ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా సన్స్ చైర్మన్ ఎమిరిటస్ రతన్ టాటాను మమారాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ రత్న అవార్డుతో సత్కరించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రులు అజిత్ పవార్, దేవేంద్ర ఫడ్నవీస్ శనివారం రతన్ టాటా నివాసంలో ఉద్యోగ రత్న అవార్డుతో సత్కరించారు. రతన్ టాటా ఆరోగ్య సమస్యలతో బాధపడపడుతుండగా ఇంటి వద్దనే అవార్డును సీఎం అందజేశారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే మాట్లాడుతూ.. రతన్ టాటా, టాటా గ్రూప్స్ దేశానికి ఎనలేని సేవలందించాయన్నారు.
మహారాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అవార్డును స్వీకరించిన రతన్ టాటాకు ధన్యవాదాలు తెలిపారు. మహారాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా ‘ఉద్యోగ రత్న’ అవార్డును తీసుకువచ్చింది. జులై 28న రతన్ టాటాకు ఈ అవార్డును ప్రదానం చేయనున్నట్లు ఆ రాష్ట్ర పరిశ్రమల మంతి ఉదయ్ సామంత్ ప్రకటించారు. విశిష్ట వ్యక్తులకు ఇచ్చే మహారాష్ట్ర భూషణ్ అవార్డు మాదిరిగానే రతన్ టాటాను ఉద్యోగ రత్న అవార్డుతో సత్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అజిత్ పవార్, పరిశ్రమల శాఖ మంత్రితో కూడిన కమిటీ సమావేశమై ఈ నిర్ణయం తీసుకుంది.