DailyDose

బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాపై కేసు కొట్టివేత-TNI నేటి తాజా వార్తలు

బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాపై కేసు కొట్టివేత-TNI నేటి తాజా వార్తలు

* బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాపై కేసు కొట్టివేత

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఎన్నికల ప్రసంగానికి సంబంధించి నమోదైన కేసులో క్రిమినల్ ప్రొసీడింగ్‌లను కర్ణాటక హైకోర్టు రద్దు చేసింది. ఆరోపణలపై అసంబద్ద కేసు నమోదు చేశారని కోర్టు పేర్కొంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు విజయపుర ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ సభలో.. ‘బీజేపీ మరోసారి అధికారంలోకి రాకపోతే, ఇప్పటివరకు అందుకుంటున్న సంక్షేమ పథకాలన్నీ ఆగిపోతాయని ఓటర్లను బెదిరించినట్లు మాట్లాడారని నడ్డాపై స్థానిక పోలీసుస్టేషన్‌లో ఎన్నికల అధికారి ఫిర్యాదు చేశారు. ఈ కేసుకి సంబంధించి స్థానిక మేజిస్ట్రేట్ అనుమతి ఇవ్వడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నిర్ణయాన్ని నడ్డా హైకోర్టులో సవాలు చేశారు. ఈ కేసును విచారించిన హైకోర్టు.. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని పేర్కొనడానికి బదులుగా.. నేరానికి పాల్పడినట్లు కేసు నమోదు చేశారని పోలీసులను ఆక్షేపించింది. దీనిని అధికారుల నిర్లక్ష్యంగా అభివర్ణించిన కోర్టు.. నిందితునిపై క్రిమినల్‌ చర్యలకు అనుమతిస్తే అది చట్టవిరుద్ధం అవుతుందని పేర్కొంటూ కేసును కొట్టివేసింది. ఇందుకు సంబంధించిన తీర్పు వివరాలు ఆదివారం బయటకొచ్చాయి.బీజేపీకి ఓటు వేయకపోతే కేంద్ర పథకాల ప్రయోజనాలను కోల్పోతారని నడ్డా ఎన్నికల బహిరంగ సభలో ఓటర్లను బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మే 9న కేసు నమోదు చేయబడిన ఫిర్యాదు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిందని ఆరోపిస్తూ ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. సెక్షన్ 171ఎఫ్ కింద మే 9న హరపనహళ్లి పోలీస్ స్టేషన్‌లో ఎన్నికల అధికారి ఫిర్యాదు చేశారు. ఈ సెక్షన్ కింద కేసు నాన్-కాగ్నిజబుల్ నేరం. బీజేపీకి ఓటు వేయకపోతే కేంద్ర పథకాల ప్రయోజనాలను కోల్పోతామని జేపీ నడ్డా బహిరంగ సభలో ఓటర్లను హెచ్చరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయాన్ని మేజిస్ట్రేట్‌కు సూచించగా, ఆయన ఎఫ్‌ఐఆర్‌ నమోదుకు అనుమతించారు. దీంతో జేపీ నడ్డా హైకోర్టులో సవాల్ చేశారు. నడ్డా లాయర్ మరియు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు విన్న తర్వాత, ఆరోపణలు అస్పష్టంగా ఉన్నాయని జస్టిస్ ఎం నాగప్రసన్న అన్నారు. పిటిషనర్ తరపున 2023 మే 7న జరిగిన బహిరంగ సభలో ఓటర్లను బెదిరించడం ద్వారా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘించారనేది ఆరోపణ అని ఆయన అన్నారు. ఫిర్యాదు పూర్తిగా అస్పష్టంగా ఉందని.. అస్పష్టమైన ఫిర్యాదుతో పిటిషనర్‌పై కేసు నమోదు చేసినట్లు న్యాయమూర్తి తెలిపారు. నడ్డా మోడల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని, ఎలాంటి వివరాలను పేర్కొనలేదని ఫిర్యాదు కాపీని హైకోర్టు ఉదహరించింది. క్రిమినల్ ప్రొసీడింగ్‌లను అనుమతించడం చట్టాన్ని దుర్వినియోగం చేసినట్లేనని కోర్టు పేర్కొంది.”పై వాస్తవాల ఆధారంగా పిటిషనర్‌పై తదుపరి దర్యాప్తును కొనసాగించడానికి అనుమతించినట్లయితే, ప్రాథమికంగా కనిపించే నేరానికి సంబంధించి నిర్లక్ష్యంగా నమోదైన కేసులో దర్యాప్తును అనుమతించడానికి ఇది ఒక క్లాసిక్ ఉదాహరణగా నిలుస్తుంది. చట్ట ప్రక్రియ యొక్క దుర్వినియోగం.” ఒక కేసులో సుప్రీంకోర్టు తీర్పును ఉటంకిస్తూ, సుప్రీం కోర్టు నిర్దేశించిన ఏడు ప్రాథమిక అంశాల్లో మూడు ప్రస్తుత కేసులో వర్తిస్తాయని హైకోర్టు పేర్కొంటూ కేసును కొట్టివేసింది.

