DailyDose

 ఓ వృద్ధురాలి కోరికను నెరవేర్చిన లోకేశ్-TNI నేటి తాజా వార్తలు

 ఓ వృద్ధురాలి కోరికను నెరవేర్చిన లోకేశ్-TNI నేటి తాజా వార్తలు

*  ఓ వృద్ధురాలి కోరికను నెరవేర్చిన లోకేశ్

మక్కా యాత్ర చేయాలన్న ఓ వృద్ధురాలి కోరికను తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేశ్ నెరవేర్చారు. యాత్ర కోసం ఆమెకు రూ. 1.50 లక్షలు అందించారు. దీంతో ఆ వృద్ధురాలి ఆనందానికి హద్దే లేకుండా పోయింది. యువగళం పాదయాత్రలో భాగంగా మే 15న లోకేశ్ నంద్యాల జిల్లా బండిఆత్మకూరు మండలంలోని పార్నపల్లె చేరుకున్నారు. గ్రామానికి చెందిన వృద్ధురాలు హుసేన్‌బీని పలకరించారు. ఆమె సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా హుసేన్‌బీ మాట్లాడుతూ.. మక్కా యాత్ర చేయాలన్న కోరిక అలాగే మిగిలిపోయిందని, సాయం చేయాలని కోరారు. దీనికి ఆయన సరేనని హామీ ఇచ్చారు. మక్కా వెళ్లి వచ్చేందుకు అవసరమైన సాయం అందిస్తానని మాటిచ్చారు. అనుకున్నట్టే తాజాగా ఆమె ఉమ్రా యాత్రకు ఏర్పాట్లు చేశారు. అందులో భాగంగా టికెట్ల కోసం రూ. లక్ష, ఖర్చులకు రూ. 50 వేలు కలిపి మొత్తంగా రూ.1.50 లక్షల చెక్ పంపించారు. మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్ నిన్న ఆ చెక్‌ను హుసేన్‌బీకి అందించారు.

*   నిజామాబాద్‌లో ఎడతెరపి లేకుండా వర్షం

 నిజామాబాద్‌ (Nizamabad) జిల్లాలో అర్ధరాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వర్షం (Rain) కురుస్తున్నారు. జిల్లాలో వ్యాప్తంగా అన్ని మండలాల్లో జోరు వాన పడుతున్నది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో ఇండ్లు నీటమునిగాయి. భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి.. జిల్లా అధికారులను అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కాగా, జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో గోదావరి (Godavari river) నదిలో ప్రవాహం పెరిగింది. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులోకి (Sriram Sagar project) వరద నీరు చేరుతున్నది. ప్రస్తుతం 30 వేల క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తున్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా, ఇప్పుడు 1090 అడుగుల వద్ద నీరు ఉన్నది. ప్రాజెక్టు నీటినిలువ సామర్థ్యం 90 టీఎంసీలకుగాను 85.3 టీఎంసీలు ఉన్నాయి.

వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ నేతల మధ్య వర్గ పోరు

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్‌ఎస్‌లో లుకలుకలు బయటపడుతున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ నేతల మధ్య వర్గ పోరు మొదలైంది. స్టేషన్ ఘన్‌పూర్ , జనగామ నియోజకవర్గా్లలో సిట్టింగ్‌లకు సీట్లు గల్లంతవుతాయనే ప్రచారంతో ఎమ్మెల్యేల అనుచరులు ఫైర్ అవుతున్నారు. ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, పల్లాకు వ్యతిరేకంగా నిరసనలకు దిగారు. జనగామలో పల్లా గో బ్యాక్ అంటూ ప్ల కార్డులు ప్రదర్శించారు. పల్లా దిష్టిబొమ్మ దగ్ధానికి పిలుపునివ్వడంతో పోలీసులు భారీగా మోహరించారు. కడియం వ్యాఖ్యలకు నిరసనగా వేలేరు మండల కేంద్రంలో రాజయ్య వర్గీయులు ర్యాలీ నిర్వహించారు. కడియం వద్దు… రాజయ్య ముద్దు అంటూ నేతలు నినాదాలు చేశారు. కడియం దిష్టిబొమ్మ దగ్ధానికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. జాతీయ రహదారిపై ఎమ్మెల్యే రాజయ్య మద్దతుదారులు ధర్నాకు దిగారు. హన్మకొండ-హైదరాబాద్ జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. స్టేషన్ ఘన్‌పూర్ బీఆర్ఎస్ టికెట్ రాజయ్యకే ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఆంధ్రలో 35 సర్పంచ్ 245 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు

ఆంధ్రప్రదేశ్‌లో 35 సర్పంచ్, 245 వార్డు సభ్యుల స్థానాలకు నేడు జరుగుతున్న పోలింగ్‌లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం పెదపాడు మండలం వీరమ్మకుంటలో వైసీపీ, టీడీపీ కార్యకర్తలు పరస్పరం దాడులకు పాల్పడ్డారు. వైసీపీ కార్యకర్తలే తమపై దాడికి పాల్పడ్డారని టీడీపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి దగ్గురుండి దాడులు చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.కైకలూరు నియోజకవర్గం ముదినేపల్లి మండలం వణుదుర్రు పంచాయతీ ఎన్నికల్లోనూ అక్రమాలు జరుగుతున్నాయని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం బొప్పడంలో వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో గాయపడిన టీడీపీ కార్యకర్తలను ఆసుపత్రికి తరలించారు. కాగా, మధ్యాహం ఒంటిగంట వరకు పోలింగ్ జరగనుంది. రెండు గంటలకు ఓట్లు లెక్కించి విజేతను ప్రకటిస్తారు.

