తెదేపా జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పర్యటన నేపథ్యంలో అమలాపురం పట్టణంలో శుక్రవారం మధ్యాహ్నం నుంచి 3 నుంచి రాత్రి 9గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించామని డీఎస్పీ అంబికాప్రసాద్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. వాహనదారులు గమనించి సహకరించాలని కోరారు.
ముమ్మిడివరం నుంచి అమలాపురం మీదుగా రావులపాలెం వెళ్లే వాహనాలు కొండాలమ్మచింత మీదుగా క్రాప, కె.జగన్నాథపురం, తొత్తరమూడి, ముక్తేశ్వరం, మడుపల్లి మీదుగా రావులపాలెం వెళ్లాలని సూచించారు.
ముమ్మిడివరం, ఉప్పలగుప్తం నుంచి రావులపాలెం వెళ్లే వాహనాలు అనాతవరం, మాగం, సరిపల్లి, ముక్తేశ్వరం, అయినవిల్లి, మడుపల్లి మీదుగా రావులపాలెం వెళ్లాలన్నారు.
కాకినాడ నుంచి అమలాపురం మీదుగా రాజోలు వెళ్లే వాహనాలు భట్నవిల్లి బైపాస్ రహదారి మీదుగా చిందాడగరువు, రోళ్లపాలెం, పేరూరు వై.జంక్షన్ మీదుగా రాజోలు చేరుకోవాలన్నారు.
రాజోలు నుంచి కాకినాడ వెళ్లే వాహనాలు పేరూరు వై జంక్షన్ మీదుగా రోళ్లపాలెం, చిందాడగరువు, భట్నవిల్లి మీదుగా కాకినాడకు వెళ్లాలని సూచించారు.
అమలాపురం నుంచి అంబాజీపేట రావులపాలెం వెళ్లే ద్విచక్ర వాహనాలు, అటోలు ఎత్తురోడ్డు, బీవీసీ కళాశాల, ఇందుపల్లి వంతెన మీదుగా చేరుకోవాలన్నారు.
అమలాపురం నుంచి రావులపాలెం వెళ్లే ద్విచక్ర వాహనాలు, ఆటోలు నల్లవంతెన, జనుపల్లె, నేదునూరు, ముక్కామలకు చేరుకోవచ్చన్నారు. నల్లవంతెన నడిపూడి కాలువగట్టు మీదుగా నడిపూడి లాకుల నుంచి ముక్కామల వెళ్లవచ్చని తెలిపారు.
అమలాపురం ఎర్రవంతెన మీదుగా పేరూరు వై.జంక్షన్ వైపు వెళ్లే ద్విచక్ర వాహనాలు, ఆటోలు ఎర్రవంతెన, విత్తనాల కాలువగట్టు, వడ్డిగూడెం సాయిబాబాగుడి మీదుగా గోఖలేకూడలి వద్దకు చేరుకోవచ్చన్నారు. సాధారణ ట్రాఫిక్, శాంతిభద్రతలకు ఇబ్బంది కలగకుండా సహకరించాలని డీఎస్పీ కోరారు.