DailyDose

TNI నేటి తాజా వార్తలు.భారత పౌరసత్వాన్ని పొందిన హీరో అక్షయ్ కుమార్ . తదితర విశేషాలు.

TNI నేటి తాజా వార్తలు.భారత పౌరసత్వాన్ని పొందిన హీరో అక్షయ్ కుమార్ . తదితర విశేషాలు.

* కాంగ్రెస్ చేవెళ్ల సభ వాయిదా

తెలంగాణ కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా చేవెళ్లలో నిర్వహించనున్న సభ వాయిదా పడింది.ముందుగా చేవెళ్ల సభ ఈనెల 18వ తేదీన జరగాల్సి ఉండగా వాయిదా వేస్తున్నట్లు పార్టీ నేతలు తెలిపారు.ఈ మేరకు చేవెళ్ల భారీ బహిరంగ సభను ఈనెల 24వ తేదీకి వాయిదా వేసినట్లు పార్టీ నేతలు వెల్లడించారు.సమయం తక్కువగా ఉందన్న పార్టీ శ్రేణుల అభిప్రాయంతో ఏకీభవించిన నాయకత్వం ఈనెల 24 కు సభను నిర్వహించాలని ప్రకటించిందని సమాచారం.కాగా ఈ సభకు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గేతో పాటు ఇతర కాంగ్రెస్ ముఖ్య నేతలు హాజరుకానున్నారు.అనంతరం సభా వేదికపై నుంచి ఎస్సీ డిక్లరేషన్ ను తెలంగాణ కాంగ్రెస్ ప్రకటించనుందన్న సంగతి తెలిసిందే.

ఎర్ర‌కోట వేడుక‌కు హాజ‌రుకాని మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే

 77వ స్వాతంత్య్ర దినోత్స‌వం సంద‌ర్భంగా ఇవాళ ఎర్ర‌కోట‌పై జెండా ఎగుర‌వేసిన త‌ర్వాత ప్ర‌ధాని మోదీ దేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్య‌క్ర‌మాన్ని అతిథులు అంద‌రూ వ‌చ్చారు. అయితే కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే(Mallikarjun Kharge) హాజ‌రుకాలేదు. ఆయ‌న కుర్చీ ఖాళీగా క‌నిపించింది. కానీ ఖ‌ర్గే త‌న ట్విట్ట‌ర్‌లో గ‌ట్టి సందేశాన్ని ఇచ్చారు. ఓ వీడియో మెసేజ్ చేసిన ఖ‌ర్గే.. గ‌త ప్ర‌ధానులు దేశాన్ని తీర్చిదిద్ద‌న వైనాన్ని వెల్ల‌డించారు. ఆరోగ్యం స‌రిగా లేని కార‌ణంగా స్వాతంత్య్ర వేడుక‌ల‌కు హాజ‌రుకాలేద‌ని చెప్పిన ఖ‌ర్గే.. త‌న మెసేజ్‌లో గాంధీ, నెహ్రూ, వ‌ల్ల‌భాయ్ ప‌టేల్‌, నేతాజీ, మౌలానా ఆజాద్‌, రాజేంద్ర ప్ర‌సాద్‌, స‌రోజిని నాయుడు, అంబేద్క‌ర్‌కు నివాళి అర్పించారు.భార‌త దేశ తొలి ప్ర‌ధాని నెహ్రూతో పాటు ఇందిరా గాంధీ, లాల్ బ‌హ‌దూర్ శాస్త్రి, రాజీవ్ గాంధీ, న‌ర్సింహారావు, మ‌న్మోహ‌న్ సింగ్‌, అత‌ల్ బిహారీ వాజ్‌పేయి దేశానికి చేసిన మేలు గురించి వివ‌రించారు. ప్ర‌తి ప్ర‌ధాని దేశ ప్ర‌గ‌తి కోసం ఎంతో కొంత స‌హ‌క‌రించార‌ని, కానీ ఈ రోజుల్లో కొంద‌రు మాత్రం గ‌త కొన్నేళ్ల‌లోనే దేశం ప్రగ‌తి సాధించిన‌ట్లు చెబుతున్నారని ఆరోపించారు.

