* కేరళలో షాకింగ్ ఘటన
కేరళలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడు బుర్‌ఖా ధరించి (Wearing Burqa) మహిళల వాష్‌రూమ్ (Womens Toilet)లోకి ప్రవేశించాడు. ఈ ఘటన కొచ్చిలోని ఓ ప్రముఖ మాల్ (Kochi Mall )లో బుధవారం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.23 ఏళ్ల యువకుడు కొచ్చిలోని ఫేమస్ లులు మాల్ (Lulu Mall)ను సందర్శించాడు. అక్కడ బుర్‌ఖా ధరించి మాల్‌లోని మహిళల వాష్‌రూమ్‌లోకి ప్రవేశించి తన ఫోన్‌లో వీడియోలు రికార్డు ( Records Videos) చేశాడు. రహస్య కెమెరాను వాష్‌రూమ్‌లోని డోర్‌కు అంటించాడు. ఆ తర్వాత బయటకు వచ్చి వాష్‌రూమ్ మెయిన్ డోర్ ముందు నిలబడ్డాడు. అతని ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో మాల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా.. మహిళ వేషం వేసుకుని వాష్‌రూమ్‌లోని దృశ్యాలను తన మొబైల్‌లో రికార్డు చేస్తున్నట్లు తేలింది.నిందితుడి నుంచి బుర్‌ఖా, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. సదరు యువకుడు ఇన్ఫోపార్క్‌లోని ప్రముఖ ఐటీ సంస్థలో పనిచేస్తున్నట్లు గుర్తించారు. ఈ మేరకు అతడిపై ఐపీఎస్ సెక్షన్లు 354 (సీ), 419, 66ఈ కింద కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఆ తర్వాత అతన్ని స్థానిక కోర్టులో హాజరుపరచగా నిందితుడికి 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించినట్లు కలమసేరి పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు. నిందితుడు గతంలో ఎక్కడైనా ఇలాంటి చర్యలకు పాల్పడ్డారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
* హన్మకొండలోని ప్రసూతి ఆసుపత్రిలో అగ్నిప్రమాదం
ఇటీవల తెలంగాణాలో వరుసగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి.. ఇప్పుడు తాజాగా మరో ఘోర ప్రమాదం వెలుగుచూసింది.. హన్మకొండలోని ప్రసూతి ఆసుపత్రిలో అగ్నిప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు… అయితే వెంటంనే మంటలను అదుపు చెయ్యడం తో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని అంచనా వేస్తున్నారు.ఆస్పత్రి భవనం నుంచి పొగలు రావడాన్ని గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో వెంటనే అగ్నిమాపక శాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.ఇకపోతే ఈ ఏడాది మార్చిలో సికింద్రాబాద్ లోని 8 అంతస్తుల స్వప్నలోక్ కాంప్లెక్స్ లోని ఐదో అంతస్తు ఎయిర్ కండిషనింగ్ యూనిట్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి పై అంతస్తులకు భారీగా మంటలు వ్యాపించడంతో ఆరుగురు ఊపిరాడక మృతి చెందారు. గత కొన్ని నెలలుగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న వరుస అగ్ని ప్రమాదాల్లో ఇది తాజాది. మృతులను ప్రమీల, వెన్నెల, శ్రావణి, శివగా గుర్తించారు. కారిడార్లలో మంటలు చెలరేగడంతో ఐదో అంతస్తులోని వాష్ రూమ్ దగ్గర ఊపిరాడక మృతి చెందినట్లు తెలిపారు.. ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో ఎక్కడో చోట జరుగుతూనే ఉన్నాయి.. ఇలాంటి వాటిని నిపుణులు చెబుతున్నారు.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి..
