Politics

మైనార్టీలకు నేటి నుంచి లక్ష రూపాయల సాయం

మైనార్టీలకు నేటి నుంచి లక్ష రూపాయల సాయం

సకల జనుల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. ఇప్పటికే దళితుల కోసం దళితబంధు, బీసీ కులాల వృత్తిదారులకు రూ.లక్ష సాయం అందిస్తున్న రాష్ట్ర సర్కార్‌.. ప్రస్తుతం మైనార్టీలకూ ఆర్థిక సాయం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా నేటి నుంచి మైనార్టీలకు రూ.లక్ష సాయం పంపిణీని చేపట్టనున్నారు. ఈ కార్యక్రమం నిరంతరంగా కొనసాగనుండగా.. తొలి విడుతలో భాగంగా రంగారెడ్డి జిల్లాలో 584 మంది, వికారాబాద్‌ జిల్లాలో 240 మందికి రూ.లక్ష చొప్పున సాయం అందించేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. రాజేంద్రనగర్‌ నియోజకవర్గంలోని శంషాబాద్‌లో శనివారం ఈ కార్యక్రమాన్ని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి శ్రీకారం చుట్టనుండగా.. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ప్రారంభించనున్నారు. ప్రత్యేక కౌంటర్లు ఏర్పాట్లు చేసి లబ్ధిదారులకు చెక్కుల రూపంలో ఆర్థిక సాయం అందజేయనున్నారు. మైనార్టీ చేతివృత్తిదారులు, చిరు వ్యాపారులకు పనిముట్లు, ముడి సరుకుల కొనుగోలు, ఆధునీకరణ పనుల నిమిత్తం ప్రభుత్వం ఈ ఆర్థిక సాయం అందిస్తున్నది.

మైనార్టీలకు రూ.లక్ష సాయం చెక్కుల పంపిణీ నేటి నుంచి ప్రారంభం కా నున్నది. ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. మైనార్టీల్లోని చిరు వ్యాపారులకు ప్రభుత్వం నూరు శాతం సబ్సిడీతో ఈ సాయం అందిస్తున్నది. గతంలో మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ కింద రుణం కోసం జిల్లాలో 640 మంది దరఖాస్తు చేసుకోగా.. రూ. లక్ష సాయం పథకానికి 13వేల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. రూ.లక్ష సాయం అందజేత ప్రక్రియ నిరంతరం కొనసాగనున్నది. అయితే తొలి విడుతలో ఎంపిక చేసిన 584 మందికి లక్ష చొప్పున చెక్కులు ఇవ్వనున్నారు. రాజేంద్రనగర్‌ నియోజకవర్గంలోని శంషాబాద్‌లో శనివారం ఈ కార్యక్రమానికి రాష్ట్ర విద్యాశాఖ మం త్రి సబితాఇంద్రారెడ్డి శ్రీకారం చుట్టనుండగా..ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ప్రారంభించనున్నారు.

సకల జనుల సంక్షేమమే ధ్యేయంగా..
సకల జనుల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. దళితబంధు, బీసీ కుల సంఘాలకు అందిస్తున్న మాదిరిగానే మైనార్టీలకు కూడా ప్రభుత్వం ఆర్థిక సాయాన్ని పంపిణీ చేస్తున్నది. మైనార్టీల్లో అనేక మంది చేతివృత్తులు, చిరువ్యాపారాలు చేస్తూ జీవిస్తున్నారు. వీరందరికీ వందశాతం సబ్సిడీతో రూ.లక్ష సాయం అందించి కొండంత భరోసా కల్పిస్తున్నది. 21నుంచి 55 ఏండ్లలోపు వారే ఈ పథకానికి అర్హులు. బీసీలకు అందజేసిన విధంగానే పనిముట్లు, ముడిసరుకు కొనుగోలు, ఆధునీకరణ పనులకు మాత్రమే ఆర్థిక సాయం అందజేస్తున్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో మైనార్టీ కార్పొరేషన్‌ ద్వారా ఎకనామిక్‌ సపోర్ట్‌ పథకం కింద అర్హులకు సబ్సిడీ రుణాలు అందించేందుకు అవకాశం కల్పించగా.. జిల్లావ్యాప్తంగా 640 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో కొంత సబ్సిడీగా, మిగతాది బ్యాంకు రుణం గా అందజేసేందుకు అప్పట్లో ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. అయితే కొన్ని కారణాలతో ఆ దరఖాస్తులు పెండింగ్‌లో ఉండిపోయాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం అర్హులైన మైనార్టీలందరికీ రూ.లక్ష సాయాన్ని పూర్తి సబ్సిడీ కింద అందజేయాలని నిర్ణయించింది.