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో అల్లు అర్జున్

స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా మువ్వన్నెల జెండా రెపరెపలాడుతోంది. ఈ సందర్భంగా సినీ తారాలు సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెబుతున్నారు. చిరంజీవి, ఎన్టీఆర్‌, మహేశ్‌ బాబు.. ఇలా అగ్ర హీరోలంతా ట్వీట్‌లతో సందడి చేస్తున్నారు. మరోవైపు మరికొందరు హీరోలు వారి రానున్న చిత్రాల పోస్టర్లను విడుదల చేసి విషెస్‌ తెలియజేశారు.

  • అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు – చిరంజీవి (Chiranjeevi)
  •  ఐక్య భారత స్ఫూర్తికి సంబరాలు చేసుకునే సమయమిది. అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాంకాంక్షలు – మహేశ్‌ బాబు (Mahesh babu)

గద్దర్‌ కుటుంబ సభ్యులకు చంద్రబాబు పరామర్శ

ఇటీవల కన్నుమూసిన ప్రజా యుద్ధనౌక గద్దర్‌ కుటుంబ సభ్యులను పరామర్శించారు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. అల్వాల్‌లోని భూదేవి నగర్‌లో ఉన్న గద్దర్‌ నివాసానికి వెళ్లిన ఆయన.. కుటుంబ సభ్యులను ఓదార్చారు. ప్రజా ఉద్యమాలకు పాటతో ఊపిరి పోసిన గద్దర్ మృతితో..ప్రశ్నించే స్వరం మూగబోయిందని చంద్రబాబు ఇటీవలే ట్వీట్ చేశారు. పౌర హక్కుల ఉద్యమాల్లో గద్దర్ పాత్ర మరువ లేనిదని అన్నారు.

*  అనాథ బాలికకు  అండగా నిలిచిన కేటీఆర్

అమ్మానాన్నలేని ఆ చిన్నారిని అన్నగా నిలబడి అక్కున చేర్చుకున్నారు. విద్యే నీకు నలుగురిలో గుర్తింపు తీసుకువస్తుందని ఉన్నత విద్యకు సాయపడ్డారు.. ఇప్పుడు ఆ చిన్నారి పెరిగి పెద్దదై ఉద్యోగం చేస్తూ తన కాళ్ల మీద తాను నిలబడుతోంది. అన్నగా నిలబడిన కేటీఆర్ కు ఉద్యోగం చేస్తూ సంపాదించిన దాంట్లో కొంత మిగిల్చి లక్షరూపాయలు పోగు చేసి సీఎం సహాయనిధికి అందజేసింది. జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం తండ్రియాల్ గ్రామానికి చెందిన రుద్ర రచన చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయింది. తెలంగాణ మంత్రి కేటీఆర్ రచనకు అన్నీ తానై అండగా నిలబడ్డారు. రచన ఆయన నమ్మకాన్ని వమ్ము చేయలేదు. హాప్టల్ లో ఉంటూ బీటెక్ పూర్తి చేసింది. ఇటీవలే ఉద్యోగాన్ని సంపాదించింది. తనలాంటి అనాధలను ఆదుకోవాలని సీఎం సహాయనిధికి లక్షరూపాయల విరాళాన్ని అందించింది. మంత్రి కేటీఆర్ చేసిన సాయం మరువలేనంటూ ట్వీట్ చేసింది. రచన ఆలోచన ఎందరికో స్ఫూర్తి దాయకం అంటూ కేటీఆర్ రీ ట్వీట్ చేశారు. నీ ట్వీట్ చూసి నా మనసు ఆనందంతో నిండిపోయింది. ఎంత మంచి ఆలోచన చేశావు తల్లీ అని భావోద్వేగం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చదువు కోసం సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఆర్ధిక సాయాన్ని అందుకుంటున్న రచన ఫోటోను, బీటెక్ పూర్తయిన అనంతరం ఆమె తనకు రాఖీ కడుతున్న చిత్రాన్ని, ముఖ్యమంత్రి సహాయ నిధికి రచన అందజేసిన నగదు అధికారిక ధ్రువపత్రాన్నికేటీఆర్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

