Movies

మామ కోసం బరిలోకి ఐకాన్ స్టార్

మామ కోసం బరిలోకి ఐకాన్ స్టార్

టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ మామ (భార్య స్నేహ రెడ్డి తండ్రి), బీఆర్ఎస్ నేత కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అవకాశం వస్తే వచ్చే ఎన్నికల్లో నాగార్జునసాగర్ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో నిలుస్తానని చెప్పారు. తన కోసం అల్లు అర్జున్ ప్రచారాన్ని నిర్వహిస్తారని తెలిపారు. మెగా కుటుంబంలో తాను కూడా భాగమైనందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు. సినీ నటుడిగా బన్నీ దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారని, రాజకీయంగా కూడా ఆయన సేవలు అవసరమని అన్నారు. 2014 ఎన్నికల్లో తాను తనకు కొత్తదైన ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ తరపున పోటీ చేశానని, అప్పట్లో తనకు బన్నీ ప్రచారం చేయలేదని చెప్పారు. ఈసారి తన సొంత నియోజకవర్గం నాగార్జునసాగర్ నుంచి పోటీ చేస్తానని తెలిపారు.

అందరు మామాఅల్లుళ్లు ఎలా ఉంటారో… తనతో కూడా అల్లు అర్జున్ అలానే ఉంటారని చంద్రశేఖర్ రెడ్డి చెప్పారు. తమతో ఎంతో ఆప్యాయంగా ఉంటారని తెలిపారు. మరోవైపు, సాగర్ నియోజకవర్గంలోని పెద్దవూర మండలం భట్టుగూడెం వద్ద చంద్రశేఖర్ రెడ్డి ఫంక్షన్ హాల్ ను నిర్మించారు. ఈరోజు ఈ ఫంక్షన్ హాల్ ను అల్లు అర్జున్ ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ బన్నీ అభిమానుల సందడి నెలకొంది. పెద్ద ఎత్తున ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ప్రారంభోత్సవానికి మంత్రి జగదీశ్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు కూడా రానున్నారు. ఆ ప్రాంతంలో కేటీఆర్, జగదీశ్ రెడ్డి కటౌట్లను కూడా ఏర్పాటు చేశారు.