* చిన్నారి పై అత్యాచారం హత్య
నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో దోషిగా తేలిన సురేశ్ కుమార్‌కు ట్రయల్ కోర్టు విధించిన మరణ శిక్షను రాజస్థాన్ హైకోర్టు జీవిత ఖైదుగా మార్చింది. నేరం జరిగినప్పుడు సురేశ్ వయస్సు 23 ఏళ్లు మాత్రమేనని, అతడికి ఒక ఏడాది కుమార్తె, భార్య ఉన్నారని గుర్తించిన జస్టిస్ పంకజ్ భండారీ, భువన్ గోయల్‌లతో కూడిన ధర్మాసనం శిక్షను తగ్గించాలని నిర్ణయించింది. నేరం ప్లాన్ ప్రకారం జరగలేదని, సురేశ్‌కు ఎలాంటి నేర చరిత్ర లేదని, పోలీస్ కస్టడీలో అతని ప్రవర్తన కూడా సంతృప్తికరంగా ఉందని, అతడిని సమాజానికి పెను ముప్పుగా భావించలేమని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. అయితే.. బాధితురాలు నాలుగేళ్ల చిన్నారి అని, ఆమెను అత్యాచారం చేసి నీటిలో ముంచి చంపేశారని గుర్తించిన బెంచ్ యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.2021లో జరిగిన దారుణంపై ట్రయల్ కోర్టు 2022లో మరణ శిక్ష విధించింది. దాన్ని ధ్రువీకరించేందుకు హైకోర్టుకు పంపించింది. మరోవైపు ట్రయల్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ సురేశ్ హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశాడు. చిన్నారి మృతదేశాన్ని చెరువులో నుంచి వెలికి తీసిన గ్రామస్థులు నిందితుడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారని హైకోర్టుకు తెలిపారు. అయితే.. తొలుత ‘శ్యోరాజ్’ను అరెస్టు చేశారని, తనను ఈ కేసులో తప్పుగా ఇరికించారని సురేశ్ ఆవేదన వ్యక్తం చేశాడు. సురేశ్‌కు శోర్యాజ్ అనే బంధువు ఉన్నందున పేర్లలో గందరగోళం తలెత్తిందని సాక్షి తర్వాత స్పష్టం చేసినట్లు కోర్టు పేర్కొన్నది. సురేశ్‌ను గ్రామస్థులు పట్టుకున్నప్పుడు ఈ ఘోరం చేసినట్లు అంగీకరించాడని, చిన్నారిని చెరువులో పడేశానని చెప్పాడని సాక్షి తెలిపాడు. సురేశ్ నుంచి తీసుకున్న డీఎన్ఏ నమూనాలు మరణించిన చిన్నారి స్కర్ట్‌పై కనుగొనబడిన డీఎన్ఏతో సరిపోలడంతో అతడే దోషిగా కోర్టు నిర్ధారించింది.
* జైలు శిక్ష తర్వాత కూడా మళ్లీ బాలికపై నిందితుడి అత్యాచారం
జైళ్లు ఖైదీల్లో మార్పు తీసుకురావటం లేదు. చేసిన నేరానికి ఏడేళ్ల జైలు శిక్ష అనుభవించినా ఖైదీలో మార్పు రాకపోగా, గతంలో చేసిన నేరమే మళ్లీ చేశారు. ఓ బాలికపై అత్యాచారం కేసులో ఏడేళ్ల జైలు శిక్ష అనుభవించిన దోషి, జైలు నుంచి విడుదలయ్యాక మళ్లీ అయిదేళ్ల దళిత బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా వెలుగుచూసింది.రాకేష్ వర్మ అలియాస్ రక్కు 2012వ సంవత్సరంలో కోల్గ్వాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నాలుగున్నరేళ్ల బాలికపై అత్యాచారం చేశాడు. ఈ కేసులో దోషిగా తేలడంతో రాకేష్ వర్మకు కోర్టు అతనికి పదేళ్ల జైలు శిక్ష విధించిందని పోలీసు సూపరింటెండెంట్ మహేంద్ర సింగ్ చౌహాన్ తెలిపారు. అయితే జైలులో సత్ప్రవర్తన కారణంగా మూడేళ్ల జైలు శిక్షను రద్దు చేసి 18 నెలల క్రితమే అతన్ని జైలు నుంచి విడుదల చేసినట్లు పోలీసులు తెలిపారు.జైలు నుంచి విడుదలైన ఏడాదిన్నర తర్వాత నిందితుడు రాకేష్ వర్మ మరో మైనర్ బాలికపై అదే నేరానికి పాల్పడ్డాడు. నిందితుడు రాకేష్ వర్మ అలియాస్ రక్కు బాలికకు మిఠాయిలు తినిపిస్తానని మాయమాటలతో ప్రలోభపెట్టినట్లు తీసుకువెళ్లి అత్యాచారం చేశాడని పోలీసులు చెప్పారు. బుధవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో బాధిత బాలిక కనిపించకుండా పోవడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో బాలిక అమ్మమ్మ ఆమె కోసం వెతకడం ప్రారంభించింది.