కాలిఫోర్నియాలో  భూకంపం

అమెరికాలోని కాలిఫోర్నియాలో (California) భారీ భూకంపం (Earthquake) వచ్చింది. ఆదివారం మధ్యాహ్నం 2.42 గంటలకు (అమెరికా కాలమానం) దక్షిణ కాలిఫోర్నియాలోని ఓజాయ్‌ సిటీకి (Ojai city) ఈశాన్యాన భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 5.1గా నమోదయిందని యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే (USGS) తెలిపింది. భూ అంతర్భాగంలో 4.8 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించినట్లు వెల్లడించింది. భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదని అధికారులు వెల్లడించారు.

పాడేరు బస్సు ప్రమాదంలో నాలుగుకు పెరిగిన మృతుల సంఖ్య

పాడేరు ఆర్టీసీ బ‌స్సు ప్ర‌మాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4కు పెరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 45 మంది ఉన్నట్లు పోలీసులు తెలిపారు. 10 మంది తీవ్రంగా గాయపడగా, మిగిలిన 18 మంది స్వల్పంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను పాడేరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.వివ‌రాల్లోకెళ్తే.. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఘాట్ రోడ్డులో చోడవరం నుంచి పాడేరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఆదివారం సాయంత్రం ఘోర ప్రమాదానికి గురైంది. ఘాట్ రోడ్డు వ్యూపాయింట్ వద్ద చెట్టు కొమ్మను దాటే ప్రయత్నంలో డ్రైవర్ బస్సుపై నియంత్రణ కోల్పోయాడు. దీంతో బస్సు లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.ప్రమాద సమయంలో బస్సులో 45 మంది ఉన్నట్లు పోలీసులు తెలిపారు. 10 మంది తీవ్రంగా గాయపడగా, మిగిలిన 18 మంది స్వల్పంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను పాడేరు ప్రభుత్వాసుపత్రికి తరలించామ‌నీ,  ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయ‌ని పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన స్థలంలో  సెల్ ఫోన్ సిగ్నల్స్ కూడ లేవు. దీంతో ప్రమాదం జరిగిన విషయం  బయట ప్రపంచానికి  తెలపడానికి సమయం పట్టిందని బాధితులు చెబుతున్నారు.

బండి సంజయ్ ఏపీ పర్యటన రద్దు

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ విజయవాడ పర్యటన రద్దు అయింది. హైదరాబాద్-గన్నవరం ఫ్లైట్ 4 గంటలు ఆలస్యం కావడంతో పర్యటన రద్దు అయింది. ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంటకు వర్చువల్ ద్వారా ఓటర్ చేతన్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించునున్నారు బండి సంజయ్. అయితే.. బండి సంజయ్ విజయవాడ పర్యటన రద్దు అయింది.ఇవాస్తవానికి ఇవాళ ఉదయం 9.30 గంటలకు గన్నవరం నుంచి ఇంద్రకీలాద్రి చేరుకోవాలని షెడ్యూల్‌ సెట్‌ చేసుకున్నారు బండి సంజయ్‌. ఈ సందర్భంగా అమ్మవారి దర్శనం అనంతరం నేరుగా బీజేపీ ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర కార్యాలయానికి చేరుకోవాలని అనునకున్నారు. అలాగే ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటర్ చేతన్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొని సమీక్షించాలని అనుకున్నారు. కానీ బండి సంజయ్ విజయవాడ పర్యటన రద్దు అయింది.

