Sports

పారిస్ ఒలంపిక్స్‌లో ఈతల పోటీ రద్దు?

పారిస్ ఒలంపిక్స్‌లో ఈతల పోటీ రద్దు?

వచ్చే ఏడాది పారిస్‌ ఒలింపిక్స్‌ కోసం సిద్ధమవుతున్న నిర్వాహకులకు ఎదురు దెబ్బ తగిలింది. పారాట్రయథ్లాన్‌లో భాగంగా ప్రముఖ సెన్‌ నదిలో నిర్వహించాల్సిన ఒలింపిక్స్‌ స్విమ్మింగ్‌ టెస్టు ఈవెంట్‌ను రద్దు చేశారు. ఆ నదిలో నీటి నాణ్యత పేలవంగా ఉండడమే అందుకు కారణం. దీంతో కేవలం పరుగు, బైకింగ్‌ విభాగాల్లో మాత్రమే పోటీలు నిర్వహించారు. గురు, శుక్రవారాల్లో ఈ నదిలో స్విమ్మర్లు పోటీపడ్డారు. కానీ నీటి నాణ్యత పరీక్షల్లో ఫలితాలు ప్రతికూలంగా రావడంతో శనివారం ఈవెంట్‌ను రద్దు చేశారు. అథ్లెట్ల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టకూడదనే ఉద్దేశంతో ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఆదివారం మరోసారి నీటి నాణ్యత పరీక్షలు నిర్వహించిన తర్వాత.. స్విమ్మింగ్‌ పోటీలు పెట్టాలా? వద్దా? అనేది నిర్ణయించనున్నారు. అంతకంటే ముందు ఈ నెల ఆరంభంలో జరగాల్సిన టెస్టు ఈవెంట్‌ కూడా రద్దయింది. భారీ వర్షాల కారణంగా నదిలో శుద్ధి చేయని వ్యర్థాలు పొంగి పొర్లడంతో అప్పుడు రద్దు చేశారు. ఒలింపిక్స్‌ తర్వాత ఈ నదిలో తిరిగి ఈత కొట్టేందుకు ప్రజలను అనుమతించాలనే ఉద్దేశంతో అక్కడి అధికారులున్నారు. కానీ ఇప్పుడు నీటి నాణ్యత విషయం ఇబ్బందిగా మారింది.