మెదడు వయసును తగ్గించే దిశగా అమెరికా, ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు పురోగతి సాధించారు. మెదడు వయసును దశాబ్దాల వరకు తగ్గించే ప్రక్రియలో విజయవంతమయ్యారు. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, శాన్ ఫ్రాన్సిస్కో (యూసీఎస్‌ఎఫ్), యూనివర్సిటీ ఆఫ్ క్వీన్‌ల్యాండ్స్ శాస్త్రవేత్తలు ఎలుకలపై పరిశోధనలు చేశారు. ఇందుకు గానూ 2 ఏండ్ల ఎలుకలను ఎంచుకున్నారు. ఈ వయసు ఎలుకలు మానవుల 70 ఏండ్లకు సమానం. ఎలుకలు వృద్ధాప్యానికి వాటి రక్తంలో ఓ జన్యువు కారణమని పరిశోధకులు గుర్తించారు.ప్లేట్‌లెట్ ఫ్యాక్టర్ (పీఎఫ్)-4 అనే ప్రొటీన్‌తో మెదడు వయసును తగ్గించవచ్చని శాస్త్రవేత్తలు తెలుసుకున్నారు. ఎలుకలకు ఈ ప్రొటీన్‌ను అందించారు. దీని ప్రభావంతో వృద్ధాప్యంలో ఉన్న ఎలుకలు మధ్య వయసుకు చేరుకున్నాయి. అదే సమయంలో యువ ఎలుకల మెదడు పనితీరు స్మార్ట్‌గా మారినట్టు పరిశోధకులు గుర్తించారు. ఈ పరిశోధన ఫలితాలు మానవులపై కూడా పని చేస్తాయని శాస్త్రవేత్తలు విశ్వసిస్తున్నారు.