అమెరికాకు వలస వచ్చి ఈ దేశ అభివృద్ధిలో పాలుపంచుకుంటున్న ప్రవాసాంధ్రులు తమ భావితరాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని స్థానిక రాజకీయాల్లో చురుగ్గా, క్రియాశీలకంగా వ్యవహరించాలని రాజ్యసభ మాజీ సభ్యులు, మాజీ ఎంపీ డా. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ కోరారు. మిషిగన్ రాష్ట్రంలోని నోవై నగర కార్పోరేషన్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కృష్ణా జిల్లాకు చెందిన ప్రవాసాంధ్రుడు పెద్దిబోయిన జోగేశ్వరరావు (Joe) తన ఎన్నికల ప్రచారాన్ని గురువారం నాడు నోవైలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నోవై ప్రస్తుత, మాజీ మేయర్లతో కలిసి యార్లగడ్డ పాల్గొని జోగేశ్వరరావుకు తమ మద్దతును తెలిపారు.
చెట్టు నుండి రాలి కింద పడిన ఆకులు అదే చెట్టుకు ఎరువుగా మారినట్టుగా అమెరికాలో ఎదిగి, ఇక్కడ కుటుంబాన్ని, స్నేహితులను, ఉద్యోగాలను ఏర్పాటు చేసుకుని, అమెరికా పౌరసత్వం కలిగిన ప్రవాస భారతీయులు మాతృదేశ రాజకీయాల పట్ల తామరాకు మీద నీటి బిందువులుగా వ్యవహరించాలని యార్లగడ్డ సూచించారు. స్థానిక రాజకీయాల్లో, సేవా కార్యక్రమాల్లో సొంతింటిలో శుభకార్యం మాదిరి ముందు వరుసలో నిలబడే ధైర్యం చేయాలని ఆయన కోరారు. తాను ప్రపంచవ్యాప్తంగా ఏ దేశానికి వెళ్లినా తన మిత్రులకు, స్నేహితులకు, శిష్యులకు స్థానికంగా మనల్ని మనం బలోపేతం చేసుకునేందుకు ఉన్న వనరులను గుర్తించి సద్వినియోగం చేసుకునేలా కృషి చేయాలని ప్రోత్సహించినట్లు గుర్తుచేశారు. జోగేశ్వరరావుకు నోవైలో భారతీయులతో సత్సంబంధాలు బలంగా ఉన్నాయని, ఆయన విజయం సాధించాలని లక్ష్మీప్రసాద్ ఆకాంక్షించారు.
అమెరికాలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతి అభ్యర్థి తమ ప్రచార ఖర్చుల నిమిత్తం నిధుల సేకరణ నిర్వహిస్తారు. ఈ క్రమంలో భాగంగా జోగేశ్వరరావు ఎన్నికల ఖర్చుల నిమిత్తం యార్లగడ్డ కుటుంబీకులు $3375 డాలర్లు విరాళంగా అందజేశారు.
For more info on Joe for Novi City Council – https://joefornovi.com/meet-joe