Politics

జగన్‌కు చంద్రబాబు సవాల్‌

జగన్‌కు చంద్రబాబు సవాల్‌

మాట్లాడితే నన్ను తిట్టడం కాదు.. దమ్ముంటే ఇక్కడకు వస్తే వాస్తవాలు తెలుస్తాయి. ప్రతి గడపకూ కలిసి తిరుగుదాం’ అని సీఎం జగన్‌కు తెదేపా అధినేత చంద్రబాబు సవాల్‌ విసిరారు. ఏడిద గ్రామంలో 250 మంది చేనేత కుటుంబాలుంటే కేవలం 35 మందికే రూ.24 వేలు అందించారని స్థానికులు చెబుతున్నారని తెలిపారు. డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా మండపేట మండలంలో బుధవారం నిర్వహించిన రోడ్‌షో, రైతులతో రచ్చబండ, బహిరంగ సభల్లో ఆయన మాట్లాడారు. చేనేత కార్మికుల కోసం దసరాలోగా ప్రత్యేక పాలసీ రూపొందిస్తామని వెల్లడించారు. లాక్‌డౌన్‌ సమయంలోనూ రైతులు వ్యవసాయం చేసి అందరికీ అన్నంపెట్టారు. అన్నదాత కూడా లాక్‌డౌన్‌ ప్రకటిస్తే దేశం ఏమయ్యేదో ఊహిస్తే భయమేస్తోందని అన్నారు. అసమర్థ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉండడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతును రాజుగా చేస్తామన్నారు. ఆయనకు కోనసీమ జిల్లాలో అపూర్వ ఆదరణ లభించింది. కడియం మండల పరిధిలో రోడ్‌షో నిర్వహించారు. మండపేట మండలం ఏడిదలో రైతు రచ్చబండ కార్యక్రమం, రోడ్‌షోలో పాల్గొన్నారు.

కాటన్‌ను గుండెల్లో పెట్టుకున్నాం..ధవళేశ్వరం బ్యారేజీ కట్టిన కాటన్‌ దొర విగ్రహాలు గోదావరి జిల్లాల్లోని ప్రతి గ్రామంలో ఉంటాయి. నిజానికి ఆ కాలంలోనే శ్రీరామపాద సాగర్‌ పేరుతో పోలవరం ప్రాజెక్టు నిర్మించాలని వారు అనుకున్నా కుదర్లేదు. నేను 70 శాతానికి పైగా పనులు పూర్తిచేసినా ఈ సైకో ముఖ్యమంత్రి, నేను కట్టాననే కోపంతో రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో పనులు అడ్డుకోవడంతో పోలవరం బలైపోయిందని విమర్శించారు.

శివారుకు నీరందక అగచాట్లు..శివారు భూములకు నీళ్లొస్తున్నాయా అని చంద్రబాబు ప్రశ్నించగా.. లేదంటూ ప్రజలు బదులిచ్చారు. ‘నాలుగేళ్లుగా కాలువలు నిర్వహించకుండా గాలికొదిలేశారని, తెదేపా హయాంలో సాగు నీటి ప్రాజెక్టులు తెచ్చి మూడంచెల విధానంలో రైతులకే నిర్వహణ బాధ్యత అప్పగించామని తెలిపారు. నీటి తీరువా డబ్బులు రైతులే వినియోగించుకోవడం వంటివి అమలు చేశామని గుర్తు చేశారు.

ప్రజలు నిలదీస్తారనే భయంతో..
జగన్‌ అసమర్థ పాలన రైతులకు శాపంగా మారిందని ఆరోపించారు. తాను తెచ్చిన పురుషోత్తపట్నం ఎత్తిపోతల ద్వారా నీటిని ఏలేరుకు మళ్లించకుండా ఎండగట్టారని అన్నారు. చాగల్నాడు, పుష్కర ఎత్తిపోతల పథకాల నిర్వహణను వదిలేశారని తెలిపారు. పోలవరం కుడి ప్రధాన కాలువకు అనుసంధానం చేస్తూ పట్టిసీమ నిర్మించి, కృష్ణా డెల్టాకు తీసుకెళ్లి అక్కడి నుంచి శ్రీశైలం ద్వారా రాయలసీమకు నీరందిస్తే.. దాన్ని మూలనపెట్టారని.. చివరికి ప్రజలు నిలదీస్తారనే భయంతో పట్టిసీమలో అరకొర పంపులు ఆన్‌ చేశారని’ చంద్రబాబు పేర్కొన్నారు. వైకాపా ప్రభుత్వంలో ఎనిమిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచారని.. తెదేపా అధికారంలోకి వచ్చాక కరెంటు ఛార్జీలు పెంచనని.. అవసరమైతే తగ్గిస్తానని హామీ ఇచ్చారు. విద్యుత్తు కోతలు లేకుండా 24 గంటలు అందిస్తానన్నారు. విభజన కంటే వైకాపా వల్లే రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరిగిందన్నారు. రూ.10 లక్షల కోట్లు అప్పు తెచ్చి జగన్‌ ఏంచేశారని ప్రశ్నించారు.