ఈ జిల్లాల్లో నేడు భారీ వర్షం

రాష్ట్రంలో శని, ఆదివారాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. వాయవ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ బెంగాల్‌-ఉత్తర ఒడిశా తీరాల్లో కొనసాగుతున్నదని తెలిపింది. ఇది పశ్చిమ-వాయవ్యం దిశగా కదులుతూ రాగ ల 2 నుంచి 3 రోజుల్లో ఉత్తర ఒడిశా, ఉత్తర ఛత్తీస్‌గఢ్‌ మీదుగా వెళ్లే అవకాశం ఉన్నదని పేర్కొన్నది.దిగువ స్థాయిలోని గాలులు పశ్చి మ, వాయవ్య దిశల నుంచి రాష్ట్రంలోకి వీస్తున్నాయని తెలిపింది. ఈ నేపథ్యంలో పలు ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. శనివారం ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని తెలిపింది. ఆదివారం ఉమ్మడి ఆదిలాబాద్‌తోపాటు నిజామాబాద్‌, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. సీఎస్‌ శాంతికుమారి ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాల పరిధిలోని కలెక్టర్లను అప్రమత్తం చేశారు. కలెక్టరేట్లలో కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేసి పర్యవేక్షించాలని ఆదేశించారు.

*  ఉత్తర్‌ప్రదేశ్‌ సీఎం కలవనున్న రజనీకాంత్‌

సూపర్ స్టార్ రజనీకాంత్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను కలిసేందుకు శనివారం లక్నో చేరుకున్నారు. ఈ సందర్భంగా లక్నో విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడుతూ.. దేవుడి దయవల్ల జైలర్ సినిమా విజయం సాధించిందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ సినిమాను యూపీ సీఎం యోగితో కలిసి చూసేందుకే తాను లక్నో వచ్చానని రజనీకాంత్ మీడియాకు తెలిపారు.ఇటీవల విడుదలైన రజనీ కొత్త సినిమా జైలర్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే.. ఈ సినిమాలోని ‘కావాలయ్యా.. ’ సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. జపాన్ లోని రజనీకాంత్ ఫ్యాన్స్ ఈ పాటకు అదిరిపోయే స్టెప్పులేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. జపాన్ అంబాసిడర్ కూడా ఈ పాటకు కాలుకదిపిన వీడియో వైరల్ గా మారింది. కాగా, సినిమా విడుదల రోజు హిమాలయాలకు వెళ్లిన రజనీకాంత్.. శుక్రవారం వరకూ వివిధ ఆలయాలను సందర్శిస్తూ గడిపారు. యూపీ సీఎంను కలిసి ‘జైలర్’ సినిమాను వీక్షించేందుకు రజనీ శనివారం లక్నో చేరుకున్నారు.

గన్నవరం ఎమ్మెల్యేకు తప్పిన ప్రమాదం

గన్నవరం(ఏపీ) ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్‌కి ప్రమాదం తప్పింది. ఆయన కాన్వాయ్‌ శనివారం ప్రమాదానికి గురైంది. అయితే ఈ ప్రమాదం నుంచి ఆయన సురక్షితంగానే బయటపడ్డారు.విజయవాడ నుంచి హైదరాబాదు వెళ్తున్న క్రమంలో.. సూర్యాపేట చివ్వెంల మండలం ఖాసీంపేట వద్ద కాన్వాయ్‌లోని వాహనాలు ఒకదానితో ఒకటి ఢీ కొట్టాయి. ఈ క్రమంలో ఎమ్మెల్యే ప్రయాణిస్తు‍న్న వాహనం సైతం ప్రమాదానికి గురైంది.