* ప్రకాశం జిల్లాలో విద్యార్థినులకు లైంగిక వేధింపులు
పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన కొందరు టీచర్లు కీచకులుగా మారుతున్నారు. పాఠశాలలో చదువుతున్న విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. తాజాగా ప్రకాశం జిల్లా పుల్లల చెరువు జెడ్పీ హైస్కూల్‌లో ఇలాంటి ఘటన వెలుగుచూసింది. ఇద్దరు విద్యార్థినులపై టీచర్లు లైంగిక వేధింపులు పాల్పడ్డారు. ఇంగ్లీష్ టీచర్ రామకృష్ణ, పీఈటీ బాలు నాయక్‌లు.. విద్యార్థినులను లైంగికంగా వేధించారు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థినుల తల్లిదండ్రులు, బంధువులు.. ఇద్దరి దేహశుద్ది చేశారు. విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడిన టీచర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
* సత్తుపల్లి మండలం సదాశివునిపాలెంలో క్షుద్ర పూజలు కలకలం
సత్తుపల్లి మండలం సదాశివునిపాలెంలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. బుధవారం రాత్రి అమావాస్య కావడంతో గుర్తు తెలియని వ్యక్తులు పూజలు చేసి పూజ సామగ్రిని రోడ్డు కూడలిలో వదిలి వెళ్ళారు. పసుపు కుంకుమలతో కూడిన అన్నం, కోడిగుడ్లు, మిరపకాయలు, నిమ్మకాయలతో ముగ్గులు వేసి పూజలు చేసినట్టు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. దీంతో గ్రామస్తులు, పొలాల్లోకి వెళ్లే రైతులు తీవ్ర భయాందోళనకు గురి అవుతున్నారు.
* గుజరాత్ లో ఘోర రోడ్డు ప్రమాదం
గుజరాత్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు స్పాట్ లోనే చనిపోయారు.. రెండేళ్ల బాలుడు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు.. బుధవారం భరూచ్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, రెండేళ్ల బాలుడు స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడ్డాడని పోలీసులు తెలిపారు.వివరాల్లోకి వెళితే.. గుజరాత్ లోని భరూచ్ జిల్లాలో బుధవారం రెండు కార్లు ఢీకొన్న ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందగా, రెండేళ్ల బాలుడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. మధ్యాహ్నం హన్సోట్ గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. రెండేళ్ల బాలుడితో సహా మొత్తం ఆరుగురు ఒకే కారులో భరూచ్ నుంచి సూరత్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది..ఈ ప్రమాదంలో మరో కారు డ్రైవర్ కు కూడా గాయాలయ్యాయనీ, మృతుల్లో నలుగురు మహిళలు ఉన్నారని తెలిపారు. మృతుల్లో వృద్ధ దంపతులు ఇంతియాజ్ పటేల్, ఆయన భార్య సల్మాబెన్, వారి వివాహిత కుమార్తెలు మారియా, అఫిఫా, ఇంతియాజ్ పటేల్ సోదరుడు జమీలా పటేల్ భార్య ఉన్నారు.అయితే ఈ ప్రమాదంలో చిన్నారి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.. ప్రస్తుతం ఆ చిన్నారిని ఆసుపత్రికి తరలించారు.. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారనీ, 50 ఏళ్ల వయసున్న ఇంతియాజ్ పటేల్ కారు నడుపుతున్నారని, ప్రమాద సమయంలో సీటు బెల్ట్ కూడా ధరించారని తెలిపారు.. ఈ ప్రమాదంలో ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కాకపోవడంతో ఐదుగురు చనిపోయారని పోలీసులు గుర్తించారు.. ఈ ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి
* మరో పడవ ప్రమాదంలో భారీ సంఖ్యలో వలసదారులు దుర్మరణం
మరో పడవ ప్రమాదంలో భారీ సంఖ్యలో వలసదారులు దుర్మరణం చెందారు. మరికొంత మంది గల్లంతయ్యారు. ఈ ఘటన పశ్చిమ ఆఫ్రికా తీరానికి దాదాపు 620 కిలో మీటర్ల దూరంలో ఉన్న కేప్ వర్డె దీవుల్లో చోటుచేసుకుంది. ఈ విషయాన్ని యూఎన్ ఏజెన్సీ ఇంటర్నేషనల్ మైగ్రేషన్ ఫర్ ఆర్గనైజేషన్ సంస్థ తెలిపింది.జులై 10వ తేదీన సెనెగల్ నుంచి 100 మంది వలసదారులతో బయలుదేరిన పడవ మునిగిపోయినట్లు స్పెయిన్‌కు చెందిన ఓడ సిబ్బంది గుర్తించారు. అనంతరం కేప్ వర్డియన్ అధికారులకు సమాచారం అందించారు. హుటాహుటిన అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి ఏడుగురి మృతదేహాలను గుర్తించారు. ప్రమాదంలో గల్లంతైన వారంతా మృతి చెంది ఉంటారని అధికారులు భావిస్తున్నారు. మరో 56 మంది గల్లంతవ్వగా.. వారు కూడా మరణించి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. చేపలు పట్టే చిన్న పడవలో బయలుదేరిన వలసదారులు స్పెయిన్‌కు వెళ్తున్నట్లు సమాచారం.
