NRI-NRT

అమెరికాలో చిన్నారి పుస్తకాల సంచిలో తుపాకీ

అమెరికాలో చిన్నారి పుస్తకాల సంచిలో తుపాకీ

అమెరికాలో (America)  ఓ మూడేళ్ల పాప పుస్తకాల సంచిలో గన్‌ (Gun) కనిపించింది. దాంతో తరగతిలో పాఠాలు బోధిస్తున్న టీచర్‌ షాక్‌కు గురైంది. వివరాల్లోకి వెళితే.. శాన్‌ ఆంటోనియోకు చెందిన పీట్‌ రోబుల్స్‌కు మూడేళ్ల కుమార్తె ఉంది. ఆమెను ప్రీ-కే 4ఎస్‌ఏ సెంటర్‌లో చదివిస్తున్నాడు. రోజూలాగే ఆ చిన్నారి మంగళవారం పాఠశాలకు వెళ్లింది. ఈ క్రమంలో పాఠాలు బోధిస్తున్న టీచర్‌ ఆమె సంచిని తనిఖీ చేయగా అందులో గన్‌ ఉంది. చిన్నారి ఆయుధం తీసుకురావడంతో ఆందోళనకు గురైన టీచర్ ఆ విషయాన్ని పాఠశాల యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లింది. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. అలాగే చిన్నారి తల్లిదండ్రులకు ఈ విషయం గురించి మెయిల్‌ చేశారు. చిన్నారి సంచిలో ఆయుధం ఉంచడాన్ని తీవ్రంగా పరిగణించిన పోలీసులు పీట్‌ రోబుల్స్‌పై కేసు నమోదు చేశారు. ‘బాలిక తండ్రి పీట్‌ రోబుల్స్‌ను అరెస్టు చేశాం. చిన్నారి ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టేసే చర్యకు పాల్పడినట్లు ఆయనపై అభియోగాలు వచ్చాయి. అందుకే బాలికను చిన్నారుల సంరక్షణ కేంద్రానికి తరలించాము. ఈ కేసును మరింత లోతుగా  దర్యాప్తు చేస్తామని’ పోలీసులు తెలిపారు. పుస్తకాల సంచిలో గన్‌ బయట పడిన నేపథ్యంలో పాఠశాలలోకి సంచులు తీసుకురావడాన్ని నిషేధించామని స్కూల్‌ సీఈవో పేర్కొన్నారు. కొన్ని రోజులపాటు లోపలున్న వస్తువులు బయటకు కనిపించేలా ఉన్న ప్లాస్టిక్‌ సంచులను మాత్రమే విద్యార్థులు తీసుకురావాలని ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన వెల్లడించారు.