శ్రీవారి భక్తులకు మరో భయం

తిరుమలలో వన్యమృగాల సంచారం‌ పెరిగి‌పోయింది. గత కొద్ది రోజులుగా వన్యమృగాల సంచారంతో శ్రీవారి భక్తులు హడలి పోతున్నారు. రెండు రోజుల క్రితం చిరుతను అటవీ శాఖ అధికారులు బంధించినప్పటకీ, శుక్రవారం రాత్రి మొదటి ఘాట్ రోడ్డులోని ఎలిఫెంట్ ఆర్చ్ వద్ద మరొ‌సారి ట్రాప్ కెమెరాల్లో చిరుత దృశ్యాలు రికార్డు అయ్యాయి.. అయితే తిరుమలలోని స్పెషల్ టైప్ కాటేజీల దగ్గర ఏర్పాటు చేసినా ట్రాప్ కెమెరాల్లో ఎలుగుబంటి సంచారించే దృశ్యాలు రికార్డు అయ్యాయి. వన్యమృగాల సంచారం నేపధ్యంలో అప్రమత్తంమైన టీటీడీ అటవీ శాఖా అధికారులు ఎలిఫెంట్ ఆర్చి వద్ద చిరుతను బంధించేందుకు బోన్లను ఏర్పాటు చేయడంతో పాటుగా, స్పెషల్ టైప్ కాటేజీల వద్ద ఎలుగుబంటిని బంధించేందుకు వలలను ఏర్పాటు చేశారు.భక్తుల భధ్రత దృష్ట్యా టీటీడీ అప్రమత్తమైనప్పటికీ భక్తుల్లో మాత్రం ఆందోళన తగ్గడం లేదు. ఐతే ఈ ఏడాది జూన్ 22వ తారీఖున బాలుడిపై దాడి చేసిన చిరుత తీవ్రంగా గాయపరిచింది తెలిసిందే. ఈ ఘటనను మరిచి పోక ముందే బాలుడిపై దాడి చేసిన సమీప ప్రాంతంలోనే బాలికపై దాడి చేసిన చిరుత సమీపంలోని అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్ళి చంపేసింది. ఈ ఘటనతో శ్రీవారి భక్తుల్లో మరింత అందోళన పెరిగింది. ఈ క్రమంలో అలిపిరి నడక మార్గం, శ్రీవారి మెట్టు మార్గంలో, ఘాట్ రోడ్డులో టీటీడీ ఆంక్షలు విధించింది.. ఘాట్ రోడ్డులో ద్విచక్ర వాహనదారులకు సాయంత్రం 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకూ అనుమతిని నిరాకరించింది.అదే విధంగా అలిపిరి నడక మార్గంలో మధ్యాహ్నం రెండు గంటల వరకే 12 సంవత్సరాల లోబడిన చిన్నారులకు వారి తల్లిదండ్రులకు అనుమతిని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది..ఇక అలిపిరి, శ్రీవారి మెట్టు ప్రాంతంలో వన్యమృగాలు సంచరించే ప్రదేశాలను గుర్తించి, ఆ ప్రాంతంలో అటవీ శాఖ సిబ్బందితో పాటుగా, సెక్యూరిటీ సిబ్బందిని ఏర్పాటు చేసి భధ్రత కల్పిస్తుంది. మరోవైపు శ్రీశైలం అటవీ శాఖ నిపుణుల పర్యావేక్షణలో మరికొన్ని ప్రదేశాలను గుర్తించి ఆయా ప్రదేశాల్లో ట్రాప్స్ అమర్చుతున్నారు.

 బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల ప్రకటనకు ముహూర్తం ఫిక్స్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అధికార పార్టీ బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల ప్రకటనకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 21వ తేదీన మధ్యాహ్నం తెలంగాణ భవన్‌ నుంచి అభ్యర్థుల జాబితాను స్వయంగా ప్రకటించనున్నారు అధినేత కేసీఆర్‌. అభ్యర్థుల ఎంపిక కసరత్తు దాదాపు పూర్తికాగా.. 95 శాతం అభ్యర్థుల స్థానాలు సిట్టింగులకే ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కేవలం సింగిల్ డిజిట్ లోనే అభ్యర్థుల మార్పు ఉండనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఆసిఫాబాద్, ఉప్పల్, జనగామ, స్టేషన్ ఘాన్ పూర్, అంబర్ పేట, వరంగల్ తూర్పు,కొత్తగూడెం, ఖానాపూర్, పెద్దపల్లి, రామగుండం తదితర నియోజకవర్గాల్లో మార్పులు ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరోవైపు అసంతృప్తుల బుజ్జగింపులు కూడా దాదాపుగా పూర్తి అయినట్లే తెలుస్తోంది. 

జీహెచ్ఎంసీ అధికారులపై కిషన్ రెడ్డి ఆగ్రహం

జీహెచ్ఎంసీ అధికారులపై కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశం ఉందని తెలిసి ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవం ఎలా పెట్టుకుంటారని ప్రశ్నించారు కిషన్ రెడ్డి. రెండు రోజులుగా ముందు సమావేశం పెట్టుకొని మీటింగ్ కి డుమ్మా కొడతారా అని కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు.కనీసం సమావేశంలో సమాధానం చెప్పేవారు కూడా లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్వోబీ నిర్మాణానికి రైల్వే శాఖ ఒప్పుకున్నా.. జీహెచ్ఎంసీ అధికారులు సహకరించడం లేదని రైల్వే అధికారులు కిషన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. జీహెచ్ఎంసీ సహకారం లేకపోవడం వల్లనే పనులు పెండింగ్ లో పడుతున్నాయని కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రైల్వే పనులు చేసేందుకు సిద్ధంగా ఉన్నా అందుకు తగిన సహకారం ఉండటం లేదనే ప్రాజెక్ట్స్ పనులు ఆలస్యం అవుతున్నాయన్నారు.  హైదరాబాద్ కలెక్టర్ కు జీహెచ్ఎంసీ, రైల్వే సిబ్బందిని కోఆర్డినేట్ చేసుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు.