శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారి మంగళ శాసనములతో జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ సింగపూర్ ఆధ్వర్యంలో సింగపూర్‌లో శ్రీయాగం జరగనుంది. సింగపూర్‌లో విజయయాత్ర చేయనున్న చిన్న జీయర్ వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో పవిత్ర శ్రావణ మాసంలో శ్రీ యాగం, వరలక్ష్మి పూజ, శ్రీ సీతా రామ కళ్యాణం మొదలైన సేవలు ఈనెల 24 నుండి 26 వరకు మూడు రోజుల పాటు స్ధానిక శ్రీ శ్రీనివాస పెరుమాళ్ దేవాలయ ప్రాంగణంలో వైభవోతంగా జరగడానికి సన్నాహక పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. కళ్యాణోత్సవంలో పాల్గొనే భక్తులు స్వయంగా తమ స్వహస్తాలతో పంచలోహమూర్తులకు కళ్యాణం జరిపించి వాటిని ఇంటికి తీసుకొనేట్లుగా ఏర్పాట్లు చేస్తున్నారు.శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రమైన శ్రవణా నక్షత్రం పేరుతో ఏర్పడిన శ్రావణమాసం శ్రీమహావిష్ణువు పూజకు ఉత్కృష్టమైన మాసం కావున మహావిష్ణువుకు, మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైన వివిధ వ్రతాలు, పూజలు ఆచరించడం వలన విశేష ఫలితాలు, సకల సౌభాగ్యాలను ప్రసాదించే దివ్యమైన మాసం అని అందరికీ తెలిసినదే. అటువంటి పుణ్యప్రథమైన రోజులలో లోక కళ్యాణం, విశ్వశాంతి లక్ష్యంగా చక్కని ఆధ్యాత్మిక అనుభవాన్ని భక్తులకు అందించాలని సదుద్ధేశ్యంతో నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో భగవద్బంధువులు విరివిగా ఈ పాల్గొని తరించి, విశేష శుభములు పొందగలరని నిర్వాహకులు అందరినీ ఆహ్వానిస్తున్నారు.