తెలంగాణ ఎక్స్‌ప్రెస్ (Telangana Express)కు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. మహారాష్ట్ర (Maharashtra)లో ప్రయాణిస్తున్న ఈ రైల్లో శనివారం ఉదయం అగ్నిప్రమాదం (Fire Accident) చోటుచేసుకుంది. ఎస్-2 బోగీలో మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన సిబ్బంది రైలును నాగ్‌పుర్ (Nagpur) సమీపంలో నిలిపివేయడంతో ప్రయాణికులు బోగి నుంచి కిందకు దిగి పరిగెట్టారు. ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదని, ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.
ఉద్యాన్ ఎక్స్‌ప్రెస్‌లోనూ..అటు కర్ణాటక (Karnataka) రాజధాని బెంగళూరు (Bengaluru)లోనూ ఓ రైలుకు ప్రమాదం తప్పింది. కేఎస్‌ఆర్ రైల్వే స్టేషన్‌లో ఆగి ఉన్న ఉద్యాన్ ఎక్స్‌ప్రెస్ (Udyan Express)లో అగ్నిప్రమాదం (Fire Accident) చోటుచేసుకుంది. క్షణాల్లో మంటలు వ్యాపించి దట్టమైన పొగ అలుముకుంది. అయితే ప్రయాణికులు రైలు నుంచి దిగిన రెండు గంటల తర్వాత ఈ ప్రమాదం చోటుచేసుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారమందుకున్న రైల్వే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు యత్నిస్తున్నారు. ఘటనలో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదని రైల్వే అధికారులు వెల్లడించారు.