సుప్రీంకోర్టుపై ప్రధాని ప్రశంసలు

ప్రధాని మోదీ వ్యాఖ్యలకు స్వయంగా భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ రెండు చేతులతో నమస్కరించిన అరుదైన దృశ్యం స్వాతంత్య్ర దిన వేడుకల సందర్భంగా చోటు చేసుకుంది. ఎర్రకోట నుంచి ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ప్రాంతీయ భాషల ప్రాధాన్యాన్ని ప్రస్తావించారు. స్థానిక భాషల్లోనే తీర్పులను ఇవ్వాలంటూ సుప్రీంకోర్టు ఇటీవల తీసుకున్న నిర్ణయాన్ని ప్రధాని ఈ సందర్భంగా ప్రస్తావించారు. మాతృభాషల ప్రాధాన్యం పెరుగుతున్నట్టు చెప్పారు.సుప్రీంకోర్టుకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తీర్పులోని ముఖ్య భాగం అంతా కూడా మాతృభాషలోనే ఉంటుందని సుప్రీంకోర్టు తెలిపింది. మాతృభాషల ప్రాధాన్యాన్ని సుప్రీంకోర్టు పెంచుతుంది’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. భారత స్వాతంత్య్ర వేడుకలకు హాజరైన అతిథుల్లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ కూడా ఉన్నారు. ప్రధాని సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు చెప్పడంతో.. జస్టిస్ చంద్రచూడ్ సైతం రెండు చేతులను పైకి ఎత్తి ప్రతి నమస్కారం చేశారు. అక్కడున్న వారంతా ప్రధాని ప్రసంగానికి చప్పట్లతో హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. కోర్టులు స్థానిక భాషల్లోనే తీర్పులు జారీ చేయాలంటూ చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ తరచూ చెబుతుంటారు. ఈ ఏడాది జనవరిలో సుప్రీంకోర్టు తీర్పు ఒక దానిని హిందీ, తమిళం, గుజరాతీ, ఒడియా భాషల్లోకి అనువదించారు. తీర్పులను అనువాదం చేయడం వల్ల ప్రజలు వాటిని అర్థం చేసుకోగలరన్నది చీఫ్ జస్టిస్ అభిప్రాయంగా ఉంది. న్యాయ పరమైన పదాలతో కూడిన ఇంగ్లిష్ భాషను 99.9 శాతం ప్రజలు అర్థం చేసుకోలేరని ఆ సందర్భంగా చీఫ్ జస్టిస్ పేర్కొనడం గమనార్హం. అందుకే తీర్పులను ప్రాంతీయ భాషల్లో అనువదించాలని నిర్ణయించినట్టు చెప్పారు. 

*  ఆరోగ్యశ్రీ ట్రస్టు చైర్మన్‌గా  ఎన్‌. సుధాకర్‌రావు

ఆరోగ్యశ్రీ ట్రస్ట్ చైర్మన్ గా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ రావును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ట్రస్ట్ ఏర్పాటైనప్పటి నుంచి సీఎం కేసీఆర్ చైర్మన్ గా ఉండగా… తాజాగా సుధాకర్ రావుకు బాధ్యతలు అప్పగించారు.ఈయన గాంధీ మెడికల్ కాలేజీలో ఏండోక్రైనాలజీ విభాగం హెడ్ గా పని చేశారు. 1999 నుంచి 2003 వరకు పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యేగా కొనసాగారు. కాగా, స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా TSRTC ప్రత్యేక రాయితీలు ప్రకటించింది. ఇవాళ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పల్లె వెలుగు సర్వీసుల్లో సీనియర్ సిటిజన్లకు టికెట్ లో 50% రాయితీ ఇవ్వనున్నట్లు తెలిపింది. హైదరాబాద్ లో ఒకరోజు అపరిమిత ప్రయాణ పాస్ టి-24 టికెట్ ను…ఇవాళ పెద్దలకు కేవలం రూ. 75కు, పిల్లలకు రూ. 50 కే అందించనున్నట్లు ప్రకటించింది. ఈ రోజు మాత్రమే ఈ రాయితీలు వర్తిస్తాయని TSRTC పేర్కొంది.