ఆర్బీకే ఓ దరిద్రమైన వ్యవస్థ..
‘దేశంలో తలసరి అప్పు రూ.74 వేలు ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో రూ. 2.45 లక్షలు. దీనికి కారణం కారణం జగన్‌ కాదా అని ప్రశ్నించారు. కనీస మద్దతు ధర రూ.1,535 మీకిచ్చారా అని అడగ్గా లేదని రైతుల నుంచి సమాధానం వచ్చింది. 70 ఏళ్ల నుంచి ఉన్న వ్యవస్థను మెరుగుపరచాలి కానీ, ఆర్బీకేలాంటి దరిద్రమైన వ్యవస్థ తీసుకొచ్చి రైతులకు శాపంగా మార్చారన్నారు. ఆక్వా రైతులను కూడా జగన్‌ మోసం చేశాడని ఆరోపించారు. గతంలో యూనిట్‌ విద్యుత్తు తాను రూ. 2కు ఇస్తే ఈయన రూ. 1.50కే ఇస్తానని ప్రకటించి ఇప్పుడు ఆక్వా జోన్లకే పరిమితమని మాయ చేస్తున్నాడన్నారు. వ్యవసాయ, ఉద్యాన, వాణిజ్య, ఆక్వా రైతులకు రాయితీలు, బీమా సదుపాయం కల్పిస్తామని హామీ ఇచ్చారు. తెదేపా అధికారంలోకి రాగానే రోడ్లు బాగుచేస్తామన్నారు.

రైతు రచ్చబండలో పలువురు తమ ఆవేదనను చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు..
ఆత్మహత్యే శరణ్యం.. తన భర్తకు రెండు చేతులూ విరిగిపోయి, ఇంటి అద్దె చెల్లించలేని స్థితిలో ఉన్నామని ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. అప్పు చేసి అమ్మాయికి పెళ్లి చేశామని, రూ.10 లక్షల అప్పులున్నాయి ఉన్నాయని, ఇల్లు ఇస్తామని ఇవ్వలేదని వాపోయారు. కొంపలున్నవారికే అదీ దేవుడి మాన్యంలో ఇచ్చారని, తనకు ఇల్లు ఇవ్వకపోతే ఆత్మహత్యే శరణ్యమని వాపోయారు. మీకు ఇల్లు కట్టించే బాధ్యత తనదని చంద్రబాబు ఆమెకు భరోసా ఇచ్చారు.

వ్యవసాయం వద్దని బిడ్డలకు చెబుతున్నాం..: వ్యవసాయం జోలికి రావద్దని తమ బిడ్డలకు చెప్పాల్సిన దుస్థితి నెలకొందని అర్తమూరుకు చెందిన రైతు కొవ్వూరి శ్రీనివాసరెడ్డి వాపోయారు. 20-30 శాతం కుర్రాళ్లకు తమ పొలం ఎక్కడుందో కూడా తెలియదన్నారు. దీనిపై చంద్రబాబు మాట్లాడుతూ రైతుకు ఏడాదికి రూ.20 వేలు సాయం చేస్తామన్నారు.

మాట్లాడితే తనకు పేపర్‌, టీవీ లేవంటాడు ఈ సీఎం. మరి సాక్షి పేపర్‌, టీవీ ఎవరివి? తండ్రి బొమ్మ వేసుకుని తనకు పత్రిక లేదంటూ మాయ మాటలు చెబుతుంటాడు. అవి నమ్మితే ఏమవుతుందో తెలిసింది కదా! ఇక్కడ బటన్‌ నొక్కుతాడు. సాక్షి పత్రికకు ఫుల్‌ పేజీ యాడ్‌ ఇస్తాడు. డబుల్‌ ఇన్‌కంతో రూ.కోట్లు కాజేయాలి. ఈ సైకో.. ఒక ఎంపీనీ పోలీసు కొడుతుంటే ఆ వీడియోలు చూసి సంబరపడతాడు. రేపు గానీ ఈయన మళ్లీ సీఎం అయితే ఏం ఉండదు. ధాన్యం రైతులకు కన్నాలు లేని గోతాలు ఇవ్వలేని ఈ అసమర్థ ముఖ్యమంత్రి మూడు రాజధానులు కడతాడట’