చాట్ జీపీటీ.. మనిషికంటే వేగంగా ఆలోచిస్తూ సమస్త సమాచారాన్ని క్షణాల్లో సమకూర్చే కృత్రిమ మేధ. కవితలు, కథలే కాదు, కంప్యూటర్ ప్రోగాంలు కూడా క్షణాల్లో రాస్తుండటం చూసి ప్రపంచమే నివ్వెరపోతోంది. కానీ ఇదే తరహాలో చొచ్చుకొస్తున్న ‘ఫ్రాడ్ జీపీటీ’ మాత్రం దర్యాప్తు సంస్థలకు తలనొప్పిగా మారుతోంది. మనిషికి అవసరమైన సమాచారం అందించడం చాట్ జీపీటీ ప్రత్యేకత అయితే.. హ్యాకింగ్ టూల్స్ తయారు చేసివ్వడం ఫ్రాడ్‌జీపీటీ ప్రత్యేకత. దీంతో సైబర్ నేరగాళ్ల సామర్థ్యాలు మరింత పెరిగాయని, ఇది విస్తృతమైతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానం రెండు వైపులా పదునున్న కత్తిలాంటిది. అటు పోలీసులు ఎలా వాడుకుంటున్నారో.. ఇటు అసాంఘిక శక్తులూ అదే స్థాయిలో వినియోగిస్తున్నాయి. నేరం జరిగిన తర్వాతే ఎలా చేశారో పోలీసులు తెలుసుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో ఇలా కూడా చేయొచ్చా అని నిర్ఘాంతపోతున్నారు. ముఖ్యంగా సైబర్‌నేరాల విషయంలో పోలీసుల కంటే దొంగలే ఒకడుగు ముందుంటున్నారు. కంప్యూటర్లోకి రహస్యంగా చొచ్చుకొచ్చే హ్యాకింగ్, ఎరవేసి ఖాతా ఖాళీ చేసే ఫిషింగ్, ఫోన్ ద్వారా మాయచేసి డబ్బు గుంజే విషింగ్, ఎస్సెమ్మెస్ పంపించి ఓటీపీ కొల్లగొట్టే స్మిషింగ్ ఇందుకు నిదర్శనం. ఇప్పుడు ‘ఫ్రాడ్ జీపీటీ’ వారికి వరంలా మారింది.
ఇది చాట్ జీ(పీటీ మాదిరిగానే పనిచేస్తుంది. ఏదైనా ఒక కంప్యూటర్‌ను హ్యాక్ చేయాలనుకుంటే అవసరమైన ప్రోగ్రాం దీని ద్వారా రాయిస్తున్నారు. ఇది సొంతంగా రాయాలంటే చాలా సమయం, నైపుణ్యం అవసరమవుతాయి. ఫ్రాడ్ జీపీటీ అతి తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో రాస్తుంది. దీనివల్ల ప్రధానంగా వ్యాపార సంస్థల మధ్య జరిగే లావాదేవీలకు పెనుముప్పు ఏర్పడుతుందని నిపుణులు భయపడుతున్నారు. ఏదైనా సంస్థ మరో సంస్థకు రాసినట్లే ఫ్రాడ్ ఈమెయిల్స్ పంపి డబ్బు కొల్లగొట్టే అవకాశం ఉంది. అలానే ప్రతి సంస్థ తమ సర్వర్లను కాపాడుకునేందుకు ఫైర్‌వాల్స్ ఏర్పాటు చేసుకుంటుంది. వాటిని సునాయాసంగా ఛేదించి, సర్వర్‌ను తమ అధీనంలోకి తెచ్చుకునే ప్రమాదముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎవరూ ఊహించని రీతిలో ఇంకా ఆర్థిక నేరాలకు పాల్పడవచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.