భారత పౌరసత్వాన్ని పొందిన హీరో అక్షయ్ కుమార్

చాలా కాలంగా బాలీవుడ్ స్టార్ హీరోను వెంటాడుతున్న సమస్య.. అతను కెనడియన్ గా కొనసాగడం. అక్షయ్ కుమార్  కెనడియన్.  ఆ సిటిజన్ షిప్ కోరిమరీ తెచ్చుకున్నాడు. ఆయనకు అక్కడి దేశ పౌరసత్వం ఉంది.. కాని ఇండియన్ సిటిజన్ గా మాత్రం పరిగణించలేదు . దాంతో తాజాగా అక్షయ్ కుమార్ తన  పాస్‌పోర్ట్‌ను వదులుకున్నాడు మరియు ఎట్టకేలకు తన భారత పౌరసత్వాన్ని తిరిగి పొందాడు. ఈ విషయాన్ని అక్షయ్ కుమార్ స్వంగా ప్రకటించాడు. భారత 77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆయన ఇదే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. ట్విట్టర్‌లో అక్షయ్ ఇలా రాశాడు, “దిల్ ఔర్ పౌరసత్వం, దోనో హిందుస్తానీ. స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు జై హింద్ అంట రాసుకోచ్చాడు. కెనడా పౌరసత్వం వల్ల ఇండియాలో చాలా విమర్షలు ఎదుర్కొన్నాడు అక్షయ్ కుమార్. గతంలో ఆయనపై చాలా విమర్షలు వచ్చాయి. దాంతో ఆయన కెనడియన్ పౌరసత్వాన్ని వదులుకున్నాడు. ఇండియన్ పాస్ పోర్ట్ కోసం కొంత కాలం క్రితం ధరఖాస్తు చేసుకున్నారు. అంతే కాదు గతంలో తాను ఎందుకు కెనడియన్ పౌరసత్వం తీసుకోవలసి వచ్చిదో కూడా ఓ సారి ఇంటర్వ్యూల్ వివరించాడు అక్షయ్. 90స్ లో తన కెరీర్ ధారుణంగా ఉన్న టైమ్ లో .. తనస్నేహితుడి సలహా మేరకు అక్కడికి వెళ్లాలి అనుకున్నాడట అక్షయ్. దానికోసమే అతను కెనడియన్ గా మారిపోయాడు. ఎట్టకేలకు ఆ పాస్ పోర్ట్ వదులుకుని హాట్ న్యూస్ అవుతున్నాడు. అక్షయ్ కుమార్ ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ సీనియర్ హీరోగా కొనసాగుతున్నాడు. బాలీవుడ్ నుంచి 100 కోట్ల  రెమ్యూనరేషన్ హీరోగా ఘనత సాధించాడు. అంతే కాదు ఆదానీలను.. అంబానిలను మించి.. ఏడాదికి 26 కోట్లకు పైగా ప్రభుత్వానికి టాక్స్ లు చెల్లించి వార్తల్లో నిలిచాడు అక్షయ్ కుమార్. ప్రస్తుతం వరుస సిమాలు సెట్స్ ఎక్కిస్తూ.. ప్రయోగాత్మక సినిమాలు చేస్తూ.. గెలుపోటములు లెక్క చేయకుండా.. దూసుకుపోతున్నాడు అక్షయ్ కుమార్. 