* భార్యపై అనుమానంతో భర్త ఆత్మహత్య
ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా దేవరకొండలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రేమించి,పెళ్లి చేసుకున్న భార్య మీద అనుమానంతో ఓ వ్యక్తి.. మూడేళ్ల కొడుకుకు పురుగుల మందు తాగించి, ఆ తరువాత తానూ తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఇదంతా పట్టపగలు నడి వీధిలో జరగడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. అతను కత్తి పట్టుకుని, తిప్పుతూ ఊగిపోతూ.. ఆపడానికి దగ్గరికి వచ్చే వారిని చంపేస్తానని బెదిరిస్తూ ఈ దారుణానికి ఒడిగట్టాడు. పురుగుల మందు తాగి కింద పడిపోగానే.. స్థానికులు, పోలీసులు వెంటనే వారిద్దరినీ దేవరకొండ ఆసుపత్రికి తరలించి, చికిత్స అందించగా అప్పటికే వారు మృతి చెందారు.ఈ ఘటనకు సంబంధించిన వివరాలలోకి వెళితే..మృతుడు బసవరాజు పాత నేరస్తుడిగా తేలింది. అతనికి 13 ఏళ్ల క్రితం అనిత అనే యువతికి ఫోన్లో పరిచయం కాగా.. ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.అప్పటికే అతనికి నేర చరిత్ర ఉన్నప్పటికీ.. దాన్ని ఆమె దగ్గర దాచిపెట్టి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లయిన నెలకి అనిత గర్భం దాల్చింది. అప్పటికే అతను దొంగతనాలకు పాల్పడతాడన్న విషయం అనితకు తెలిసినా ఏమీ చేయలేక పోయింది. కొద్ది కాలానికి దొంగ సొమ్ము పంచుకునే దగ్గర వివాదం చెలరేగి స్నేహితుడిని హత్య చేసి జైలుకు వెళ్లాడు. ఆ తర్వాత జైలు నుంచి తిరిగి వచ్చిన బసవరాజు భార్య మీద అనుమానాన్ని పెంచుకున్నాడు. భార్యకు ఇంటి ఓనర్ తో అక్రమ సంబంధం ఉందని ఆరోపిస్తూ గొడవలకు దిగుతుండేవాడు. మూడేళ్ల వయసున్న రెండోకొడుకు తనకు పుట్టలేదంటూ గొడవలకు దిగేవాడు. దీంతో అనిత పుట్టింటికి వెళ్ళింది. ఆమెను మాయ మాటలు చెప్పి తీసుకువచ్చిన బసవరాజు గురువారం ఈ దారుణానికి ఒడిగట్టాడు. భార్యతో మళ్లీ గొడవపడిన బసవరాజు ఆమెను చంపుతాను అంటూ కత్తితో వెంటపడ్డాడు.
* తృటిలో బయటపడిన ప్రయాణికులు
ఒక హైవేపై వెళ్తున్న బస్సుకు ఉన్నట్టుండి మంటలు వ్యాపించాయి (Bus Catches Fire). అప్రమత్తమైన డ్రైవర్ దానిని రోడ్డు పక్కగా నిలిపాడు. దీంతో బస్సులోని ప్రయాణికులంతా బయటకు పరుగులుతీశారు. అనంతరం కొన్ని క్షణాల్లో ఆ బస్సు మంటల్లో కాలిపోయింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్‌లో ఈ సంఘటన జరిగింది. బుధవారం జనరల్ పాజ్ హైవే పలు వాహనాలతో రద్దీగా ఉన్నది. ఇంతలో ఒక డబుల్ బస్సు ఆ హైవేపై వెళ్తున్నది.కాగా, ఆకస్మాత్తుగా బస్సు వెనుక భాగంలో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ ఆ బస్సును రోడ్డు పక్కగా నిలిపాడు. దీంతో అందులోని ప్రయాణికులు వెంటనే బయటకు వచ్చారు. అనంతరం కొన్ని నిమిషాల్లో మంటలు బస్సు మొత్తం వ్యాపించాయి. దీంతో ఆ బస్సు పూర్తిగా కాలిపోయింది. అలాగే హైవేపై కూడా మంటలు వ్యాపించాయి. రెండు కార్లు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాయి. కొంత సేపటికి ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. మంటలను ఆర్పివేశారు.మరోవైపు ఆ హైవేపై ఉన్న సీసీటీవీలో ఈ సంఘటన రికార్డ్ అయ్యింది. అర్జెంటీనా పోలీసులు రిలీజ్ చేసిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియో చూసి నెటిజన్లు షాక్ అయ్యారు. అయితే ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడటం, ఎవరికీ ఏమీ కావపోవడం అదృష్టమని కొందరు పేర్కొన్నారు.