఆందోళనకు గురి చేస్తోంది. ఇందులో రద్దీగా ఉండే రహదారిపై వేగంగా వచ్చిన ట్రక్కు నాలుగు వాహనాలను ఒక్కసారిగా ఢీకొట్టింది. నాలుగు కార్లూ నుజ్జు నుజ్జు అయిపోయాయి. ఈ దృశ్యాలు మొత్తం అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ వీడియోలో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనాలు నెమ్మదిగా వెళ్తున్నట్లు తెలుస్తోంది. అంతలోనే వెనుక నుంచి అదుపుతప్పి వేగంగా దూసుకు వస్తున్న ట్రక్కు ఎదురుగా ఉన్న నాలుగు వాహనాలను బలంగా ఢీకొట్టింది. దాంతో వాహనాలన్నీ బొమ్మల్లా ముక్కలైపోయాయి. అనంతరం ఎదురుగా వెళ్తున్న మరో లారీని ఢీకొట్టింది. ఈ ఘటనను చూసిన జనం షాక్‌తో వణికిపోయారు. ఈ భయానక వీడియో చూసిన ప్రతి ఒక్కరూ షాక్ అవుతున్నారు. భిన్నరకాలుగా స్పందిస్తున్నారు.