* మచిలీపట్నం పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో ఆవిష్కరించిన రోజా

ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి ఆర్కే రోజా( RK Roja )జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి సాయుధ దళాల నుండి గౌరవ వందనం స్వీకరించిన మంత్రి రోజాప్రత్యేక వాహనం ద్వారా పెరేడ్ ను పరిశీలించిన మంత్రి రోజాఅనంతరం రాష్ట్ర ప్రభుత్వం తరఫున కృష్ణ జిల్లా ప్రజలను ఉద్దేశించి స్వాతంత్ర దినోత్సవ( Independence Day ) సందేశం అందించిన ఇన్చార్జ్ మంత్రివర్యులు రోజా గారు.కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ రాజా బాబు( Raja Babu ) గారు, జిల్లా జాయింట్ కలెక్టర్ అపిరాజత సింగ్, జిల్లా సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ జాషువా గారు, జిల్లా జడ్పీ చైర్మన్ ఉప్పల హారిక జిల్లా ప్రజలు స్కూల్ పిల్లరు.

మోదీ దేశ ప్రజలనుద్దేశించి 90 నిమిషాల పాటు ఏకధాటిగా ప్రసంగం

స్వాతంత్ర్య దినోత్సవం (Independence Day) సందర్భంగా చారిత్రక ఎర్రకోట (Red Fort) నుంచి వరుసగా పదేళ్లు మువ్వన్నెల జెండాను ఆవిష్కరించిన తొలి కాంగ్రెస్సేతర ప్రధానిగా నరేంద్రమోదీ (PM Modi) నిలిచారు. మంగళవారం ఉదయం ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం ప్రధాని మోదీ జాతినుద్దేశించి సుదీర్ఘ ప్రసంగం చేశారు. 90 నిమిషాల పాటు ఏకధాటిగా మాట్లాడిన ఆయన.. పంద్రాగస్టు ప్రసంగంలో సరికొత్త రికార్డు సృష్టించారు. ఇప్పటివరకు 10 సార్లు మోదీ ప్రసంగించగా.. సగటు సమయం 82 నిమిషాలుగా ఉంది. దేశ చరిత్రలో ఇతర ప్రధానులు మాట్లాడిన సగటు ప్రసంగ సమయం కంటే ఇది ఎక్కువ కావడం విశేషం.2014లో ప్రధానమంత్రిగా ఎర్రకోట నుంచి మోదీ తొలి ప్రసంగం చేసిన విషయం తెలిసిందే. ఆ ఏడాది 65 నిమిషాల పాటు ఆయన మాట్లాడారు. ఆ తర్వాత వరుసగా 86 నిమిషాలు (2015), 96 నిమిషాలు (2016), 56 నిమిషాలు (2017), 83 నిమిషాలు (2018), 92 నిమిషాలు (2019), 90 నిమిషాలు (2020), 88 నిమిషాలు (2021), 74 నిమిషాలు (2022) ప్రసంగించారు. ఈ ఏడాది కూడా 90 నిమిషాల పాటు సుదీర్ఘ ప్రసంగం చేశారు. మొత్తంగా ప్రధాని సగటు ప్రసంగం నిడివి 82 నిమిషాలు కాగా.. ఇప్పటివరకు ఏ ప్రధాని సగటుగా ఇంత సమయం ప్రసంగించలేదు.ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. 1947లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ మొట్టమొదటి ప్రసంగం చేశారు. 24 నిమిషాల పాటు ఆయన మాట్లాడారు. ప్రధానిగా ఇప్పటివరకు అత్యధిక పంద్రాగస్టు ప్రసంగాలు చేసింది కూడా నెహ్రూనే. మొత్తంగా 17 సార్లు ఆయన స్వాత్రంత్య దినోత్సవం నాడు జాతినుద్దేశించి ప్రసంగించారు. ఆ తర్వాత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 16 సార్లు పంద్రాగస్టు నాడు మాట్లాడారు. 1972లో సుదీర్ఘంగా 54 నిమిషాలు ప్రసంగించారు.ఇక, మాజీ ప్రధాని ఐకే గుజ్రాల్‌ కేవలం ఒకే ఒక్కసారి ఎర్రకోట నుంచి ప్రసంగించారు. 1997లో ఆయన 71 నిమిషాల పాటు మాట్లాడారు. ప్రధాని మోదీ తర్వాత రెండో అత్యధిక సగటు ప్రసంగ సమయం ఈయనదే. మాజీ ప్రధానులు మన్మోహన్‌ సింగ్‌, అటల్‌ బిహరీ వాజ్‌పేయీ స్వల్ప ప్రసంగాలు చేశారు. 2012లో మన్మోహన్‌ సింగ్‌ 32 నిమిషాలు, 2013లో 35 నిమిషాలు మాట్లాడారు. వాజ్‌పేయీ 2002లో 25 నిమిషాలు, 2003లో 30 నిమిషాల పాటు ప్రసంగించారు.