ఈ మేరకు దరఖాస్తులను కోరగా జిల్లాలో 13వేలకుపైగా వచ్చాయి. అయితే గతంలో మైనార్టీ కార్పొరేషన్‌ కింద దరఖాస్తు చేసుకున్న వారికి ప్రాధాన్యత ఇవ్వాలని భావించి అందులో నుంచే లబ్ధిదారులను 584 మందిని ఎంపిక చేసి తొలి విడుతలో చెక్కులను అందజేయనున్నారు. తదుపరి విడుతల్లో జనాభా నిష్ప త్తి ప్రతిపాదికన లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. జిల్లాలో 3,61,073 మంది మైనార్టీ జనాభా ఉండగా..ప్రతి నియోజకవర్గం నుంచి 120 మందిని ఎంపిక చేసి రూ.లక్ష సాయాన్ని నిరంతర ప్రక్రియగా ప్రభుత్వం అందించనున్నది.

మైనార్టీలకు ఇతోధికంగా చేయూత
మైనార్టీల ఆర్థిక, సామాజిక, విద్య, ఉపాధి కల్పనతోపాటు సంస్థాగత అభివృద్ధే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం అనేక వినూత్న కార్యక్రమాలకు రూపకల్పన చేసి సమర్థవంతంగా అమలు చేస్తున్నది. జిల్లాలో ఉన్న తొమ్మిది మైనార్టీ గురుకుల పాఠశాలల్లో 3,760 మందికి, మరో తొమ్మిది జూనియర్‌ కళాశాలల్లో 5,200 మందికి విలువలతో కూడిన కార్పొరేట్‌ స్థాయి విద్యను ప్రభుత్వం అందిస్తున్నది. తొమ్మిదేండ్లలో రూ.402 కోట్లను ఉపకార వేతనాలుగా చెల్లించగా..గతేడాది ఒక్క సంవత్సరంలోనే 17వేల మంది మైనార్టీ విద్యార్థులకు రూ.47 కోట్లను ఉపకార వేతనంగా అందజేసింది. ముఖ్యమంత్రి ఓవర్సీస్‌ విద్యానిధి ద్వారా ఇప్పటివరకు 155 మంది విద్యార్థులకు రూ. 26.53 కోట్ల ఆర్థిక సాయాన్ని అందించింది. మైనార్టీల్లో పేదరికాన్ని , వెనుకబాటు తనాన్ని తగ్గించేందుకు చేతివృత్తులు, చిరు వ్యాపారాలు చేస్తున్న వారికి రాష్ట్ర క్రిస్టియన్‌ మైనార్టీస్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ద్వారా 109 మం దికి రూ.1.58 కోట్ల రుణాలు, మైనార్టీస్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ద్వారా 667 మంది లబ్ధిదారులను గుర్తించి రూ.5.40 కోట్లను రుణంగా అందజేసింది. అన్ని వర్గాలను సమాన దృష్టితో చూస్తూ వారి సం స్కృతులు, ఆచార సంప్రదాయాలను గౌరవిస్తూ వస్తున్న రాష్ట్ర ప్రభుత్వం రంజాన్‌ పండుగ సందర్భాల్లో మైనార్టీలకు కానుకలు, ఇఫ్తార్‌ విందు వంటి కార్యక్రమాలను చేపడుతున్నది. మైనార్టీల సంక్షే మం కోసం ప్రభుత్వం చేపడుతున్న చర్యలతో జిల్లాలోని మైనార్టీ వర్గాలు, వారి కుటుంబాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

