ScienceAndTech

పరిశోధనలో చంద్రునిపై అరుదైన ఖనిజాలు

పరిశోధనలో చంద్రునిపై అరుదైన ఖనిజాలు

భూమికి సహజ సిద్ధంగా ఉన్న ఉపగ్రహం చందమామపై పరిశోధనలు చేసేందుకు అనేక దేశాలు ప్రయత్నిస్తున్నాయి. జూలై 14న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చంద్రయాన్‌-3ని ప్రయోగించగా… ఇటీవల రష్యా లూనా మిషన్‌ను ప్రయోగించింది.

విలువైన ఖనిజాలకు నెలవు..ఎన్నో విలువైన ఖనిజ నిక్షేపాలను చంద్రుడు తన గర్భంలో దాచుకున్నాడు. హైడ్రాక్సిల్‌ అణువులు రూపంలో నీటి జాడలను చంద్రయాన్‌-1 2008లోనే కనుగొన్నది. అత్యంత విలువైన హీలియం-3 ఖనిజం నిల్వలు టన్నుల కొద్దీ చంద్రుడిపై ఉన్నట్టు నాసా వెల్లడించింది. ఇది భూమిపై అరుదుగా ఉంటుంది. రేడియోధార్మికత లేని ఈ ఖనిజాన్ని కాలుష్యం లేకుండా న్యూక్లియర్‌ ఎనర్జీ తయారీలో వాడుకోవచ్చని యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ తెలిపింది. కంప్యూటర్లు, స్మార్ట్‌ఫోన్లలో వాడే, భూమిపై అరుదుగా దొరికే అనేక ఖనిజాలు చంద్రుడిపై ఉన్నట్టు పరిశోధనల్లో తేలింది. స్కాండి యం, యట్రియం, 15 రకాల లాంథనైడ్స్‌ కూడా జాబిల్లిపై ఉన్నట్టు బోయింగ్‌ సంస్థ చెప్పింది.

ప్రతికూల పరిస్థితులు..జాబిల్లిపై మైనింగ్‌ చాలా క్లిష్టమైన ప్రక్రియ. అక్కడ మైనింగ్‌ చేసేందుకు భారీగా మౌలిక వసతులు కావాలి. మరోవైపు అక్కడి ప్రతికూల పరిస్థితులలో మానవులు ఉండలేరు. జాబిల్లిపై పగటిపూట 127 డిగ్రీల సెల్సియస్‌, రాత్రి -173 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత ఉంటుంది. దీంతో రోబోలపై ఆధారపడాల్సి ఉంటుంది.

పాలసీ రూపకల్పన అవసరం..ఇప్పటివరకు చంద్రుడిపై ఏ ఒక్క దేశానికీ హక్కులు సంక్రమించలేదు. 1966లో జరిగిన ఐక్యరాజ్య సమితి అవుటర్‌ స్పేస్‌ ఒప్పందం ప్రకారం ఖగోళంపై ఏ దేశానికి హక్కులు ఉండవు. చంద్రుడు ఏ ఒక్క దేశ ఆస్తి కాదని 1979లో మరో ఒప్పందం జరిగింది. చంద్రుడిపై సేఫ్టీ జోన్స్‌ ఏర్పాటు, అంతర్జాతీయ అంతరిక్ష చట్టం రూపొందించాలంటూ 2020లో అమెరికా ఆర్టెమిస్‌ అకార్డ్స్‌ను ప్రకటించింది. అయితే దీనిపై భారత్‌ సంతకం పెట్టగా చైనా, రష్యా దూరంగా ఉన్నాయి. చంద్రుడిపై పరిశోధనలకు పోటీ తీవ్రమవుతున్న తరుణంలో మైనింగ్‌కు సంబంధించి ప్రత్యేక పాలసీని రూపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.