ప్రధాని ప్రసంగంపై మండిపడ్డ ఖర్గే

77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోటపై ప్రధాని మోదీ  చేసిన ప్రసంగంపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే  తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘వచ్చే ఏడాది ఎర్రకోట వద్ద కలుద్దాం’ అన్న మోదీ వ్యాఖ్యలపై ఖర్గే స్పందిస్తూ.. ప్రధాని వ్యాఖ్యలు ఆయన అహంకారాన్ని చూపిస్తున్నాయని అన్నారు. వచ్చే ఏడాది ఎర్రకోటపై కాకుండా.. మోదీ తన ఇంటి వద్ద జెండా ఎగురవేస్తారని వ్యాఖ్యానించారు.స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నేడు ప్రధాని మోదీ ఎర్రకోట (Red Fort )పై జెండా ఎగురవేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రధాని ప్రసంగిస్తూ.. వచ్చే ఏడాది మళ్లీ ఆగస్టు 15న వస్తానని, ఎర్రకోటపై జెండా ఎగురవేస్తానంటూ వ్యాఖ్యానించారు. ప్రధాని వ్యాఖ్యలపై ఖర్గే స్పందిస్తూ.. ‘ఆయన (ప్రధాని మోదీ) వచ్చే ఏడాది జెండా ఎగురవేస్తారు. కానీ, అది ఆయన ఇంటిపైనే. జయాపజయాలు నిర్ణయించేది ప్రజలు. అది ఓటర్ల చేతుల్లో ఉంది. 2024లో మరోసారి జెండా ఎగురవేస్తానని 2023లోనే చెప్పడం మోదీ అహంకారాన్ని చూపిస్తోంది’ అని ఖర్గే వ్యాఖ్యానించారు. మరోవైపు ఎర్రకోటలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు హాజరుకాలేకపోవడానికి గల కారణాలను ఖర్గే వివరించారు. తనకు కంటి సంబంధిత సమస్యలు ఉన్నాయని అందువల్లనే ప్రధాని ప్రసంగానికి హాజరు కాలేకపోయానని తెలిపారు. ‘మొదట నాకు కంటి సంబంధిత సమస్యలు ఉన్నాయి. రెండోది, ప్రోటోకాల్‌ ప్రకారం ఉదయం 9.20 గంటలకు నా నివాసంలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశాను. అనంతరం కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయానికి వచ్చి జెండాను ఎగురవేశాను. దానికి తోడు భద్రత చాలా పటిష్టంగా ఉంది. భద్రతా దళాలు ప్రధానిని తప్ప ఎవరినీ ముందుకు వెళ్లనీయడం లేదు. దీంతో సమయానికి ఎర్రకోట వద్దకు రాలేనని అనుకున్నా. అందుకే భద్రతా కారణాలు, సమయభావం కారణంగా అక్కడికి వెళ్లకపోవడమే మంచిదని భావించా’ అని ఖర్గే వివరించారు.