Politics

మంగళగిరి కోర్టుకు హాజరైన లోకేశ్

మంగళగిరి కోర్టుకు హాజరైన లోకేశ్

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మంగళగిరి మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టుకు హాజరయ్యారు. ప్రముఖ న‌టుడు, ద‌ర్శ‌కుడు, ఏపీ ఫిల్మ్ డెవ‌ల‌ప్మెంట్ కార్పొరేష‌న్ చైర్మ‌న్ పోసాని కృష్ణముర‌ళి తనపై అసత్య ఆరోపణలు చేశారంటూ నారా లోకేశ్ న్యాయపోరాటానికి దిగారు. పోసాని కృష్ణమురళితోపాటు సింగలూరు శాంతి ప్రసాద్ అనే వ్యక్తి సైతం తనపై బురద జల్లేందుకు నిరాధార ఆరోపణలు చేశారని లోకేశ్ ఆరోపించారు. ఈ మేరకు సింగలూరు శాంతి ప్రసాద్, పోసాని కృష్ణమురళిలపై వేర్వేరుగా మంగళగిరి మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టులో కేసు దాఖలు చేశారు. ఈ రెండు కేసుల్లో వాంగ్మూలం న‌మోదు కోసం శుక్ర‌వారం నాడు మంగళగిరి మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టుకి లోకేశ్ చేరుకున్నారు. లోకేశ్ మంగళగిరి చేరుకోవడంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. వారందరికీ లోకేశ్ అభివాదం చేస్తూ కోర్టులోపలికి వాంగ్మూలం ఇచ్చేందుకు వెళ్లారు. ఇకపోతే ఓ యూట్యూబ్ ఛానెల్‌కి పోసాని కృష్ణమురళి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో లోకేశ్‌పై సంచలన ఆరోపణలు చేశారు. కంతేరులో లోకేశ్ 14 ఎక‌రాల భూములు కొనుగోలు చేశార‌ని ఇంటర్వ్యూలో తెలిపారు. కంతేరులో తనకు ఆరసెంటు భూమి కూడా లేదని లోకేశ్ వివరణ ఇచ్చారు. ఈ తప్పుడు ఆరోపణలపై పోసాని కృష్ణమురళి క్షమాపణలు చెప్పాలని తన న్యాయవాది ద్వారా నోటీసులు పంపారు. మెుదటిసారి పంపిన నోటీసులకు పోసాని కృష్ణమురళి స్పందించలేదు. దీంతో రెండోసారి నోటీసులు పంపించారు. అయినప్పటికీ పోసాని కృష్ణమురళి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో తన పరువు, ప్రతిష్టకు భంగం కలిగించేలా ఆరోపణలు చేసిన పోసాని కృష్ణమురళిపై చర్యలు తీసుకోవాలని కోర్టును ఆశ్రయించారు. మరోవైపు ఓ యూట్యూబ్ చాన‌ల్లో నిర్వ‌హించిన ఒక చ‌ర్చా కార్య‌క్ర‌మంలోనూ సింగ‌లూరు శాంతి ప్ర‌సాద్ అనే వ్య‌క్తి అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఇచ్చిన లోకేశ్ ఉద్యోగుల జీతాల‌ నుంచి వ‌సూలు చేయిస్తున్నార‌ని… త‌న ఫ్రెండ్ చెప్పార‌ంటూ ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను లోకేశ్ ఖండించారు. దీనిపైనా లోకేశ్ తన న్యాయవాది ద్వారా నోటీసులు పంపారు. ఎలాంటి వివరణ ఇవ్వకపోవడంతో శాంతి ప్ర‌సాద్‌పై చర్యలు కోరుతూ లోకేశ్ మంగళగిరి మున్సిఫ్ మెజిస్ట్రేట్‌లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ రెండు కేసుల్లోనూ వాంగ్మూలం ఇచ్చేందుకు నారా లోకేశ్ మంగళగిరి మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టుకు హాజరయ్యారు. కోర్టులో వాంగ్మూలం ఇవ్వాల్సిన నేపథ్యంలో శుక్రవారం యువగళం పాదయాత్రకు లోకేశ్ విరామం పలికిన సంగతి తెలిసిందే.