వికారాబాద్‌ 240 మందికి..
ఆర్థికంగా వెనుకబడిన వర్గాలను బలోపేతం చేయాలనే లక్ష్యంతో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ముందుకెళ్తున్నది. ఇందులో భాగంగానే ఇప్పటికే బీసీలకు ఆర్థిక చేయూతనందిస్తుండగా, నేటి నుంచి మైనార్టీలకు కూడా రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయాన్ని అం దించనున్నది. అయితే మొదటి విడుత పంపిణీలో భాగంగా నేడు పరిగి నియోజకవర్గంలో అర్హులైన 60మంది మైనార్టీల కు రూ.లక్ష చొప్పున సాయం అందనున్నది. మిగిలిన నియోజకవర్గాల్లో మరో రెండు రోజుల్లో ఈ ప్రక్రియ ప్రారంభం కానున్నది. అయితే మొదటి విడుతలో ప్రతి నియోజకవర్గానికీ 60 మంది చొప్పున 240 మంది మైనార్టీలకు రూ.లక్ష చొప్పున సాయం అందజేయనుండగా.. రెండో విడుతలో నియోజకవర్గానికీ 120 మంది చొప్పున నాలుగు నియోజకవర్గాల్లోని 480 మంది మైనార్టీలకు సాయం పంపిణీ కానున్నది. అయితే పేదల బంధువుగా పేరొందిన సీఎం కేసీఆర్‌ మైనార్టీలకు వందశాతం సబ్సిడీతో రూ. లక్ష ఆర్థిక సా యాన్ని అందిస్తుండటంతో మైనార్టీలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే 2023 జూన్‌ 2 నాటికి 21 ఏండ్లు నిండి 55 ఏండ్ల మధ్య ఉన్న మైనార్టీలు మాత్రమే ఈ పథకానికి అర్హులు గా ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామీణ ప్రాంతాల్లోని వారి వార్షిక ఆదాయం రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో అయితే రూ.2 లక్షలకు మించరాదని ప్రభుత్వం నిబంధన పెట్టింది. అదే విధంగా బీసీ కులవృత్తుల మాదిరిగానే కుటుంబంలో ఒక్కరికీ రూ.లక్ష సాయం అందనున్నది. కలెక్టర్‌ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి మానిటరింగ్‌ కమిటీ సభ్యులు జిల్లా ఇన్‌చార్జి మంత్రి సబితాఇంద్రారెడ్డి ఆమోదంతో లబ్ధిదారులను ఎంపిక చేశారు. జిల్లావ్యాప్తంగా రూ.లక్ష సహాయానికి 7 వేలకుపైగా మైనార్టీలు దరఖాస్తు చేసుకున్నారు.

ప్రత్యేక కౌంటర్ల ఏర్పాటు
శంషాబాద్‌లోని బేగం ఫంక్షన్‌హాల్‌లో శనివారం తొలివిడుత రూ.లక్ష సాయం చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా మంత్రి సబితాఇంద్రారెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు. దీనికి జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలను మైనార్టీ సంక్షేమ శాఖ ఆహ్వానించింది. వారు తమ తమ నియోజకవర్గాలకు చెందిన లబ్ధిదారులకు చెక్కుల ను అందజేయనున్నారు. మిగతా వారికి మైనార్టీ శాఖ అధికారులు పంపిణీ చేయనుండగా ఇందుకోసం ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. దరఖాస్తులను మరోసారి పరిశీలించి చెక్కులను అందించేందుకు ప్రత్యేక సిబ్బందినీ నియమించారు.