Food

జొన్నరొట్టెలతో లక్షలు ఆర్జిస్తున్న నాగర్‌కర్నూలు మహిళలు

జొన్నరొట్టెలతో లక్షలు ఆర్జిస్తున్న నాగర్‌కర్నూలు మహిళలు

జొన్న రొట్టెలకు నాగర్‌కర్నూల్‌ చిరునామాగా నిలుస్తోంది. ఉమ్మడి జిల్లాలో ఎక్కడా లేని విధంగా నాగర్‌కర్నూల్‌ పట్టణంలో కుటీర పరిశ్రమగా మారింది. మహిళలు రొట్టెల వ్యాపారం ఉత్సాహంగా నిర్వహిస్తున్నారు. జొన్న రొట్టెల తయారీతో పట్టణంలో 350కు పైగా కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నాయి. రహదారుల పక్కనే ఈ వ్యాపారం చేసేవారు కొందరైతే, ఇళ్ల వద్దనే తయారు చేసి సమీప పట్టణాలు, నగరాలకు సరఫరా చేసేవారు కొందరున్నారు. ప్రస్తుతం పట్టణ ప్రాంతాలలో రాత్రి వేళలో అన్నం బదులుగా జొన్న రొట్టెలు తినేవారి సంఖ్య అధికమవడంతో డిమాండ్‌ పెరిగింది. నాగర్‌కర్నూల్‌లో ప్రత్యేకంగా తయారు చేయించుకొని హైదరాబాద్‌కు తీసుకెళ్తుంటారు. ఒక్కో మహిళ రోజుకు రెండు వందల నుంచి మూడు వందల వరకు రొట్టెలు తయారు చేస్తుంటారు. జిల్లా కేంద్రంగా ఏర్పడిన తర్వాత ఈ వ్యాపారం మరింత అధికమైంది. కొందరు రొట్టెలతో పాటు చికెన్‌ చట్నీలను తయారు చేయించుకొని అమెరికా, ఆస్ట్రేలియాకు పంపిస్తుంటారు. నాగర్‌కర్నూల్‌లో రోజుకు రూ.5 లక్షల నుంచి ఆరు లక్షల వరకు ఈ వ్యాపారం సాగుతోంది.

ఒకే ఇంట్లో ముగ్గురు మహిళలు.. : నాగర్‌కర్నూల్‌ పట్టణంలోని సుభాష్‌ నగర్‌ కాలనీలో నివాసం ఉంటున్న ఒకే కుటుంబానికి చెందిన రూప, రాధ, కవిత రోజు ఉదయం నాలుగు గంటల నుంచి 11 గంటల వరకు జొన్న రొట్టెలు తయారు చేస్తారు. ఒక్కొక్కరు మూడు వందల వరకు సిద్ధం చేస్తారు. వ్యాపారులు ఇంటి వద్దకే వచ్చి రూ.8లకు ఒక రొట్టె చొప్పున కొనుగోలు చేసి తీసుకెళ్తారు. వారు బయట రూ.15 చొప్పున విక్రయిస్తుంటారు. ప్రతి శనివారం హైదరాబాద్‌కు వందల రొట్టెలు తీసుకెళ్తారు. నాగర్‌కర్నూల్‌ చుట్టూ పక్కన నిర్వహించే జాతర్లకు పెద్ద సంఖ్యలో వీటిని తీసుకెళ్తుంటారు. కొందరు అమెరికాలో ఉండే తమ బంధువులకు సంక్రాతి సమయంలో నువ్వుల రొట్టెలను నాగర్‌కర్నూల్‌లో ప్రత్యేకంగా తయారు చేయించి పంపిస్తారు. ఒక్కక్కరు నెలకు అన్ని ఖర్చులు పోను రూ.30వేలు సంపాదిస్తున్నారు.

పట్టణంలోని నల్లవెల్లి రోడ్డులో జ్యోతి అనే మహిళ ఆరేళ్లుగా ఈ వ్యాపారం చేస్తున్నారు. తిమ్మాజిపేట మండలం మారేపల్లికి చెందిన జ్యోతి నాగర్‌కర్నూల్‌కు వచ్చి ఈ వ్యాపారం ప్రారంభించారు. ఇక్కడ తయారు చేసే రొట్టెలు స్థానికంగా ఉద్యోగులతో పాటు హైదరాబాద్‌కు సరఫరా అవుతున్నాయి. నెలకు ఆరు వేల రొట్టెలను తయారు చేస్తుంటారు. ఇక్కడ రొట్టెలతో పాటు చికెన్‌ చట్నీలు పెట్టిస్తారు. ఇక్కడి నుంచి ఆమెరికాలో ఉండే తమ బంధువులు, పిల్లలకు చికెన్‌ చట్నీలు పెట్టించుకొని పంపిస్తారు. ఈ వ్యాపారంతోనే తాను తన మొదటి అమ్మాయికి వివాహం చేయటంతో పాటు రెండో అమ్మాయిని బీ ఫార్మసీ చదివిస్తున్నట్లు జ్యోతి ఆత్మవిశ్వాసంతో పేర్కొన్నారు.

నేను ఇంటి దగ్గరే రొట్టెల తయారీతో నెలకు రూ.40 వేల వరకు సంపాదిస్తున్నాను. 12 ఏళ్లుగా రొట్టెలు తయారు చేస్తున్నా. వినియోగదారులు ఇంటికే వచ్చి తీసుకెళ్తారు. రోజుకు 100 నుంచి 150 రొట్టెల వరకు విక్రయిస్తుంటాను. రొట్టెల వ్యాపారంతో ఇంటి ఖర్చులు వెళ్లిపోతున్నాయి. రొట్టెల తయారీతో కుటుంబాన్ని పోషించుకోగలుతున్నా.. నా కుటుంబానికి మంచి జీవనోపాధిగా మారింది. వినియోగదారుల ఆదరణ దృష్ట్యా వ్యాపారాన్ని విస్తరించాలనుకుంటున్నాను అని పుష్పవతి పేర్కొన్నారు.