*  పెన్షన్ కోసం తెలంగాణ సచివాలయం ముట్టడికి దివ్యాంగుల యత్నం

పెన్షన్ ఇవ్వాలని డిమాండ్  చేస్తూ  దివ్యాంగులు  సోమవారంనాడు తెలంగాణ సెక్రటేరియట్‌ ముట్టడికి ప్రయత్నించారు. దివ్యాంగులు సెక్రటేరియట్ కు  ముట్టడించడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.  దివ్యాంగుల పెన్షన్ ను  రూ. 3116 నుండి రూ,4116కు  పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం  నిర్ణయం తీసుకుంది. అయితే  పెంచిన పెన్షన్ తమకు అందడం లేదని కొందరు దివ్యాంగులు సెక్రటేరియట్ ముందు మెరుపు ధర్నాకు ప్రయత్నించారు. ఈ విషయాన్ని గమనించిన భద్రతా సిబ్బంది  ఆందోళనకు యత్నించిన వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఉద్యోగాల నియామకాల్లో తమకు రిజర్వేషన్ ను అమలు చేయాలని  దివ్యాంగులు డిమాండ్  చేస్తున్నారు.

జగన్‌ కక్ష సాధింపును ఖండిస్తూ లోకేశ్‌ ట్వీట్‌ 

పాలకుల అవినీతిని, అసమర్థతను ప్రజల దృష్టికి తెచ్చే మీడియా సంస్థల మీద పగబట్టడం ప్రజాస్వామ్యానికే ముప్పని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ఈనాడు మీద పగబట్టి, ఆ పగను మార్గదర్శి సంస్థలపై తీర్చుకుంటున్న జగన్ రెడ్డి శాడిజాన్ని ప్రజలంతా చూస్తున్నారని హెచ్చరించారు. ఈ మేరకు మీడియా సంస్థలపై జగన్‌ కక్ష సాధింపును ఖండిస్తూ లోకేశ్‌ ట్వీట్‌ చేశారు. తన పగను తీర్చుకోవడానికి జగన్‌ ప్రభుత్వ సంస్థలను వాడుతున్నారు. ఆ సైకో చేష్టల పట్ల ప్రజలకు జుగుప్స కలుగుతోంది. ప్రజల శ్రేయస్సు కోసమైతే పోలవరం కట్టండి.. అమరావతిని నిర్మించండి. ఎస్సీలను చంపి డోర్ డెలివరీ చేసిన వైకాపా నేతలపై చర్యలు తీసుకోండి. ప్రజలను చైతన్యం చేస్తున్న మీడియా అధిపతులను వేధించకండి’’ అని లోకేశ్‌ సూచించారు

 జేసీ ప్రభాకర్ రెడ్డికి 41 సీఆర్‌పీసీ నోటీసు

జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసం ఎదురుగా ఉన్న జూనియర్ కళాశాల ప్రహరీ గోడ నిర్మాణం విదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో జేసీకి పోలీసులు తాజాగా 41 సీఆర్‌పీసీ నోటీసు ఇచ్చారు. అయితే.. ఈ నోటీసు తీసుకోవడానికి ఆయన నిరాకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రహరీ గోడ నిర్మాణ పనులు ఆపాలని తాను ఎక్కడా అనడం లేదన్నారు. కేవలం సర్వే చేసి నిర్మాణం పూర్తి చేయాలని కోరుతున్నానని అన్నారు. అధికారులకు ఎన్నిసార్లు వినతి పత్రం ఇచ్చినా.. కనీస స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిబంధనల మేరకు సర్వే చేయాలని అధికారులను కోరారని, కానీ ఫలితం లేదని వాపోయారు.మున్సిపల్ ఉద్యోగుల కోసం 1983లో లే అవుట్‌లోనే 50 అడుగులు రోడ్డు ఉందని జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. 2022లో 60 అడుగులతో మున్సిపల్ అఫ్రూవల్ ఉందని.. ఆర్ అండ్ బి అధికారులకు ఆర్జీలు పెట్టుకున్నానని గుర్తు చేశారు. కానీ.. ఇప్పుడున్న ఎమ్మెల్యే (కేతిరెడ్డి పెద్దారెడ్డిని ఉద్దేశిస్తూ) అన్నీ సగం సగం పనులు చేసి, ఊరును పాడు చేస్తున్నాడని ఆరోపణలు చేశారు. పోలీసులు బందోబస్తు పెట్టుకుని గోడ కడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజావేదికను కూల్చడానికి 10 నిమిషాలు పట్టలేదని.. అదే విధంగా ప్రహరీ గోడ ఎన్ని రోజుల్లో కట్టారో, అన్ని నిమిషాల్లోనే కూలుస్తామని హెచ్చరించారు. ఐఏఎస్ & ఐపీఎస్‌కు సెల్యూట్ చేస్తున్నానని.. ఈ అధికారులు తప్పుల మీద తప్పులు చేస్తున్నారని.. మీకసలు నిద్రెలా పడుతోందని జేసీ ప్రశ్నించారు.

