Politics

పాంగాంగ్‌ సరస్సుకు బైక్‌ పై వెళుతున్న రాహుల్

పాంగాంగ్‌ సరస్సుకు బైక్‌ పై వెళుతున్న రాహుల్

కేంద్ర పాలిత ప్రాంతం లద్దాఖ్‌ (Ladakh)లోని లేహ్‌ (Leh)లో పర్యటిస్తున్నారు కాంగ్రెస్‌ (Congress) అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi). ఈ సందర్భంగా భారత్‌-చైనా సరిహద్దుల్లోని పాంగాంగ్‌ సరస్సు (Pangong Lake)కు శనివారం ఆయన బైక్‌ రైడ్‌ చేపట్టారు. రైడ్‌ ప్రారంభానికి ముందు రాహుల్‌ మాట్లాడుతూ.. ‘‘ప్రపంచంలోనే అత్యంత అందమైన ప్రదేశాల్లో పాంగాంగ్‌ సరస్సు ఒకటి అని మా నాన్న (రాజీవ్‌ గాంధీ) చెప్పేవారు’’ అని అన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను కాంగ్రెస్‌ తమ ఎక్స్‌ (ట్విటర్‌) ఖాతాలో పంచుకుంది.ఈ రాత్రికి ఆయన పాంగాంగ్‌ సరస్సు వద్ద ఉన్న టూరిస్ట్‌ క్యాంప్‌లో బస చేయనున్నట్లు కాంగ్రెస్‌ వర్గాలు వెల్లడించాయి. ఆగస్టు 20న తన తండ్రి, మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ (Rajiv Gandhi) జయంతిని రాహుల్‌ ఈ సరస్సు వద్దే చేసుకోనున్నట్లు సదరు వర్గాలు పేర్కొన్నాయి. గత గురువారం రాహుల్‌ లేహ్‌ పర్యటనకు వచ్చారు. తొలుత రెండు రోజుల పాటే ఇక్కడ ఉండాలని భావించినా.. ఆగస్టు 25 వరకు తన పర్యటనను పొడిగించుకున్నారు. 2019లో ఆర్టికల్‌ 370ని రద్దు చేసిన తర్వాత రాహుల్‌ లద్దాఖ్‌కు రావడం ఇదే తొలిసారి. శుక్రవారం ఆయన లేహ్‌లోని యువతతో ముచ్చటించారు.

సెప్టెంబరు 10న లద్దాఖ్‌ అటానమస్‌ హిల్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌ (LAHDC) – కార్గిల్‌ (Kargil) ప్రాంతంలో కౌన్సిల్‌ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ (Congress).. స్థానిక నేషనల్‌ కాన్ఫరెన్స్‌ (NC) పార్టీతో పొత్తు పెట్టుకుంది. ఈ క్రమంలో రాహుల్‌.. లేహ్‌ పర్యటనకు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. పర్యటనలో భాగంగా ఆయన స్థానిక కాంగ్రెస్‌ నేతలతో సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.