కాంగ్రెస్ అత్యున్నత నిర్ణాయక మండలి (సీడబ్ల్యూసీ)లో తమకూ సభ్యత్వం దక్కుతుందని ఆశలు పెట్టుకున్న రాష్ట్ర సీనియర్ నేతలకు నిరాశే మిగిలింది. ఒకరిద్దరు సీనియర్ నేతల పేర్లను సభ్యత్వం కోసం పార్టీ పరిశీలించినా ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చివరి క్షణంలో పక్కన పెట్టినట్లు సమాచారం. కొందరు సీనియర్ నేతలు దిల్లీ వెళ్లినప్పుడల్లా తమకు చోటు కల్పించాలని అధిష్ఠానానికి విన్నవించినట్లు తెలుస్తోంది. రేవంత్‌రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిగా నియమించిన సమయంలో ఈ పదవి రాలేదని అసంతృప్తి వ్యక్తం చేసిన ఒకరిద్దరు నేతలు దీనిపై ఆశలు పెట్టుకున్నారు. ఇతర రాష్ట్రాలకు పార్టీ ఇన్‌ఛార్జి లేదా సీడబ్ల్యూసీలో సభ్యత్వం ఏదో ఒకటి ఇవ్వాలని పలుమార్లు అధిష్ఠానానికి కొందరు విన్నవించినట్లు సమాచారం. ‘తెలంగాణలోని పార్టీ సీనియర్లలో ఐక్యత తప్పనిసరి అని, ఎన్నికల సమయంలో ఎలాంటి విభేదాలు ఉండకుండా పనిచేయాలని పార్టీ గట్టిగా భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఎవరో ఒకరికి ప్రాధాన్యమిచ్చినట్లు ప్రచారం జరగకుండా, కొత్తగా అసంతృప్తులు తలెత్తకుండా అడ్డుకోవడానికే సీడబ్ల్యూసీలో ఈ రాష్ట్ర నేతలకు సభ్యత్వం ఇవ్వలేదు’ అని సీనియర్ నేత ఒకరు వివరించారు. తాజాగా ఎమ్మెల్యే జగ్గారెడ్డి తనను కాంగ్రెస్‌లో ఉండకుండా చేయాలని కొందరు పార్టీ నేతలే సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేయడంతో పార్టీలో విభేదాలు మరోసారి బయటపడ్డాయి. సీడబ్ల్యూసీలో చోటు దక్కినవారికి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క శుభాకాంక్షలు తెలిపారు.
CWCలో తెలంగాణా కాంగ్రెస్ నేతలకు మొండిచేయి
Related tags :