ప్రపంచంలో 2050 నాటికి రమారమి వంద కోట్ల మంది ప్రజలు కీళ్లవ్యాధితో జీవించాల్సిన పరిస్థితులు తలెత్తుతాయని ‘లాన్సెట్ రుమటాలజీ జర్నల్’లో ప్రచురితమైన పరిశోధన పత్రం చెబుతోంది. 30 ఏళ్లు, అంతకుమించిన వయసువారిలో ప్రపంచంలో 15% మంది ప్రస్తుతం ఆ సమస్యతో సతమతం అవుతున్నారు. 1990-2020 మధ్య కాలానికి సంబంధించి 200 దేశాల నుంచి సేకరించిన సమాచారాన్ని విశ్లేషించినమీదట అధ్యయన నివేదికను రూపొందించారు. 1990లో 25.60 కోట్లమంది దీనిబారిన పడితే 2020 నాటికి అది 59.50 కోట్లకు (132%) పెరిగింది. ‘ప్రపంచ వ్యాధుల భారం అధ్యయన నివేదిక 2021’లో భాగంగా వాషింగ్టన్లºని ‘ఆరోగ్య గణాంకాల మదింపు సంస్థ’ (ఐహెచ్ఎంఈ) దీనిని రూపొందించింది. ప్రధానంగా- వయోభారం, జనాభా పెరుగుదల, స్థూలకాయం అనే మూడు కారణాల వల్ల కీళ్ల సమస్యలు వేగంగా పెరిగిపోతున్నాయని అధ్యయనకర్తలు తేల్చారు. జనాభాలో స్థూలకాయాన్ని నియంత్రించగలిగితే ఈ సమస్యను 20% మేర తగ్గించవచ్చని వారు పేర్కొన్నారు. శారీరక శ్రమ చేస్తున్నకొద్దీ జీవితంలో త్వరగా గాయాలపాలయ్యే ప్రమాదాన్ని తప్పించుకోవడంతోపాటు కీళ్ల సమస్యల నుంచీ బయటపడవచ్చని ఐహెచ్ఎంఈ శాస్త్రవేత్త లియానే ఆంగ్ తెలిపారు. మోకాలు, తుంటిఎముకలో ఇబ్బంది ఎదుర్కొనే అవకాశం పురుషుల (39%) కంటే మహిళల్లోనే ఎక్కువ (61%) అని అధ్యయనం పేర్కొంది. ప్రస్తుతానికి ఆస్టియో ఆర్థరైటిస్ నిర్మూలనకు సమర్థమైన చికిత్స అందుబాటులో లేనందున.. అది రాకుండా చూసుకోవడమే మేలని సూచించింది. కీళ్ల మార్పిడి చికిత్సలను తక్కువ ఆదాయం ఉన్న దేశాలకూ అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని పేర్కొంది.