అగ్రరాజ్యం అమెరికాలో కొత్త రకం బాక్టీరియా బయటపడింది. మనిషి ఒంట్లోని మాంసాన్ని తినేసే బాక్టీరియా కారణంగా న్యూయార్క్, కనెక్టికట్ లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఉప్పునీటిలో, సముద్ర సంబంధిత ఆహారంలో ఈ బాక్టీరియా ఉంటుందని వైద్యులు తెలిపారు. నిపుణుల వివరాల ప్రకారం కలరా వ్యాధికి కారణమయ్యే బాక్టీరియా కుటుంబానికి చెందిన విబ్రియో వల్నిఫికస్ సముద్ర సంబంధిత ఆహారంలో ఉంటుంది. ఇది మానవ శరీరంలోకి వెళ్లి వారి ప్రాణాలను తీసేస్తోంది. కనెక్టికట్ నగరం ప్రజారోగ్య అధికారి చెప్పిన వివరాల ప్రకారం లాంగ్ ఐలండ్ సౌండ్‌లో వేర్వేరు చోట్ల ఇద్దరు వ్యక్తులు ఈత కొట్టే క్రమంలో ఈ వైరస్ సోకి మరణించారు. మూడో వ్యక్తికి రా ఆయిస్టర్స్‌ను తిన్న తర్వాత జూలైలో ఈ వైరస్ సోకింది. ఈ ముగ్గురి వయసు 60 నుంచి 80 సంవత్సరాల మధ్యలో ఉంటుందన్నారు.రా ఆయిస్టర్స్‌ను తినడం వల్ల, ఉప్పునీటిలో ఈతకొట్టడం వల్ల జరిగే నష్టాన్ని తెలుసుకోవాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలను కోరారు. ఈ బాక్టీరియా న్యూయార్క్ జలాల్లో చేరిందా? మరొక చోట ఉందా? అనే అంశాలపై పరిశోధనలు జరుగుతున్నాయి. విబ్రియో బాక్టీరియా చాలా అరుదైనదని, దురదృష్టవశాత్తూ అది న్యూయార్క్ ప్రాంతానికి వచ్చిందని న్యూయార్క్ గవర్నర్ కేథీ హోచుల్ తెలిపారు. గాయాలైనపుడు సముద్ర జలాలకు దూరంగా ఉండాలని తెలిపారు. విబ్రియో వల్నిఫికస్ అనే బాక్టీరియా కారణంగా చర్మానికి గాయాలవుతాయి. చర్మం పగిలిపోతుంది, అల్సర్లు అవుతాయి. ఈ బాక్టీరియా సోకినపుడు సాధ్యమైనంత త్వరగా చికిత్స పొందాలని వైద్యులు సలహా ఇచ్చారు. లేదంటే ఇది మనిషి ఒంట్లో ఉన్న మాంసాన్ని తినేస్తుందని తెలిపారు.