*  ఉత్తరాఖండ్‌ను ముంచెత్తుతున్న భారీ వర్షాలు

ఉత్తరాది రాష్ట్రాలను గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి.
ముఖ్యంగా హిమాచల్‌ ప్రదేశ్ (Himachal Pradesh)‌, ఉత్తరాఖండ్‌ (Uttarakhand)లో కుంభవృష్టి
కురుస్తోంది. ఎడతెరిపి లేని భారీ వర్షంతో రెండు రాష్ట్రాల్లో జనజీవనం అస్తవ్యస్థంగా మారింది. కొండ
రాష్ట్రాల్లోని పలు నదులు పొంగి పొర్లుతుండటంతో లోతట్టు ప్రాంతాలను వరద ముంచెత్తుతోంది. రోడ్లు,
వంతెనలు కొట్టుకుపోయాయి. పలు చోట్ల ఇళ్లు పేకమేడల్లా కూలి వరద ప్రవాహంలో
కొట్టుకుపోతున్నాయి. చాలా చోట్ల కొండచరియలు విరిగిపడటంతో పలు రోడ్లను అధికారులు
మూసివేశారు. ఈ వరదల కారణంగా రెండు రాష్ట్రాల్లో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. మొత్తం 88 మంది ప్రాణాలు కోల్పోగా.. రూ.10వేల కోట్లకు పైనే ఆస్తి నష్టం వాటిల్లింది.ఇదిలా ఉండగా.. ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో నేడు, రేపు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ(IMD) హెచ్చరించింది. ఈ మేరకు ఐదు జిల్లాలకు అలర్ట్‌ ప్రకటించింది. రాష్ట్రంలోని పౌరి, డెహ్రాడూన్‌,నైనిటల్‌, చంపావత్‌, భాగేశ్వర్‌ జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది.మరోవైపు చండీగఢ్ దాని పరిసర ప్రాంతాల్లో ఆదివారం భారీ వర్షం కురిసింది. పంజాబ్‌లోని మొహాలీ,హర్యానాలోని పంచకుల తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసినట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది.రాబోయే రెండు రోజుల్లో పంజాబ్‌, హర్యానాలో వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది.ఇప్పటికే కుండపోత వర్షాలతో అతలాకుతలమైన హిమాచల్‌ప్రదేశ్‌కు (Himachal Pradesh) మరో ముప్పు,పొంచి ఉంది. నేటి నుంచి ఈ నెల 24 వరకు భారీ నుంచి అతిభారీ వర్షాలు (Very heavy rain)కురుస్తాయని వాతావరణ శాఖ (MET) హెచ్చరించింది. దీంతో ఈ నెల 22 నుంచి 24 వరకు ఆరెంజ్‌ అలర్జ్‌,నేడు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. ఇక భారీ వర్షాలతో ఛంబా (Chamba), మండి (Mandi) జిల్లాలను ఆకస్మిక,వరదలు ముంచెత్తే అవకాశం ఉందని పేర్కొంది. వర్షాల వల్ల కొండ చరియలు విరిపడుతాయని, నదులు,వాగుల్లో నీటిమట్టం పెరిగే అవకాశం ఉందని తెలిపింది.

హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస్ కు క్లాస్ పీకిన హరీష్ రావు

