భారత స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా ప్రవాస భారతీయులు, వారి తల్లి దండ్రులు కలిసి .. అమెరికా రాజధాని మెట్రో ప్రాంతంలో పలు పట్టణాలలో భాను మాగులూరి ఆధ్వర్యంలో ఈ వేడులకను నిర్వహించారు. వందలాది మంది పిల్లలు, పెద్దలు పాల్గొని జెండా వందనం చేసి జాతీయ గీతాలను ఆలపించి, స్వతంత్ర దినోత్సవ ప్రాముఖ్యతను మననం చేసుకొని.. ఆనాటి ఎందరో మహనీయుల త్యాగ ఫలమే నేటి మన స్వేచ్ఛ అని కొనియాడారు. స్థానిక హెర్న్ డాన్, ఆష్ బర్న్ ప్రాంతాలలో జరిగిన ఈ వేడుకలలో ఇండియా నుండి వచ్చిన ఎందరో పెద్దలు, మహిళలు కూడా పాల్గొని దేశభక్తిని చాటుకున్నారు.. ఆనాటి భారతదేశ పరిస్థితిని, ఎందరో తమ జీవితాలను అర్పించి, వందేమాతరం అని నిత్యం నినదించి దశాబ్దాల పాటు ఈ పోరాటాన్ని సాగించి, స్వతంత్రం సాధించామన్నారు. చిన్నారులు తెలుగులో ఆలపించిన పలు దేశ గీతాలు అందరిని ఆకట్టుకున్నాయి.
లక్షలాది మంది భారతీయులు వృత్తి, ఉపాధి రీత్యా అమెరికా కు వచ్చినా కూడా భారతీయ నిపుణుల పట్ల అమెరికన్లు చూపుతున్నసహోదర భావం.. ఇరుదేశాల మధ్య సన్నిహిత సంబంధాలు బలపడి ఇకముందూ కొనసాగాలని వక్తలు అభిలషించారు. శ్రమ, క్రమశిక్షణ, అంకితభావం లక్షణాలే ఆయుధంగా, ఈనాడు ప్రపంచ వేదికపై భారతీయులు ప్రతి రంగంలోనూ విస్తరిస్తున్నారని.. ఈ విజయపధం ఇకముందూ సాగాలని కోరుకుంటూ.. ఎంత ఎదిగినా మాతృభూమి, మాతృ భాష మరువొద్దని.. ఈతరం పిల్లలకు కూడా తెలుగు భాష నేర్పించాలని అభిప్రాయపడ్డారు.. ఈ కార్యక్రమంలో సీతారామారావు, రాంప్రసాద్, రామలింగం, బుచ్చి రెడ్డి, మదన్మోహన్ రెడ్డి, రామ్మోహన్, మాల్యాద్రి, దొరా రెడ్డి, నెహ్రు, కాంతయ్య, సురేష్, జీవన్ రెడ్డి వాసంతి, సత్యమ్మ, కిషోర్, బసవరావు, భాను ఆకర్ష్, హరీష్ పలువురు పాల్గొన్నారు.