Fashion

ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు ఈ విషయాలను తప్పక నేర్పించాలి!

ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు ఈ విషయాలను తప్పక నేర్పించాలి!

అబ్బాయి అయినా, అమ్మాయి అయినా నేర్చుకుని తీరాల్సిన లైఫ్‌ స్కిల్స్‌ కొన్ని ఉన్నాయి. బాల్యం నుంచే ఈ జీవన నైపుణ్యాలను వారికి పరిచయం చేయాలి. లేకపోతే పెద్దయ్యాక ఇబ్బంది పడతారు.

వంట చేయడం
వంట తెలిస్తే తంట ఉండదు. ఎవరో వండిపెట్టేదాకా ఎదురుచూడాల్సిన అవసరం రాదు. స్విగ్గీ, జొమాటో ఆర్డర్లతో వందల రూపాయలు వదిలించుకునే బాధ తప్పుతుంది. ఇష్టమైనవి వండుకోవడంలో, ఇష్టమైనవారికి వండిపెట్టడంలో ఎంతో సంతృప్తి ఉంటుంది.

ఇల్లు సర్దుకోవడం:పుస్తకాలు ఒక క్రమపద్ధతిలో ఉంటే.. రెఫరెన్స్‌ కోసమో, చదువుకోడానికో వెంటనే తీసేసుకోవచ్చు. బట్టల్ని ప్రాధాన్య క్రమంలో జోడించి పెట్టుకుంటే.. బయటికి వెళ్తున్నప్పుడు సమయం వృథా కాదు. ఔషధాలు, ముఖ్యమైన డాక్యుమెంట్లు, రసీదులు.. ఎక్కడ ఉండాల్సినవి అక్కడే ఉండాలి. ఈ విషయంలో బాల్యం నుంచే బాధ్యత పెంచాలి.

మంచి అలవాట్లు:వేళకు పోషకాలతో భోజనం, సమయానికి నిద్ర, పరి శుభ్రత.. పసితనం నుంచే అలవాటు చేయాలి. అవసరమైతే ఈ విషయంలో కాస్త కఠినంగా వ్యవహరించాలి. దీర్ఘకాలిక వ్యాధులబారిన పడుతున్నవారిలో అధికశాతం.. ఆరోగ్యకరమైన అలవాట్లు లేనివారే అని అధ్యయనాల సారాంశం.

ఆర్థిక అక్షరాస్యత పొదుపు-మదుపు:ఖర్చు-సంపాదన.. ఈ నాలుగు అంశాల చుట్టూ తిరుగుతాయి మన జీవితాలు. ఆర్థిక పరిజ్ఞానం లేకపోతే కుబేరుడైనా ఏదో ఓ దశలో బికారి అవుతాడు. కాబట్టి, పిల్లలకు రూపాయి విలువ తెలియజెప్పండి. వృథా ఖర్చులు తగ్గించుకునేలా చూడండి.

ఆత్మరక్షణ:సిక్స్‌ ప్యాక్‌, ఫైవ్‌ ప్యాక్‌ అవసరం లేదు. దృఢంగా ఉంటే చాలు. అవసరమైనప్పుడు తమను తాము రక్షించుకోగలిగితే పదివేలు. కరాటేలాంటి ఆత్మరక్షణ విద్యలు తెలిస్తే మరీ మంచిది. శరీరం ఉక్కులా ఉంటే.. మనసుకూ బలమే. ఈత ఒలింపిక్స్‌లో పతకం సాధించాల్సిన పన్లేదు. సప్త సముద్రాలు ఈదాల్సిన అగత్యమూ లేదు. అత్యవసర పరిస్థితుల్లో జల ప్రవాహంలోంచి ఒడ్డున పడగలిగేంత నైపుణ్యం ఉంటే సరిపోతుంది. ప్రమాదంలో ఉన్నవారిని గట్టుకు చేర్చగలిగితే ఇంకా మేలు. ఈత ఆరోగ్యకరం. నీటిని చూసి భయపడేవారు, భవిష్యత్తులో సంసార సాగరాన్ని మాత్రం ఏం ఈదుతారు?