ఈ ఏడాది చివర్లో ఐదు రాష్ట్రాల అసెంబ్లీకి, వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికలపై బీజేపీ పెద్దలు దృష్టి సారించారు. ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల్లో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ కాబోతున్నది. ఢిల్లీలో పార్టీ ప్రధాన కార్యాలయంలో జరగబోయే ఈ భేటీకి ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యులు హాజరు కానున్నారు. అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల వ్యూహాలకు సంబంధించి ఈ భేటీలో చర్చించనున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయం చవిచూసింది.
ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో ప్రత్యర్థులకు ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వకూడదనే ఉద్దేశంతో పకడ్బందీగా వ్యవహరించాలని కసరత్తు చేస్తోంది. ముఖ్యంగా ఈ ఏడాదిలో తెలంగాణతో పాటు మిజోరం, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాలు ప్రతిపక్షాల పాలిత రాష్ట్రాలు కావడంతో ఇక్కడ విజయం కోసం బీజేపీ గట్టి ప్రయత్నాలు చేస్తోంది.అలాగే ఈ నెల లోక్‌సభలో జరిగిన అవిశ్వాస తీర్మానం సందర్భంగా మిజోరంలో అధికార పార్టీ ఎంఎన్ఎఫ్ మిత్రపక్షమైన బీజేపీకి వ్యతిరేకంగా నిలబడింది. దీంతో ఇక్కడ కూటమిలో విభేదాలను ఈ పరిణామం ఎత్తిచూపినట్లైంది. అలాగే ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్‌లో కూడా హోరాహోరీ పోరు సాగుతున్నట్లు కనిపిస్తోంది. మరోవైపు జాతీయ స్థాయిలో ప్రతిపక్షాలు ఇండియా కూటమి పేరుతో బలోపేతం కావాలని ప్రయత్నాలు చేస్తున్న వేళ బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.