వైద్యారోగ్యశాఖ డైరెక్టర్‌కు మంత్రి హరీష్ రావు వార్నింగ్ ఇచ్చారట. అధికారిగా ఉంటూ రాజకీయ ప్రకటనలు చేస్తున్న వైద్యరోగ్యశాఖ డైరెక్టర్ గడల శ్రీనివాస్ కు మంత్రి హరీష్ రావు క్లాస్ తీసుకున్నట్లు సమాచారం. రాజకీయ ప్రకటనలు మానుకోవాలని శ్రీనివాసును హరీష్ రావు హెచ్చరించారట. అవకాశం ఇస్తే తాను బిఆర్ఎస్ తరపున కొత్తగూడెం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని డిహెచ్ శ్రీనివాస్ ఇప్పటికే పలుమార్లు ప్రకటించిన విషయం తెలిసిందే.అయితే.. ఈ విషయంపై డాక్టర్ గడల శ్రీనివాసరావు స్పందించారు. కొత్తగూడెంలో పొలిటికల్ కామెంట్లు చేయొద్దని గౌరవ మంత్రి హరీశ్‌రావు గారు నాకు సూచించినట్లుగా, ఫోన్ చేసి క్లాస్ తీసుకున్నట్టుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవం అన్నారు డాక్టర్ గడల శ్రీనివాసరావు. డాక్టర్ జీఎస్‌ఆర్ ట్రస్ట్ సేవా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆదివారం కొత్తగూడెంలోనే ఉన్నాను. అక్కడి ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు గడప గడపకు గడల కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని పేర్కొన్నారు. ఈ క్రమంలో గిట్టని వ్యక్తులు తప్పుడు ప్రచారాలు చేయిస్తున్నారు. ప్రజలు, మీడియా మిత్రులు ఆ ప్రచారాలను నమ్మొద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. ఎవరెన్ని అడ్డుపుల్లలు వేసినా కొత్తగూడెంలో డా.జీఎస్‌ఆర్ ట్రస్ట్ సేవలు నిరాటంకంగా కొనసాగిస్తామని ప్రకటించారు డాక్టర్ గడల శ్రీనివాసరావు.

* రాజీవ్‌ గాంధీ రాజకీయ జీవితం అత్యంత దారుణ రీతిలో ముగిసిందని : సోనియా గాంధీ

మాజీ ప్రధాని దివంగత రాజీవ్‌ గాంధీ(Rajiv Gandhi) రాజకీయ జీవితం అత్యంత దారుణ రీతిలో ముగిసిందని ఆయన సతీమణి, కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ(Sonia Gandhi) అన్నారు. కానీ ఆయన పాలించిన కొద్దికాలంలోనే ఎన్నో కీలక విజయాలను సాధించారని తెలిపారు. 25వ రాజీవ్‌ గాంధీ నేషనల్‌ సద్భావన అవార్డు కార్యక్రమంలో ఆమె ప్రసంగించారు.‘రాజీవ్ గాంధీ(Rajiv Gandhi) రాజకీయ జీవితం దారుణమైన రీతిలో ముగిసింది. కానీ.. ఆయన పాలించిన కొద్దిసమయంలోనే లెక్కలేని విజయాలు సాధించారు. ఆయన మహిళా సాధికారతకు కృషి చేశారు. పంచాయతీలు, మున్సిపల్‌ కార్పొరేషన్లలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు పోరాటం చేశారు. స్థానిక సంస్థల్లో ప్రస్తుతం భారీ స్థాయిలో ఎన్నికైన మహిళా ప్రజాప్రతినిధులు ఉన్నారంటే.. అందుకు రాజీవ్ కఠోర శ్రమ, దూరదృష్టే కారణం. అలాగే ఓటు వేసే వయసును 21 నుంచి 18కి తగ్గించారు’ అంటూ ఆయన హయాంలో తీసుకున్న నిర్ణయాలను సోనియా కొనియాడారు.అలాగే విద్వేషం, సమాజంలో విభజన, పక్షపాత రాజకీయాలు చురుగ్గా మారుతున్నాయని, వాటికి అధికార పక్షం నుంచి మద్దతు లభిస్తోందని విమర్శించారు. ఈ తరుణంలో మత సామరస్యం, శాంతి, దేశ ఐక్యత వంటి సిద్ధాంతాలు ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయని ఆమె అన్నారు. అన్ని మతాలు, సంస్కృతులు, భాషలు, జాతుల సమాహారం వల్లే ఈ దేశ ఐక్యత బలోపేతం అవుతుందని రాజీవ్‌ భావించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాజస్థాన్‌లోని బనస్థలి విద్యాపీఠ్‌కు 2020-21వ సంవత్సరానికి 25వ రాజీవ్‌ సద్భావన అవార్డును ఆదివారం మాజీ ఉపరాష్ట్రపతి హమీద్‌ అన్సారీ బహూకరించారు. ఈ అవార్డు కింద రూ.10 లక్షల నగదు, ప్రశంసా పత్రం.. ఆ సంస్థకు చెందిన సిద్ధార్థ్‌ శాస్త్రికి అందజేశారు.