Devotional

శ్రీ‌హ‌రికి రెండు బ్ర‌హ్మోత్స‌వాల తేదీలు ఫిక్స్

శ్రీ‌హ‌రికి రెండు బ్ర‌హ్మోత్స‌వాల తేదీలు ఫిక్స్

తాజా… తిరుమల\❗/సమాచారం

శ్రీ‌హ‌రికి రెండు బ్ర‌హ్మోత్స‌వాలు

– సెప్టెంబ‌రు 18 నుండి 26వ తేదీ వ‌రకు సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాలు

– అక్టోబ‌రు 15 నుండి 23వ తేదీ వ‌రకు న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాలు

పురాణాల ప్రకారం శ్రీనివాసుడు వేంకటాద్రిపై వెలిసిన తొలినాళ్లలోనే బ్రహ్మదేవున్ని పిలిచి లోకకల్యాణం కోసం తనకు ఉత్సవాలు నిర్వహించాలని ఆజ్ఞాపించారట. స్వామివారి ఆజ్ఞ ప్రకారమే శ్రీవేంకటేశ్వరుడు ఆనందనిలయం మధ్యలో ఆవిర్భవించిన కన్యామాసం(ఆశ్వయుజం)లోని శ్రవణా నక్షత్రం నాటికి పూర్తయ్యేలా బ్రహ్మదేవుడు తొమ్మిదిరోజుల పాటు బ్రహ్మోత్సవాలను నిర్వహించార‌ట‌. అందువల్లే ఇవి ‘బ్రహ్మోత్సవాలు’గా ప్రసిద్ధిచెంది అప్పటినుండి నిరాటంకంగా కొనసాగుతున్నాయి.

చాంద్రమానం ప్రకారం ప్రతి మూడో ఏటా అధికమాసం వస్తూ ఉంటుంది. ఇలా వచ్చిన సందర్భాల్లో కన్యామాసం(భాద్రపదం)లో వార్షిక బ్రహ్మోత్సవాలు, దసరా నవరాత్రుల్లో (ఆశ్వయుజం) నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఈ రెండు బ్రహ్మోత్సవాలకు పెద్ద తేడా లేదుగానీ, నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణం, ధ్వజావరోహణం ఉండవు. ఈ ఏడాది అధికమాసం ఉన్న కారణంగా సెప్టెంబరు 18 నుండి 26వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబరు 15 నుండి 23వ తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి.

సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాల్లో ప్ర‌ధానంగా సెప్టెంబ‌రు 18న ధ్వ‌జారోహ‌ణం, సెప్టెంబ‌రు 22న గ‌రుడ వాహ‌నం, సెప్టెంబరు 23న స్వ‌ర్ణ‌ర‌థం, సెప్టెంబ‌రు 25న ర‌థోత్స‌వం(మ‌హార‌థం), సెప్టెంబ‌రు 26న చ‌క్ర‌స్నానం, ధ్వ‌జావ‌రోహ‌ణం జ‌రుగ‌నున్నాయి.

న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాల్లో ప్ర‌ధానంగా అక్టోబ‌రు 19న గ‌రుడ‌వాహ‌నం, అక్టోబ‌రు 22న స్వ‌ర్ణ‌ర‌థం, అక్టోబ‌రు 23న చ‌క్ర‌స్నానం జ‌రుగ‌నున్నాయి.

ఆర్జిత సేవ‌లు ర‌ద్దు

బ్ర‌హ్మోత్స‌వాల కార‌ణంగా సెప్టెంబ‌రు 18 నుండి 26వ తేదీ వ‌ర‌కు, అక్టోబ‌రు 15 నుండి 23వ తేదీ వ‌ర‌కు అష్ట‌ద‌ళ‌పాద‌ప‌ద్మారాధ‌న‌, తిరుప్పావ‌డ‌, క‌ల్యాణోత్స‌వం, ఊంజ‌ల్‌సేవ‌, స‌హ‌స్ర‌దీపాలంకార సేవ‌ల‌ను టీటీడీ ర‌ద్దు చేసింది. ముంద‌స్తుగా ఆర్జిత బ్ర‌హ్మోత్స‌వం సేవా టికెట్లు బుక్ చేసుకున్న భ‌క్తుల‌ను నిర్దేశిత వాహ‌న‌సేవ‌కు మాత్ర‌మే అనుమ‌తిస్తారు. న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాల అంకురార్ప‌ణ కార‌ణంగా అక్టోబ‌రు 14న స‌హ‌స్ర‌దీపాలంకార సేవ‌ను టీటీడీ ర‌ద్దు చేసింది.