Business

నేటి నుంచి భారీగా తగ్గనున్న ఉల్లి ధర

నేటి నుంచి భారీగా తగ్గనున్న ఉల్లి ధర

ఉల్లి ధరల పెరుగుదల నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు జాతీయ సహకార వినియోగదారుల సమాఖ్య (ఎన్‌సీసీఎఫ్‌) రంగంలోకి దిగుతోంది. ఈ మేరకు దేశ రాజధాని నగరం దిల్లీ వాసులకు తక్కువ ధరకే ఉల్లిపాయలను సరఫరా చేయాలని నిర్ణయించింది. సోమవారం నుంచి రాయితీపై కిలో ఉల్లిని రూ.25కే సరఫరా చేస్తామని వెల్లడించింది. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం 3 లక్షల టన్నుల ఉల్లిని ఈ ఏడాది కోసం బఫర్‌గా ఉంచగా.. మరో 2 లక్షల టన్నులు అదనంగా సేకరించాలని నిర్ణయించింది. దిల్లీలో రాయితీపై ఉల్లి విక్రయాలను సోమవారం నుంచే ప్రారంభిస్తామని ఎన్‌సీసీఎఫ్‌ ఎండీ అనిస్‌ జోసెఫ్‌ చంద్ర తెలిపారు. దిల్లీ, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, హిమాచల్‌ప్రదేశ్‌, అస్సాం రాష్ట్రాల్లో ఉల్లి ధరల పెరుగుదలకు అడ్డుకట్ట వేయాల్సి అవసరం ఉందని ప్రభుత్వం గుర్తించింది. బఫర్‌ స్టాక్‌గా ఉల్లిపాయలను ఈ రాష్ట్రాల్లోని టోకు, చిల్లర మార్కెట్‌లలోకి విడుదల చేయడం ద్వారా లభ్యతను పెంచనుంది.