Business

తెలంగాణలో మద్యం దుకాణాలకు నేడు లక్కీ డ్రా

తెలంగాణలో మద్యం దుకాణాలకు నేడు లక్కీ డ్రా

 తెలంగాణ రాష్ట్రంలో అబ్కారీ శాఖ.. ప్రభుత్వానికి రెండో అతిపెద్ద ఆదాయ వనరుగా మారింది. ప్రతి ఏడాది ఈ శాఖ ద్వారా 35 వేల కోట్లకు పైగా రాబడి వస్తోంది. రాష్ట్రంలోని 2,620 మద్యం దుకాణాలు ఏర్పాటు చేసుకునేందుకు 2021-23 మద్యం విధానంలో 68,691 దరఖాస్తులు రావడంతో.. తద్వారా రూ.1,357 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. అయితే ఈసారి లక్ష దరఖాస్తులు వస్తాయని తద్వారా రెండువేల కోట్లు మేర మొత్తం రాబడి ప్రభుత్వానికి వస్తుందని అధికారులు అంచనా వేశారు.

 కానీ.. అధికారుల అంచనాలను తిరగరాసేంత ఎక్కువగా రూ.2639.28 కోట్లు ఆదాయం వచ్చింది. ఇది సరికొత్త రికార్డుగా చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో  మద్యం దుకాణాల కోసం వచ్చిన దరఖాస్తులను (Applications For Liquor License Telangana 2023) పరిశీలించినట్లయితే 2,620 దుకాణాల కోసం లక్షా 31 వేల 964 దరఖాస్తులు వచ్చి ఒక్కో మద్యం దుకాణానికి సగటున 50కి పైగా దరఖాస్తులు రాగా, హైదరాబాద్, రంగారెడ్డి, సరూర్‌, శంషాబాద్‌, మెడ్చల్‌, మల్కాజిగిరి అబ్కారీ జిల్లాల పరిధిలో ఉన్న 615 మద్యం దకాణాలకు ఏకంగా ఒక్కో దుకాణానికి 69కి పైగా అర్జీలు అందాయి.

అత్యధికంగా దరఖాస్తులు వచ్చిన అబ్కారీ జిల్లాలను పరిశీలిస్తే.. శంషాబాద్‌లో 100మద్యం దుకాణాలకు10,621 దరఖాస్తులు రావడంతో ఇక్కడ ఒక్కో మద్యం దుకాణానికి 106కు పైగా దరఖాస్తులు వచ్చాయి. అదేవిధంగా సరూర్‌ నగర్‌లో 134 దుకాణాలకు 10,994 దరఖాస్తులు వచ్చి ఒక్కో దుకాణానికి 82 దరఖాస్తులు వచ్చినట్లు అబ్కారీ శాఖ వెల్లడించింది.అదిలాబాద్‌లో 40 దుకాణాలకు 979 దరఖాస్తులు రాగా ఒక్కో దుకాణానికి కేవలం 24 దరఖాస్తులు(Liquor Shop Tender Telangana 2023)వచ్చాయి. అసిఫాబాద్‌ అబ్కారీ జిల్లాలో 32 దుకాణాలకు 967 దరఖాస్తులు వచ్చి, ఒక్కో దుకాణానికి 30 దరఖాస్తులు మాత్రమే వచ్చాయని అబ్కారీ శాఖ వెల్లడించింది. ఈ రెండు జిల్లాల్లో అతితక్కువ దరఖాస్తులు వచ్చాయి. ఇంత భారీ ఎత్తున దరఖాస్తులు రావడానికి తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, మహారాష్ట్ర, దిల్లీ, మద్యప్రదేశ్‌, ఛత్తీస్​గఢ్ రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు కూడా పెద్ద సంఖ్యలో అర్జీలు వేసినట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. ఇంత భారీ ఎత్తున స్పందన రావడం ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత దరఖాస్తుల రుసుం ద్వారా ఏకంగా రూ.2,639.28 కోట్లు రావడం రికార్డులను తిరగరాసినట్లైంది.

దరఖాస్తుల ప్రక్రియ ముగియడంతో ఈరోజు లక్కీ డ్రా ద్వారా మద్యం దుకాణాలు కేటాయింపు   కార్యక్రమానికి అబ్కారీ శాఖ సిద్ధమవుతోంది. రాష్ట్రలోని 34 అబ్కారీ జిల్లాలల్లో ఈ లక్కీ డ్రా కార్యక్రమం ఆయా జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో అబ్కారీ శాఖ నిర్వహిస్తుంది. మొత్తం 2,620 మద్యం దుకాణాలల్లో 786 దుకాణాలు గౌడ్లు, ఎస్సీ, ఎస్టీలకు కేటాయించగా మిగిలిన 1,834 దుకాణాలను ఇతరులకు కేటాయిస్తారు. ప్రతి దుకాణానికి ప్రత్యేకంగా లక్కీ డ్రా తీయాల్సి ఉండడంతో.. అబ్కారీ శాఖ ఫంక్షన్‌ హాలుల్లో నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. అక్కడ లక్కీ డ్రా(Liquor Shops Lucky Draw) లో పాల్గొనేందుకు వచ్చిన దరఖాస్తుదారులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేయాలని ఎక్సైజ్‌ శాఖ కమిషనర్‌, డైరెక్టర్‌ ముషారఫ్‌ ఫరూఖ్‌ అధికారులను ఆదేశించారు.