యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates) సందర్శకుల కోసం ఈ ఏడాది మేలో పున:ప్రారంభించిన 3నెలల కాలపరిమితితో కూడిన విజిట్ వీసా (Visit visa) కు భారీ డిమాండ్ ఉందని ట్రావెల్ ఏజెంట్లు చెబుతున్నారు. రోజుకీ కనీసం 20 దరఖాస్తులు అందుతున్నట్లు వెల్లడించారు. మహమ్మారి కరోనా కారణంగా 2020లో ఈ మూడు నెలల వ్యవధితో కూడిన విజిట్ వీసాను అక్కడి సర్కార్ నిలిపివేసింది. దీని స్థానంలో 60రోజుల కాలపరిమితితో కూడిన విజిట్ వీసాను తీసుకొచ్చింది. కానీ, కోవిడ్ ప్రభావం తగ్గుముఖం పట్టడంతో గత మే నుంచి ఈ వీసాను తిరిగి జారీ చేస్తోంది.
ఇక ఈ వీసా ద్వారా సందర్శకులు (Visitors) యూఏఈలో 90 రోజుల వరకు బసచేసే వీలు ఉంటుంది. ప్రధానంగా దీర్ఘకాలిక వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారిలో ఎక్కువ కాలం యూఏఈలో గడపాలనుకునే పర్యాటకులు, ఆ దేశ నివాసితుల పేరెంట్స్/ పిల్లలు/ కుటుంబ సభ్యులు, యూఏఈలో స్థిరపడాలనుకునే సందర్శకులు 3నెలల వీసాకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తాహిరా టూర్స్ అండ్ ట్రావెల్స్ యజమాని ఫిరోజ్ మలియక్కల్ తెలిపారు.
ఎవరు అర్హులంటే..ఇక నిపుణుల అభిప్రాయం ప్రకారం 90రోజుల వ్యవధితో కూడిన వీసాలు రెండు కేటగిరీలుగా ఉంటాయి. వెయ్యి దిర్హమ్స్ డిపాజిట్ చేయడం ద్వారా నివాసి కుటుంబ సభ్యులు, మిత్రులను స్పాన్సర్ చేయవచ్చు. స్పాన్సర్ కనీస జీతం 6వేల నుంచి 8వేల దిర్హమ్స్ వరకు ఉంటే సరిపోతుంది. అలాగే రెండో వర్గం వారి స్పాన్సర్‌గా ట్రావెల్ ఏజెంట్స్ ఉంటారు. పాస్‌పోర్ట్ కాపీ, ఫొటోలు మాత్రమే అవసరం అవుతాయి. మొదటి కేటగిరీ వీసా కోసం వీసా వెల సుమారు 800 నుంచి 1000 దిర్హమ్స్ తిరిగి చెల్లించదిగిన డిపాజిట్‌తో ఉంటుంది. అధికారిక ఇమ్మిగ్రేషన్ వెబ్‌సైట్‌లలో దరఖాస్తు చేసుకోవచ్చు.
రెండో కేటగిరీ కోసం పర్యాటకులు ట్రావెల్ ఏజెంట్ (Travel Agent) ద్వారా 1200 నుంచి 1400 దిర్హమ్స్ వరకు ధరతో దరఖాస్తు చేసుకోవాలని లగ్జరీ ట్రావెల్స్‌లోని వీసా కన్సల్టెంట్ అయిన పవన్ పూజారి వెల్లడించారు. ఎవరైన దీనికోసం దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. అలాగే ఈ వీసా అనేది దుబాయి, అబుదాబిలో మాత్రమే చెల్లుబాటు అవుతుంది.